నువ్వు దొంగవు రా…నువ్వే పచ్చి లంగవురా!

thitudu
-అధికార పార్టీ నేతల బూతుపురాణం
-మెదక్ డీఆర్‌సీ సమావేశంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ
– కొట్టుకునేందుకు సిద్ధమైన ముత్యంరెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్
– చెవులు మూసుకున్న మంత్రులు.. బిత్తరపోయిన అధికారులు
నువ్వు దొంగవు రా…నువ్వే పచ్చి లంగవురా! నీకు సిగ్గుందారా… నువ్వో పెద్ద వేస్ట్‌గాడివి. ఇలా ఒకరినొకరు ఇద్దరు ప్రజాప్రతినిధులు కసిదీరా బూతులతో తిట్టుకున్నారు. పత్రికల్లో రాయలేని బూతులను ప్రయోగించారు. కొట్టుకోవడానికి సిద్ధమై కుర్చీ ఎత్తారు, కాలర్లు పట్టుకోబోయారు. ఇలా తిట్టుకున్న ఇద్దరు సాధారణ వ్యక్తులు కాదు. ఒకరు దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి, మరొకరు ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్. ఇద్దరు సీనియర్ మహిళా మంత్రులు, జిల్లా స్థాయి అధికారుల సమక్షంలో వీరి తిట్లపురాణం నడిచింది. వీరి మాటలకు మంత్రులు చెవులు మూసుకుంటే.. బిత్తర పోవడం అధికారుల వంతైంది. శనివారం నిర్వహించిన మెదక్ జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి (డీఆర్సీ) సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రజాప్రతినిధుల వీధి పోరాటం
జిల్లా ఇన్‌చార్జి మంత్రి డీకే అరుణ అధ్యక్షతన డీఆర్సీ సమావేశం నిర్వహించారు. జిల్లాకు చెందిన భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డితోపాటు జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, నందీశ్వర్‌గౌడ్, కిష్టారెడ్డి, నర్సారెడ్డి, ముత్యంరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, స్వామిగౌడ్, పాతూరి సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి హాజరయ్యారు. దుబ్బాక నియోజవర్గ పరిధిలోని చేగుంట మండలంలో తనకు తెలియకుండానే వివిధ పనులు, నిధులు ఎలా మంజూరుచేస్తున్నారని జిల్లా కలెక్టర్ దినకర్‌బాబును ఎమ్మెల్య ముత్యంరెడ్డి ప్రశ్నించారు. ‘నాకేమీ అర్థం కావడంలేదు. ఆత్మక్షోభిస్తున్నది. పొమ్మంటే పోతాం. ఇక ఇక్కడ ఉండలేం’ అంటూ ముత్యంరెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోవడానికి లేచారు. మంత్రులు డీకే అరుణ, గీతారెడ్డి, కలెక్టర్‌లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. అప్పుడే ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్ లేచారు. ఎమ్మెల్సీగా కలెక్టర్‌కు చెప్పి పనులు చేయించుకునే అధికారం తనకు లేదా? అని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. నువ్వెవ్వడివి? నా నియోజకవర్గంలో పనులు చేయించుకోవడానికి.. నీకు ఎవరైనా ఓట్లు వేశారా ప్రజల ఓట్లతో గెలిచింది నేను..నువ్వు ఎవడివిరా అని ముత్యంరెడ్డి తిట్టడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నన్ను ఎమ్మెల్సీని చేసింది. నువ్వెవడివిరా.. నన్ను వద్దనడానికి అని ఫారూఖ్ హుస్సేన్ ప్రతిస్పందించారు.

ఒకరి నొకరు ఇష్టమొచ్చినట్టు బూతుమాటలు తిట్టుకున్నారు. పత్రికల్లో రాయలేని బూతులు వినలేక మంత్రులు డీకే అరుణ, మంత్రి గీతారెడ్డిలు చెవులు మూసుకున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థంకాక కలెక్టర్, జేసీ, అదనపు జేసీ, డీఆర్వోలతోపాటు అన్ని శాఖల జిల్లా అధికారులు బిత్తరపోయారు. కొద్దిసేపటి వరకు వారిద్దరిని ఎవరూ వారించకపోవడం గమనార్హం. ఇంతలో మంత్రి అరుణ కల్పించుకుని అధికార పార్టీ నేతలు ఇలా తిట్టుకోవడం మంచిది కాదంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వాడు నాకు చెబుతాడా..? నా రాజకీయ జీవితంలో 9 మంది ముఖ్యమంత్రులను చూశా, వీడు నా గురించి మాట్లాడుతాడా అని ముత్యంరెడ్డి తిట్టిపోశారు. మంత్రులు నచ్చజెప్పడంతో తిరిగి ఇద్దరు కూర్చున్నారు. కొన్ని నిమిషాలకే ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ మొదలైంది. నువ్వేం చేస్తావంటే.. ఏం చేస్తావంటూ కాలర్‌లు పట్టుకోవడానికి ఇద్దరూ దగ్గరగా వచ్చారు. ముత్యంరెడ్డి కుర్చి పైకి లేపబోయారు. ఇద్దరి మధ్యలో కూర్చున్న మరో ఎమ్మెల్యే నర్సారెడ్డి, మంత్రులు నచ్చజెప్పేసరికి తలప్రాణం తోకకొచ్చింది. తర్వాత సమావేశం కొనసాగింది. బయటకు వచ్చాక ఎవరికి వారు మీడియాతో మాట్లాడారు. కనీసం సర్పంచ్ కూడా కాలేని ఫారూఖ్ హుస్సేన్ వేస్ట్‌గాడు. జేబులు కొట్టేటోడు నన్ను విమర్శిస్తాడా అని ముత్యంరెడ్డి ఆరోపించారు. టీడీపీకి రాజీనామా చేయకుండా రాత్రికి రాత్రి కాంగ్రెస్‌లోకి వచ్చినా, ముత్యంరెడ్డిని కష్టపడి గెలిపించుకున్నాం. ఆయన మాత్రం కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఫారూఖ్‌హుస్సేన్ మండిపడ్డారు. దమ్ముంటే సిద్దిపేటలో ఎమ్మెల్యేగా గెలువు అని ముత్యంరెడ్డి అంటే.. నువ్వు ఈ సారి దుబ్బాకలో గెలుస్తావా?అని ఫారూఖ్ హుస్సేన్ విలేకరుల ఎదుట సవాల్ చేసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు దూషించుకోవడాన్ని టీవీల్లో చూసిన జనం వీళ్ల్లేనా మన ప్రజాప్రతినిధులు అని ముక్కున వేలేసుకున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.