నిలిచిపోయిన లోక్‌సభ ప్రత్యక్ష ప్రసారాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: తెలంగాణ బిల్లు ఆమోద ప్రక్రియకు సంబంధించిన కీలకమైన 90 నిమిషాల కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాలను లోక్‌సభ టీవీ నిలిపివేసింది. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తెలంగాణ బిల్లు చర్చ ను చేపట్టిన తర్వాత హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ప్రసంగం ప్రారంభం కాగానే ప్రసారాలు నిలిచిపోయాయి. లోక్‌సభ టీవీ ‘సభవాయిదా పడింది’ అని ప్రకటించింది. అయితే సభ లోపల కార్యకలాపాలు మాత్రం యథావిధిగా సాగాయి. తర్వాత కొంతసేపటికి ‘కొద్దిసేపట్లో సభ లైవ్’ అంటూ టీవీ మరోవూపకటన వేసింది. అయితే ప్రసారాలు మాత్రం జరగలేదు. 90 నిమిషాల కార్యకలాపాల అనంతరం లోక్‌సభ తెలంగాణ బిల్లును ఆమోదించి వాయిదా పడిం ది. నిబంధనల ప్రకారం టీవీలో సభ కార్యకలాపాల ప్రసారాలను నిలిపివేసే అధికారం స్పీకర్‌కు ఉంది. గురువారం సభలో జరిగిన పెప్పర్ స్ప్రే వంటి సం ఘటనలు పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో స్పీకర్ మీరాకుమార్ ప్రసారాల నిలిపివేతకు నిర్ణయించారని ప్రచారం జరిగింది. కాగా, లోక్‌సభ టీవీ ప్రత్యక్ష ప్రసారాలు ఆగిపోవడం తీవ్ర వివాదానికి దారి తీసింది.

ప్రభుత్వం కావాలని ప్రసారాలు నిలిపివేయించిందంటూ పలు రాజకీయ పార్టీలు విరుచుకుపడ్డాయి. ప్రసారాల నిలిపివేత గుర్తించగానే పలు రాజకీయపక్షాలు సభనుంచి వాకౌట్ ప్రకటించాయి. వాటిలో తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్‌యూ తదితర పార్టీలు ఉన్నాయి. బీజేపీ సభ్యులు సీట్లనుంచి లేవడానికి ప్రయత్నించగా సుష్మా వారిస్తూ సైగ చేశారు.1996 నుంచి ప్రారంభమైన టీవీ లైవ్ ప్రసారాలను నిలిపివేసిన సందర్భం ఎప్పుడూ లేదని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, లోక్‌సభ కార్యకలాపాల ప్రసారాలు నిలిపివేయాలని స్పీకర్ నిర్ణయించారన్న విషయం తనకు తెలియదని లోక్‌సభలో బీజేపీ పక్షనేత సుష్మాస్వరాజ్ విలేకరులకు చెప్పారు. అయితే ఇతర పక్షాలతో కలిసి వాకౌట్ చేయని విషయమై మాట్లాడుతూ కాంగ్రెస్ రాజకీయ క్రీడను నిరసించినప్పటికీ తాము తొలినుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తున్నామని వివరణ ఇచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడబలుక్కున్నాయని దుమ్మెత్తి పోశారు.

బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇలాంటి ఘటన జరగడం తన రాజకీయ జీవితంలో తొలిసారి అని, కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని చీకట్లో ఉంచిందని అన్నారు. జేడీయూ అధ్యక్షుడు శరద్‌యాదవ్ మాట్లాడుతూ ఈ చర్యను భరించలేక తమ పార్టీ వాకౌట్ చేసిందని, ఇలాంటి విభజనలో తాము భాగం కాదల్చుకోలేదని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు దినేశ్ త్రివేది ప్రసారాల నిలిపివేతపై ఆగ్రహం కన్నా ఆవేదనే ఎక్కువ కలుగుతున్నదన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎవరూ అంగీకారం తెలుపకుండానే బిల్లును సభలో పెట్టారని, పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్, హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేలు ఈ విషయమై మాట్లాడేందుకు నిరాకరించారు.

సాంకేతిక అవరోధం వల్లే..
ఈ విషయమై స్పీకర్ మీరాకుమార్ కార్యాలయం ఒక ప్రకటన చేస్తూ సాంకేతిక సమస్య ఏర్పడడం వల్లే సభ ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయాయని వివరణ ఇచ్చింది. తర్వాత లోక్‌సభ టీవీ సీఈవో రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ సాంకేతిక అవరోధం కారణంగా ఈ అంతరాయం వాటిల్లిందని చెప్పారు. టెక్నికల్ స్నాగ్ కారణంగా లోక్‌సభలోని 50వ నెంబర్ గదినుంచి సిగ్నల్ అందడం ఆగిపోయిందని, చేసేదేం లేక ప్రసారాలు ఆపేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఈ విషయమై సిబ్బందితో అత్యవసరంగా చర్చిస్తున్నామని, సవివరణ నివేదిక రేపటికల్లా వస్తుందని పేర్కొన్నారు. కాగా బిల్లు ఆమోద ప్రక్రియ ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగిందనడం సరికాదన్నారు. ప్రసారాలు నిలిచిపోయినా ప్రెస్‌గ్యాలరీ నిండా విలేకరులున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రి య ఎలా జరిగిందో వీక్షించారని వివరించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.