నిర్వాకం

నమ్ముకొని పెత్తనము ఇస్తే
నమ్మకము పోగొట్టుకొంటివి
కుప్పకావలి ఉండి కట్టలు
తప్పదీస్తివి ముద్దెరేస్తివి

సాటివాడు చేరదీస్తే
నోటినిండా మన్ను గొడ్తివి
పదవి అధికారముల బూని
పదిలముగ తల బోడి జేస్తివి

దాపునకు రానిస్తె చనువుగ
టోపి పెడితివి లాభపడితివి
అన్నవై తమ్ముళ్ల తలలను
నున్న జేస్తివి మురియబడితివి

తొత్తులను చుట్టూర జేర్చుక
పెత్తనాలు చేయబడితివి
‘పొచంపాడు’ పథకము
కూచికూచి చేసేస్తివి

‘దొంగ ముల్కి’ సనదులిచ్చి
దొరతనమ్ము వెలిగిస్తివి
తమ్ములను ఇన్నాళ్లబట్టి
వమ్మజేస్తివి తిన్నగుంటివి

ఎన్నిసార్లు మొత్తుకున్నను
అన్నవయ్యును గమ్మునుంటివి
అన్న అధికారమునకు తగిన
న్యాయబుద్దిని కోలుపోతివి

చిలిపి చేష్టలు చేసి ఇప్పుడు
చిలుక పలుకలు పలుకుచుంటివి
–కాళోజి

This entry was posted in POEMS.

Comments are closed.