నిన్ను సీఎంను చేసిన అధిష్టానానికే ఎదురుతిరుగుతవా?: డీఎస్

నిజామాబాద్ : రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ధిక్కరించడం ఎంత వరకు సబబు అని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విభజించొద్దు అని, అంత కంటే ముందు నది జలాల పంపిణీ, హైదరాబాద్ సమస్యను పరిష్కారించాలని అధిష్టానాన్ని సీఎం ప్రశ్నించిన విషయం విదితమే. సీఎం వ్యాఖ్యలపై డీఎస్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయం నచ్చకుంటే కోర్‌కమిటీ సమావేశంలోనే చెప్పి వచ్చి ఉంటే బాగుండేదని సీఎంను ఉద్దేశించి డీఎస్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడుతున్న సమయంలో ఒక ప్రాంత నేతగా సీఎం మాట్లాడటం సరికాదన్నారు. ఇంతకీ ప్రాంతానికా? లేక రాష్ట్రానికా? సీఎం అని నిలదీశారు. అధిష్టానం నియమిస్తే సీఎం అయిన కిరణ్ హైకమాండ్ నిర్ణయాన్నే దిక్కరించేటట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

అభద్రతా భావం కలిగించేలా సీఎం వ్యాఖ్యలు
ఇరు ప్రాంతాల ప్రజల్లో అభద్రతా భావం కలిగించేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని డీఎస్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన విషయంలో ఏమైనా సమస్యలుంటే హైకమాండ్‌తో సీఎం చెప్పుకోవాలి కానీ వైషమ్యాలు సృష్టించడం సరికాదన్నారు. ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రిలా కిరణ్ మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. అసలు సీఎంను ఎవరూ పొమ్మన్నారు.. ఇక్కడే దర్జాగా ఉండొచ్చు అని భరోసా ఇచ్చారు. అధిష్టానం దయాదాక్షిణాల వల్లే సీఎం అయ్యాయన్న విషయాన్ని కిరణ్ గుర్తుంచుకోవాలని డీఎస్ సూచిచారు.

పంపకాల్లో శాస్త్రీయ పద్ధతి ఉంటుంది : డీఎస్
ఏ రెండు ప్రాంతాలైనా విడిపోయినపుడు నదీ జలాల పంపిణీ విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ శాస్త్రీయ పద్ధతి ప్రకారం పరిష్కారం ఉంటుందని తెలిపారు. తెలంగాణ నుంచే రాయలసీమకు బొగ్గు తరలిస్తూ ఇక్కడ విద్యుత్ కొరత ఏర్పడుతుందని సీఎం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణలో బొగ్గు గనులున్నా విద్యుత్ ఉత్పత్తిని ఎందుకు పెంచలేదు అని ప్రశ్నించారు. అన్నారు. రాష్ట్రాల మధ్య నీళ్లను పంచుకోవడం కష్టామా అని అడిగారు. నదీ జలాల పంపకాలన్నీ అంతరాష్ట్రలతోనే ముడిపడి ఉన్నాయని తెలిపారు. భారత్ – పాకిస్తాన్ మధ్య కూడా నదులను పంచుకుంటున్నామని గుర్తు చేశారు.

పెద్ద మనషుల ఒప్పందం సక్రమంగా జరిగి ఉంటే….
పెద్ద మనషుల ఒప్పందం సక్రమంగా అమలు జరిగి ఉంటే తెలంగాణకు నేడు ఈ పరిస్థితి దాపురించేది కాదన్నారు. ఉద్యోగాలు, నిధులు, నీళ్ల కోసమే తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తున్నారని తెలిపారు. పోరాటాల ఫలితమే తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ కోసం వందలాది విద్యార్థులు ప్రాణాలర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ సీఎంకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. అన్ని ఒప్పందాలను తుంగలో తొక్కింది మీరు కాదా అని ప్రశ్నించారు.

అన్నీ అవగాహన చేసుకున్నాకే తెలంగాణపై నిర్ణయం

తెలంగాణలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ అవగాహన చేసుకున్నాకే సోనియా తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారని డీఎస్ స్పష్టం చేశారు. ఐదు దశాబ్దాలుగా జరుగుతున్న ఉద్యమాన్ని కేంద్రం పరిశీలించిందన్నారు. చిదంబరం చేసిన ప్రకటన యూపీఏ చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. అన్నీ తెలిసి సీఎం తెలంగాణను వ్యతిరేకించడం సరికాదు అని ధ్వజమెత్తారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.