నవ తెలంగాణ కల నిజం చేసుకుందాం- కేసీఆర్

-తెలంగాణ అంశం ఏనుగెల్లింది… తోక చిక్కింది
-తల తెగిపడ్డా హైదరాబాద్ మీద రాజీలేదు
-టీజేఎఫ్ మీట్ ది ప్రెస్‌లో తేల్చిచెప్పిన టీఆర్‌ఎస్ అధినేత
-నీళ్లు.. నిధులు.. నియామకాలు..

కనీవినీ ఎరుగని విధ్వంసానికి గురైన తెలంగాణ పునర్నిర్మాణమే రాష్ట్రం ఏర్పాటు అనంతరం తమ కార్యక్రమంగా ఉంటుందని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర రావు ప్రకటించారు. అన్ని వర్గాలవారు గౌరవంగా, కాలర్ ఎగరేసుకునే విధంగా..
narayanaఅన్నార్తులు లేని, అసమానతలు లేని తెలంగాణ సాధనకే ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నాం తప్ప స్వార్థ రాజకీయ నాయకులు కడుక్కుని తాగడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆదివారం టీజేఎఫ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. తెలంగాణ పునర్నిర్మాణమంటే కూల్చి కడతారా? అనే వాళ్ల కురుచబుద్ధులు చూస్తే జాలివేస్తుందని అన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక విద్యుత్ విషయంలో లోటు భర్తీకి 10 విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఐదేళ్లలో 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటామన్నారు. కాగజ్‌నగర్ నుంచి మణుగూరు వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసుకుంటామని, దానితో వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు.

ఖాయిలాపడిన పరిశ్రమల పునరుద్ధరణకు.. ముఖ్యంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కృషి జరుపుతామన్నారు. మేలైన పరిపాలనకు 10 జిల్లాలను 24కు పెంచుతామని చెప్పారు. భూపాలపల్లి కేంద్రంగా జయశంకర్ జిల్లా ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్యరంగంలో ప్రైవేటు రంగ గుత్తాధిపత్యానికి తెరదించుతూ 24 జిల్లాల్లో నిమ్స్ స్థాయిన కార్పొరేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు.మండల, నియోజకవర్గస్థాయి ఆస్పత్రులు ఏర్పా టుచేస్తామని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడుతూ తెలంగాణకు హైదరాబాద్ బ్యాక్‌బోన్‌గా ఉంటుందన్నారు. నగరం చుట్టూ వందకిలోమీటర్ల పరిధిలో శివారు పట్టణాలు ఏర్పాటు చేసి ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో హబ్‌గా తీర్చిదిద్దుతామని లైట్ రైల్ విధానంలో కారిడార్లు ఏర్పాటు చేసి రవాణా మెరుగుపరుస్తామన్నారు.

list ప్రపంచ సీఈఓల ఆర్గనైజేషన్ హైదరాబాద్ పెట్టుబడులకు ప్రపంచంలోనే రెండవ అత్యంత అనువైన నగరంగా పేర్కొన్నదని గుర్తు చేశారు. హైదరాబాద్ అందర్నీ ఆదరించే నగరమని, వందల ఏళ్లనుంచే తమిళ, బెంగాలీ,మర్వాడీ తదితరులు ఏ సమస్యా లేకుండా నివసిస్తున్నారని, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు సైతం ఉండవచ్చునని రిటైరై ప్లాట్లు కూడా కట్టుకోవచ్చని అన్నారు. అయితే హైదరాబాద్‌ను కేంద్ర పాలితం గానీ మరొక ఆప్షన్ గానీ తల తెగిపడ్డా అంగీకరించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగుల విషయంలో నిబంధనల ప్రకారం ఉంటుందని ఆప్షన్లకు మాత్రం ఒప్పకోమని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ సాధన ముఖ్య ఉద్దేశ్యమే ఈ ప్రాంత నియామకాలు ఇక్కడి వారికే కావాలని, ఆ విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు. అలాంటపుడు రాష్ట్రం అవసరమే లేదని చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.