నల్లగొండ మంత్రులు..సీమాంధ్ర పల్లకీ బోయలు-కేటీఆర్

‘మంచినీరు దొరక్క నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధితులు జీవచ్ఛవల్లా ఉంటే ముఖ్యమంత్రి కిరణ్ తన జిల్లాకు రూ.7,500 కోట్లు మంచినీటి కోసం తరలించుకపోయారు. ఈ విషయం ఇక్కడి మంత్రులకు గుర్తులేదా’ అని ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. సోమవారం నల్లగొండ జిల్లా కోదాడలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శశిధర్‌డ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనన్న ముఖ్యమంత్రి కిరణ్‌ను జిల్లా మంత్రులు సాగిలపడి సాదరంగా ఆహ్వానించి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని, సీమాంధ్ర పల్లకీ బోయల్లా జిల్లామంత్రులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మూడు సీజన్లలో పంటలు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పట్టించుకోని మంత్రులు, సీఎం భజన చేస్తున్నారని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో చంద్రబాబు, కిరణ్ పాలన కొనసాగుతోందన్నారు.
ఏ రాజకీయ వ్యూహంతో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ తెలంగాణను అడ్డుకున్నాయో అదే వ్యూహంతో తెలంగాణను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బయ్యారం గనులను విశాఖకు తరలిస్తే చూస్తూ ఊరుకోబోమని, జాతి సంపద అని చెప్పుతున్న ముఖ్యమంత్రి..విశాఖ ఉక్కు పరిక్షిశమలో ఎంత మంది తెలంగాణవాసులకు ఉద్యోగాలు ఇచ్చారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇస్తామని మాట తప్పిన కాంగ్రెస్ నాయకులు, గాంధీ పేరు పెట్టుకుని ఆయనను అవమానపరుస్తున్నారని చురకలంటించారు. ప్రస్తుతం ఉన్నదంతా డూప్లికేట్ గాంధీలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను తక్షణమే అధికారం నుంచి దించాలని పిలుపునిచ్చారు. టీడీపీ కాంట్రాక్టర్లు, కమీషన్ల పార్టీ అని, అది మునిగిపోయే నావ అన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.