నత్తనడకన నెట్టెంపాడు ఎత్తిపోతల!

 

NPH
ఖరీఫ్‌లో సాగునీరు సందేహమే
– పూర్తయిన ప్రధాన రిజర్వాయిర్ల నిర్మాణం
-నిలిచిన ప్రధాన కాలువల పనులు
– ప్రారంభమేకాని డిస్ట్రిబ్యూటరీ కాల్వల నెట్‌వర్క్
జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల.. మహబూబ్‌నగర్ జిల్లాలోని కరువుపీడిత ప్రాంతాల్లోని బీడు భూములకు సాగునీటి కోసం జలయజ్ఞంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు అది! సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేందుకు ఉద్దేశించిన ఈ పథకం ద్వారా 2013 ఖరీఫ్ నాటికి నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. తొలి విడతగా.. రానున్న ఖరీఫ్‌లో సుమారు 50వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంతోపాటు 2013-14లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఘనంగా ప్రకటించింది. అయితే, సర్కారు ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరుకు పొంతన కుదరడం లేదు! ఈ ప్రాజెక్టులో ఎత్తిపోతల పథకాల పంప్ హౌస్‌లు, రిజర్వాయిర్ల నిర్మాణం పూర్తయినా… ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే తప్ప ఈ పథకం ద్వారా వచ్చే ఖరీఫ్‌లో కొంత ఆయకట్టుకైనా సాగునీరివ్వలేని పరిస్థితి నెలకొంది.

ఏమిటీ ప్రాజెక్టు..?
జూరాల రిజర్వాయిర్ ఎగువ ప్రాంతం నుంచి 21.42 టీఎంసీల వరద జలాలను ఎత్తిపోయడం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల్లో 8 మండలాల్లోని 148 గ్రామాలకు తాగునీటి సదుపాయాలు కల్పించడమే గాక, సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం నెట్టెంపాడు ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ పథకంలో రెండు దశలు ఉన్నాయి. మొదటి దశలో జూరాల రిజర్వాయిర్ నుంచి అప్రోచ్ చానల్, టన్నెల్ ద్వారా నీటిని తరలించి గూడెందొడ్డి గ్రామం వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్‌లోకి ఎత్తిపోస్తారు. ఈ దశలో కుడి, ఎడమ కాలువల ద్వారా 60 వేల ఎకరాలకు సాగునీరు, మార్గమధ్యంలోని గ్రామాలకు తాగునీరు అందివ్వాలి. గూడెందొడ్డి నుంచి కాలువ, టన్నెల ద్వారా నీటిని తరలించి రెండో దశలో రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్‌లోకి నీటిని ఎత్తిపోయాలి. ఇక్కడి నుంచి కుడి, ఎడమ కాలువల ద్వారా 1.40 లక్షల ఎకరాలకు నీరివ్వాలి. ఈ ప్రాజెక్టు కోసం రూ. 1,428 కోట్లతో 2005-06లో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతి ఇచ్చింది. 14 ప్యాకేజీల కింద పనులను విభజించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ. 1,455 కోట్లను ఖర్చు చేయగా, 82 శాతం మేర పనులు పూర్తయినట్లు ప్రభుత్వం చెబుతోంది.

ప్రస్తుత పరిస్థితి..:నెట్టెంపాడు ఎత్తిపోతల మొదటి దశలో ప్రతిపాదించిన నాలుగు పంపుల్లో మొదటి పంపును సీఎం కిరణ్ గతేడాది సెప్టెంబర్ 9న లాంఛనంగా ప్రారంభించి, గూడెందొడ్డి రిజర్వాయిర్‌లోకి నీటిని ఎత్తిపోశారు. ఈ రిజర్వాయిర్ ఎడమ కాలువ ద్వారా ప్రస్తుత రబీలో సుమారు 2,500 ఎకరాలకు సాగునీరు అందజేశారు. ఆ తర్వాత మరో రెండు పంపులకు కూడా ట్రయల్ రన్ నిర్వహించారు. మూడో పంపు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి దశ ద్వారా వచ్చే ఖరీఫ్‌లో 50 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది జరగాలంటే… పనుల పురోగతిలో నెలకొన్న పలు అవాంతరాలను తొలగించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించాల్సి ఉంది.

క్షేత్రస్థాయిలో ఇబ్బందులు..
l జూరాల రిజర్వాయిర్ నుంచి నీటిని తరలించే అప్రోచ్ కాలువ ఇన్‌టెక్ పాయింట్ వద్ద పనులు పూర్తి కాలేదు. అక్కడ ప్రవాహానికి అడ్డుగా ఉన్న మట్టి దిబ్బను తొలగించడంతోపాటు కొన్ని నిర్మాణాలను చేయాల్సి ఉంది. అలాగే, 98వ ప్యాకేజీ కింద చేపట్టిన అప్రోచ్ కాలువ మధ్యలో సుమారు 200 మీటర్ల మేర తవ్వకం పనులు నిలిచిపోయాయి. కాలువలో రాతి నేల అడ్డుగా రావడంతో పనులను మధ్యలోనే ఆపేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఈ కాలువలో పక్కనుంచి చిన్న పాయ ద్వారా తాత్కాలికంగా నీరు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ అడ్డంకి మూలంగా జూరాల రిజర్వాయిర్‌లో 314మీటర్ల స్థాయిలో నీటిమట్టం ఉన్నప్పటికీ.. ఈ కాలువకు నీరు అందడం లేదు. నెట్టెంపాడు మొదటి దశకు ఖరీఫ్ నాటికి మొదటి దశలకు నీరు అందివ్వాలంటే.. యుద్ధవూపాతిపదికన ఈ తవ్వకం పనులను పూర్తి చేయాల్సి ఉంది.

lమొదటి దశలో నీటిని ఎత్తిపోసిన తర్వాత సిస్టైన్‌కు, గూడెందొడ్డి రిజర్వాయిర్‌కు మధ్య కాలువ గట్టు దెబ్బతింది. ఇక్కడ గైడ్ వాల్ నిర్మించాలని అధికారులు ప్రతిపాదించినా.. కార్యరూపం దాల్చలేదు. ఇక్కడి నుంచి గూడెందొడ్డి రిజర్వాయిర్‌కు నీటిని తీసుకెళ్లేందుకు కాలువ మధ్యలో క్రాస్ రెగ్యులేటర్లు, స్లూయిస్ గేట్లు అమర్చలేదు. గూడెందొడ్డి రిజర్వాయిర్ నిర్మాణమూ ఇంకా పూర్తిస్థాయిలో కాలేదు. రివిట్‌మెంట్, పారాఫీట్ గోడ నిర్మాణ పనులు చేయాల్సి ఉంది.

l గూడెందొడ్డి నుంచి ఆయకట్టుకు నీరివ్వాలంటే కుడి, ఎడమ ప్రధాన కాల్వల నిర్మాణం జరగాల్సి ఉంది. ఎడమ కాలువ నిర్మాణం పూర్తయింది. అతి కీలకమైన కుడి ప్రధాన కాల్వ నిర్మాణం ఆగిపోయింది. ఈ కాలువ పనులను రెండు ప్యాకేజీలుగా విడగొట్టారు. మొదటి ప్యాకేజీ పనులకు ఏకేఆర్ కోస్టల్ కనస్ట్రక్షన్ అనే కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీ సమస్యల్లో ఉండటంతో ప్రభుత్వం ఆ కాంట్రాక్టును రద్దు చేసింది.. కానీ, కొత్త వారికెవరికీ అప్పజెప్పలేదు. ఫలితంగా కాలువ పనులు నిలిచిపోయాయి. మొదటి దశలో ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలంటే ఈ కాలువ పనులు పూర్తి కావడం తప్పనిసరి. ఖరీఫ్ నాటికి ఇవి పూర్తయ్యే అవకాశం కన్పించడం లేదు.

l నెట్టెంపాడు మొదటి దశ నుంచి రెండో దశ ఎత్తిపోతలకు నీటిని తీసుకెళ్లే కాలువ గట్టు 3.9 కిలోమీటరు వద్ద బలహీనంగా ఉంది. ఇటీవల మొదటి పంపు ద్వారా నీటిని విడుదల చేసినప్పుడు గట్టుకు గండిపడడంతో ఇసుక బస్తాలతో దాన్ని కప్పివేశారు. ఇక, నాలుగు పంపులు నడిస్తే… ఈ కాలువ గట్టు నిలబడడం కష్టమే. యుద్ధవూపాతిపదికన ఈ పనులు చేపట్టాల్సి ఉంది.

l ఇక, నెట్టెంపాడు రెండో దశలో మూడు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసి, రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్‌కు నీటిని తరలించాలి. పంపుల నిర్మాణం పూర్తయింది. మూడు పంపులకు ట్రయల్ రన్ కూడా చేశారు. ఇక్కడ కూడా నీటిని ఎత్తిపోసే సిస్టైన్ నుంచి రేలంపాడు రిజర్వాయిర్‌కు మధ్యలో ఉన్న కాలువ గట్టు బలహీనంగా ఉంది. గైడ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
l రేలంపాడు నిర్మాణం పూర్తయినా.. వరద జలాలను పంపించే సర్‌ప్లస్ చానెల్ పనులు పూర్తి కాలేదు. ఈ కాలువ మధ్యలో గ్రామం అడ్డురావడంతో గ్రామస్తుల అభ్యంతరం మేరకు పనులను నిలిపేశారు. తక్షణమే పునరావాస ప్యాకేజీని ప్రకటించి, దీన్ని పూర్తిచేయాల్సిన అవసరం ఉంది.

l రేలంపాడు రిజర్వాయిర్ నుంచి కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా సుమారు 1.40 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాల్సి ఉంది. ఎడమ కాలువ నిర్మాణం దాదాపు పూర్తయింది. కుడి కాలువ పనులు పురోగతిలో ఉన్నాయి. అలాగే, ఈ కాలువల ఆధారంగా మధ్యలో మరో నాలుగు బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్‌లను ప్రతిపాదించారు. వాటి పనులు ఇంకా పూర్తి కాలేదు.

డిస్ట్రిబ్యూటరీ కాలువలేవీ…
ఇకపోతే, ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకం డిస్ట్రిబ్యూటరీ కాలువల నెట్‌వర్క్. నెట్టెంపాడు ఎత్తిపోతల మొదటి, రెండో దశలో పంపు హౌస్‌లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్ల నిర్మాణం పూర్తయినా… డిస్ట్రిబ్యూటరీ కాలువలు లేకపోతే ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యం కాదు. ఈ లెక్కన చూస్తే ఈ కాలువల నిర్మాణం ప్రారంభమేకాలేదు. అసలు, గూడెందొడ్డి, రేలంపాడు రిజర్వాయిర్ల నుంచి వెళ్లే కుడి ప్రధాన కాలువల నిర్మాణమే పూర్తి కాలేదు. వీటి తర్వాత మేజర్ కాలువలు, మైనర్, సబ్ మైనర్, పంట కాలువల నిర్మాణం పూర్తయితే కానీ ఆయకట్టుకు నీరందదు. ఇవి పూర్తయ్యేదెన్నడు? ఆయకట్టుకు నీరిచ్చేదెప్పుడు?

పూర్తి కాని భూసేకరణ..
నెట్టెంపాడు పథకంలో భూసేకరణ అంశం కీలకంగా మారింది. రేలంపాడు, ఆలూరు గ్రామాలు ముంపునకు గురవుతాయని ప్రకటించారు. పునరావాస, సహాయక కార్యక్షికమాల నిమిత్తం అంచనాలు తయారు చేస్తున్నారు. రెండు దశల్లో ఈ పథకం నిర్మాణానికి మొత్తం 24,199 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా.. ఇప్పటికి 20,638 ఎకరాలను సేకరించారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల కోసం 3,588 ఎకరాలను సేకరించాల్సి ఉంది. ఈ భూసేకరణను త్వరితగతిన పూర్తి చేస్తేనే కాలువల నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. నిర్ణీత సమయంలో నెట్టెంపాడు ప్రతిపాదిత 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ అవాంతరాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని నీటిపారుదల నిపుణులు కోరుతున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.