నగరంలో కాలుష్య చెరువులపై యునెస్కో నివేదిక

హైదరాబాద్: నగరంలో అత్యంత కాలుష్య కాసారమైన చెరువులను యునెస్కో గుర్తించింది. దేశంలోని వివిధ నగరాలలో ఉన్న ముఖ్యమైన చెరువులను పరిశీలించి జాబితాను విడుదల చేసింది. ఈమేరకు ఇవాళ యునెస్కో నివేదికను విడుదల చేసింది. దేశంలో నీటి వనరులపై తాజా అధ్యయనాన్ని యునెస్కో విడుదల చేసింది. నగరంలోని కిష్టారెడ్డిపేట చెరువు, ఖాజిపల్లి చెరువు, ఆసానికుంట చెరువు, సాయి చెరువు, నూర్ మహ్మద్ కుంట, పెద్ద చెరువులను అత్యంత కాలుష్యమయమైన చెరువులుగా గుర్తించింది. ఇవి యాబై శాతానికి మించి ఆక్సిజన్ కరగనివని చెరువులని నివేదికలో స్పష్టం చేసింది. దుర్గం చెరువును నలబై ఐదు శాతం ఆక్సిజన్ కూడా కరగని చెరువుగా గుర్తించింది.

పారిశ్రామిక వ్యర్థాల వల్లే కాలుష్యం: యునెస్కో
పారిశ్రామిక వ్యర్థ పధార్థాల వల్లే నగరంలోని చెరువులు కాలుష్యమయమై పోతున్నాయని హెచ్చరించింది. వివిధ పరిశ్రమల నుంచి వచ్చే రసాయనాలు ఈ చెరువుల్లో చేరుతున్నాయని వివరించింది. ఫ్లోరైడ్, లవణీయత, ఐరన్ వంటి అవాంఛనీయ లోహాల అవశేషాలతో నీరు కాలుష్యమైనట్టు పేర్కొంది.

కాలుష్య నీటి వల్లే చిన్నారుల మరణాలు: యునెస్కో
ఐదేళ్లలోపు చిన్నారులలో మూడో వంతు పిల్లలు కాలుష్య నీటితో మృతిచెందుతున్నారని యునెస్కో నివేదిక పేర్కొంది. ఐదేళ్లలోపు పిల్లల్లో డయేరియా, న్యూమోనియా, మలేరియా వంటి వ్యాధులు కాలుష్య నీటి ద్వారానే సంభవిస్తున్నాయని వివరించింది. పిల్లల కడుపులో నులిపురుగులు ఏర్పడటం, ఎదుగుదల లేకపోవడం వంటివి కాలుష్య నీటి కారణంగానే సంభవిస్తున్నాయని తెలిపింది. నీటి యాజమాన్య విధానం సరిగా లేకపోవడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పింది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.