ధ్వంసరచన

 -చించేసి.. కాల్చేసి.. బూడిద ఎత్తేసి..
-రెవెన్యూ రికార్డులు మాయం చేసే కుట్ర?
-కబ్జా, అక్రమ క్రమబద్ధీకరణ ఫైళ్లే అధికం
-విభజన ఖాయమని తేలిపోవడంతో అక్కసు!
అవి రాష్ట్ర ప్రధాన పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లోని ఆరు, ఏడు అంతస్తులు! ఇందులోనే ప్రభుత్వానికి కీలక ఆదాయ వనరులనందించే రెవెన్యూ శాఖలోని ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, భూ కేటాయింపులు, పట్టణ గరిష్ఠ భూ పరిమితి (యూఎల్‌సీ), దేవాదాయ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల సెక్షన్లు ఉన్నాయి. సదరు శాఖల విభాగాధిపతుల చాంబర్లు కూడా ఇదే భవనంలో ఉన్నాయి. కొద్ది రోజులుగా ఇక్కడ వింతైన దృశ్యం కనిపిస్తున్నది. విలువైన సమాచారంతో కూడిన ఫైళ్లు దారి మధ్యలో నడవటానికి కూడా వీల్లేకుండా చిందరవందరగా పడేసి ఉన్నాయి. వాటిని ఇష్టానుసారం చించిపారేస్తున్నారు.

కొన్నింటిని గుట్టు చప్పుడు కాకుండా కాల్చేసి.. బూడిద ఎత్తి పారబోస్తున్నారు. ఇందులో ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలోని లక్షలాది ఎకరాల విలువైన ప్రభుత్వ భూముల పందేరానికి సంబంధించిన ఫైళ్లు, లీజు గడువు ముగిసిన ఫైళ్లు.. కబ్జాలకు సంబంధించిన వివరాలు.. వాటికి అనుసంధానం చేసిన నోట్ ఫైళ్లు ఉండటం అనుమానాలకు దారి తీస్తున్నది. రాష్ట్ర విభజన ఖాయమని తేలిపోవడంతోనే సీమాంధ్ర సర్కారు కీలకమైన రెవెన్యూ రికార్డులను నాశనం చేస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇలా ఫైళ్లు నాశనం చేయడం, తగులబెట్టడం గతంలో ఎన్నడూ చూడలేదని సీనియర్ సిబ్బంది సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండటం విశేషం. ఈ అంశం సచివాలయంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎలాంటి ప్రయోజనం లేకుండా ఇలా చేయరని, దీని వెనుక పెద్ద కుట్రే దాగి ఉందన్న అనుమానాలను తెలంగాణ ప్రాంత సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. పాత రికార్డులు, ఫైళ్ల క్లియన్స్‌కు లేదా డిస్పోజల్‌కు ఏవైనా ఆదేశాలు జారీ చేశారా? అని ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, వినోద్ కే అగర్వాల్‌ను కోరగా.. అలాంటి ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదని వారు చెబుతున్నారు.

కబ్జాల ఫైళ్లే ఎక్కువ!
తెలంగాణలోని ప్రభుత్వ, ఇనాం, అసైన్డ్, నిషేధిత, చెరువు శిఖం భూములను సీమాంధ్ర దోపిడీదారులు అడ్డగోలుగా కబ్జాలు చేశారని, తప్పుడు పద్ధతుల్లో వాటిని క్రమబద్ధీకరించుకున్నారని ఎప్పటినుంచో ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సీమాంధ్ర పెద్దలు అడ్డగోలుగా తెలంగాణ భూములను కొని.. తమ పేర రాయించుకున్నారు. కేటాయింపుల పేరుతో ఎకరాలకు ఎకరాల భూములు వారి వశం అయ్యాయి. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు, గతంలో ఫైల్ మూవ్‌మెంట్ జరిగిన నోట్‌ఫైళ్లు అనేకం సచివాలయంలోని రెవెన్యూ విభాగంలో ఉంటాయి. ఏనాటికైనా నగరంలోని భూముల వాస్తవ పరిస్థితులు తెలుసుకొని తదుపరి చర్యలు తీసుకోవడానికి ఈ రికార్డులే ఆధారం. ఇలాంటి రికార్డులు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వీటిపై విచారణ జరిగే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే తమకు కోట్లలో నష్టం వాటిల్లుతుందని భావించిన సీమాంధ్ర పెట్టుబడిదారులు అవి లేకుండా చేసేందుకు తమకు అండగా ఉన్న ప్రభుత్వంతో నాశనం చేయిస్తున్నారన్న అనుమానాలు తెలంగాణవాదుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

ఒక వేళ ఇవి పనికిరాని ఫైళ్లు కాబట్టి వాటిని తగులబెడుతున్నామన్నా.. ఆ పని అన్ని శాఖల్లోనూ జరగాలి. కానీ.. ఒక్క రెవెన్యూ శాఖలోనే ఈ తంతు జరుగుతుండటం విశేషం. పాత రికార్డులను భద్రపరచడానికి కావాల్సిన భాండాగారాలు ఉండగా ఫైళ్లను ఎందుకు ధ్వంసం చేస్తున్నారని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇది కుట్రపూరిత చర్యేనని ఆరోపిస్తున్నారు. ఈ కాగితాల్లో వెతికితే అనేక విలువైన ఫైళ్లు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని సీమాంధ్ర ప్రాంతంలో పలువురికి కేటాయించిన ప్రభుత్వ భూముల ఫైళ్లు అనామకంగా పడి ఉన్నాయి.

ఆయా కేటాయింపుల గడువు ముగుస్తున్న తరుణంలో మొత్తంగా ఫైళ్లు మాయమయితే జరిగే నష్టం ఊహకందని విషయమేనని పలువురు అధికారులు అంటున్నారు. ఇందులో ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు కేటాయించిన ప్రైవేటు భూముల వివరాలు కూడా ఉండటం గమనార్హం. విజిపూన్స్ విభాగానికి చెందిన అనేక ఫైళ్లు కూడా చెత్తకాగితాలుగా కిందపడి ఉన్నాయి. ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎక్సైజ్ సిండికేట్ల వ్యవహారంలో నిందితుల వివరాలు, వారిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వంటి అంశాల ఫైళ్లు ఇవే కార్యాలయాల్లో ఉన్న నేపథ్యంలో అవి కూడా మాయమై ఉంటాయా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

రికార్డుల ధ్వంసానికి వీల్లేదు!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 1986నుంచి నేటి వరకు అక్కరకురాని పేపర్లు, డాక్యుమెంట్లు, ఫైళ్లు ఏవైనా దాచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ రికార్డ్ బ్రాంచ్‌ను ఏర్పాటు చేసింది. పాత రికార్డులు, ఫైళ్లన్నింటినీ ఇందులో భద్రపరిచాలని నిబంధనలున్నాయి. 1986 క్రితపు రికార్డులను దాచేందుకు ప్రభుత్వ పరిధిలో ఆర్కివ్స్ ఏర్పాటు చేశారు. ఈ విభాగాల కార్యాలయాల్లో అక్కరకురాని, లెక్కకుమించిన రికార్డులను భద్రపర్చాలని, అవసరమైనప్పుడు వాటిని తెరచిచూసుకునే వీలు ఉండాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులోనూ కొన్ని ఫైళ్లపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఎస్‌వోలకు ఉంది. వీరి విచక్షణ మేరకు అక్కరకురాని ఫైళ్లను విభజించి వాటిపై ‘మే బీ ట్రీడెట్ యాజ్ జీవో ఎంఎస్ అని రాసి భద్రపరచాలని, మరికొన్నింటిపై ‘మే బీ కెప్ట్ ఇన్ ద సెక్షన్ పర్మినెంట్‌లీ’ అని రాసి దాచాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

ఏ ఒక్క పేపర్‌కానీ, ఫైల్ కానీ చించడానికి, నాశనం చేయడానికి ఎవరికీ అధికారం లేదని ప్రభుత్వ నిబంధనలు పక్కాగా ఉన్నా.. ఇక్కడ వ్యవహారం అందుకు విరుద్ధంగా సాగుతోంది. ఆయా ఫైళ్లకు చెందిన వివరాలను తెలిపే మొదటి పేజీలను కూడా చెత్తబుట్టలో వేసిన అధికారులు తమ అక్రమాలను కప్పిపెట్టుకునేందుకు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోవడం విశేషం. ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖల్లోని సెక్షన్ ఆఫీసర్లను కలవగా ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకే ఫైల్ డిస్పోజల్ చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంపై రెవెన్యూ ముఖ్య కార్యాదర్శి బీఆర్ మీనాను వివరణ కోరగా తనకు అసలు ఫైల్ డిస్పోజల్ విషయమే తెలియదని, అలాంటి అంశమేదీ తన దృష్టికి రాలేదని వెల్లడించారు. ఆపరేషన్స్ డిప్యుటీ సెక్రటరీ, ఏఎస్‌వో, ప్రిన్సిపల్ సెక్రటరీ.. వీరిలో ఎవరిని కదిలించినా పొంతనలేని సమాధానాలే వినిపించారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.