ధీరులు…పరకాల వీరులు…!

పంజాబ్‌లోని జలియన్‌వాలాబాగ్‌ ఉదంతాన్ని తలపింజేసేలా 1948 సెప్టెంబర్‌ 2న పరకాలలో జరిగిన సంఘటన చరిత్రపుటల్లో మరో జలియన్‌వాలాబాగ్‌గా రక్తాక్షరాలుగా లిఖించుకుంది. నాటి పోరాట స్మృతులను నేడు కళ్లకు కట్టినట్లుగా అమరదామం రూపంలో పట్టణంలో వెలసింది. పరకాల ప్రాంత విశిష్ట చరిత్రను గుర్తించిన కరీంనగర్‌ జిల్లాకు చెందిన అప్పటి కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు తన తల్లి చెన్నమనేని చంద్రమ్మ ట్రస్టుపేరిట పరకాల తహశీల్‌ రోడ్డులో అమరవీరుల స్మారక చిహ్నాన్ని నిర్మించారు. రజాకార్లు సాగించిన నాటి బీభత్సకాండ, నిరంకుశ రాచరిక పాలనకు వ్యతిరేకంగా తిరగబడిన యోధుల పోరాట ప్రతిమలను కళ్లకు కట్టినట్లుగా స్మారక చిహ్నం, యోధుల విగ్రహాలను రూపొందించారు. దేశ్‌ముఖ్‌ల కుట్రలతో చిందిన బందగీ రక్తంలో ఆనాడు రక్తసిక్తమైన దృశ్యాలు అమరదామంలో వెలసిన గ్లోబుపై సజీవంగా కనిపిస్తాయి. తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సిటిజన్‌ క్లబ్‌కు చెందిన స్థలంలో నిర్మించిన అమరవీరుల చిహ్నం, నాటి పోరాట స్మృతులు కళ్లకు కట్టినట్లుగా విగ్రహాలను రూపొందించారు. సుమారు 25 లక్షల వ్యయంతో నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాలు నాటి యోధుల పోరాట పటిమను సాక్షాత్కరింపజేస్తుంది. నిజాం సైనికులు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామంలో ముగ్గురిని చెట్టుకు కట్టేసి కాల్చి చంపిన ఉదంతాన్ని 25 మీటర్ల ఎత్తుతో నిర్మించిన గ్లోబుపై జీవం ఉట్టిపడేలా చిత్రీకరించారు. అంతేగాక స్మారక చిహ్నం చుట్టూ భారతమాతకీ జై.. వందేమాతరం..అంటూ నినదిస్తూ ఉద్యమకారులు పదండి ముందుకు..పదండి తోసుకు..వెళుతున్నట్లు 135 మహిళా, పురుష విగ్రహాలను ఏర్పాటు చేశారు. కళ్లు చెదిరే కట్టడాలు పరకాల పట్టణానికి వన్నె తెచ్చాయనడంలో సందేహం లేదు. ప్రత్యేకంగా నిర్మించిన గ్లోబుపై చెట్టుతొర్రలో నుంచి ఒక చెయ్యి బయటకు వచ్చి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నట్లు ఉన్న చిత్రీకరణ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పరకాలలో నాడు జరిగిన పోరాటం, రజాకారుల రాక్షస చర్యలకు రంగాపురం గ్రామంలో బలైన ముగ్గురి పోరాటయోధుల విగ్రహాలను చెట్టుకు కట్టేసినట్లు రూపొందించిన దృశ్యాలు చూపరులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన శిల్పకారులు అపురూపకంగా చిత్రించిన దృశ్యాలు వర్ణణాతీతం. పోరాటంలో బరిసెలతో నరికిన సంఘటనల్లో శరీర భాగాలు చిందరవందరగా పడిఉన్నట్లు పైబర్‌లతో కూడిన అమరుల ప్రతిరూపాలు నిర్మించి గ్లోబుపై ఏర్పాటు చేయడం నాటి పోరాట పటిమకు అద్దం పడటమే గాక నాటి హింసాయుత సంఘటనను స్పష్టం చేస్తుంది. డూమ్‌ లోపలకు వెళ్లిన సందర్శకులు మేఘాలు, ఎగిరే పావురాలతో త్యాగమూర్తుల పోరాట పటిమ ఫలితంగానే స్వేచ్ఛా స్వాతంత్య్రం కలిగిందనే భావనను బహిర్గతం చేస్తుంది. గ్లోబుపైన హింసాత్మక సంఘటన దృశ్యాలు, లోన శాంతి దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. స్మారక చిహ్నం ఎదురుగా నీడనిచ్చే చెట్లు, పూలతోటలను కూడా ఏర్పాటు చేశారు. నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాటం, బలిదానాలు ఘటనలను కళ్లకు కట్టినట్లు వెలసిన అమరవీరుల స్మారక చిహ్నం (అమరదామం) పరకాల ప్రాంతంలో చెప్పుకోదగ్గ సందర్శణీయ స్థలమైంది. ఇటీవల కాలంలో అమరదామంలో విప్లవ చిత్రాల నిర్మాత, దర్శకుడు వీర తెలంగాణా సినిమా షూటింగ్‌ను, నక్సలిజంపై పోలీసులు నిర్మిస్తున్న డ్యాక్యుమెంటరీ ఫిలీం షూటింగ్‌ను జరిపారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.