దోచుకోవడానికే సమైక్యాంధ్ర రాగం : దామోదర

హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడుతున్న తరుణంలో ఇక్కడి వనరులను, సంపదను దోచుకోవడానికే సీమాంధ్ర నేతలు, పెట్టుబడిదారులు సమైక్యాంధ్ర రాగం ఎత్తుకున్నారని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. టీజేఎఫ్ నిర్వహించిన ‘మీట్ దిప్రెస్’ కార్యక్రమంలో దామోదర ఉద్వేగ భరితంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం అంటే ఆత్మగౌరవ పోరాటం అని తెలిపారు. తెలంగాణకు ఓ చరిత్ర, ప్రత్యేక సంస్కృతి ఉందని గుర్తు చేశారు. తాము ఇతరుల భూభాగం తీసుకోవడం లేదు.. తమ రాష్ట్రం తమకు ఇవ్వమని కోరుతున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఆరు దశాబ్దాలుగా కొనసాగుతోందని తెలిపారు. మీలా ఇప్పుడు పుట్టుకొచ్చిన ఉద్యమం కాదన్నారు. తెలంగాణను 600 ఏళ్లు కులీకుత్‌బ్‌షాహీలు, ఆసఫ్‌జాహీలు పాలించారని గుర్తు చేశారు. 1972లో జై ఆంధ్రా అన్నవారంతా ఇప్పుడు సమైక్యాంధ్ర అంటున్నారని ధ్వజమెత్తారు.

తెలంగాణకు ఏం ఒరగబెట్టారు : దామోదర
44 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించినా సీమాంధ్ర నేతలు తెలంగాణకు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. తెలంగాణలో విద్యుత్ లోటుకు కారకులెవరు అని ప్రశ్నించారు. ఇక్కడి వనరులను, సంపదను దోచుకుని తెలంగాణను ఎడారి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దోచుకున్నది చాలక మళ్లీ దోచుకోవడానికి సమైక్యాంధ్ర అంటున్నారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్య ఉంటే తాము పరిష్కారించుకుంటామని తెలిపారు.

అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తే క్షమించరు
అధిష్టానం నిర్ణయాన్ని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ధిక్కరిస్తే ఎవరూ క్షమించారని దామోదర పేర్కొన్నారు. నిన్న సీఎం చేసిన వ్యాఖ్యలపై దామోదర తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రివా? కుట్రదారువా? అని సూటిగా సీఎంను ప్రశ్నించారు. హైదరాబాద్, నదీ జలాల పంపిణీ, విద్యుత్ సమస్యపై ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కారిస్తామని సీడబ్ల్యూసీ తీర్మానం చేసిందని తెలిపారు. అయినా కూడా సీఎంకు ఎందుకు అంత అక్కసు అని ప్రశ్నించారు. సమస్యలు ఉన్నాయని సీఎం వాదిస్తున్నారు.. సమస్యలు సృష్టించింది ఎవరూ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత వేదిక సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని సీఎం ఎలా కాదంటారు అని అడిగారు. సీఎంపై ఆయన నిప్పులు చెరిగారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఎప్పటికీ వ్యతిరేకంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఆ శక్తులను ఎదుర్కొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఫేక్ ముల్కీ సర్టిఫికెట్లతో 23 వేల ఉద్యోగాలు
ఫేక్ ముల్కీ సర్టిఫికెట్లతో ఆంధ్రోళ్లు 23 వేల ఉద్యోగాలు దోచుకున్నారని దామోదర తెలిపారు. 60 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు ఎన్నో అవమానాలను భరించారు అని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా అనేక ఉల్లంఘనలు జరిగాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు కోల్పోయింది ఇక చాలు.. గోస పడలేమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తాము బానిస బతుకు బతకలేమని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయని చెప్పారు.

గోల్డెన్ తెలంగాణను ఏర్పాటు చేసుకుందాం
తెలంగాణ కల సాకారం త్వరలోనే నెరవేరబోతుందని దామోదర తెలిపారు. తెలంగాణను గోల్డెన్ రాష్ట్రంగా ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. తెలంగాణలో విభిన్న సంస్కృతులు ఉన్నాయని, మత రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ చరిత్రను మరింత మెరుగుపరుచుకుందామని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ దారుణంగా మోసపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.