దిల్‌దార్‌గ బిల్

 

-అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ ప్రారంభం
-టీ ఎమ్మెల్యేల ఐక్యత.. కృషితో సభకు చేరిన ముసాయిదా బిల్లు
-అసెంబ్లీ సెక్రటరీకి రక్షణగా టీ ఎమ్మెల్యేలు
-సభ ప్రారంభానికి గంట ముందే ప్రాంగణానికి
-సమన్వయ బాధ్యతల్లో ఎర్రబెల్లి, మోత్కుపల్లి
-డిప్యూటీ సీఎం, జానా, శ్రీధర్‌బాబు నాయకత్వం
-సదా రక్షణగా నిలిచిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
-తోడ్పాటునిచ్చిన బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలు
-బిల్లుపై చర్చకోసం నిలబడిన సీపీఎం ఎమ్మెల్యే
-నిబంధనల ప్రకారం వ్యవహరించిన స్పీకర్
-అప్పగించిన బాధ్యత నెరవేర్చిన డిప్యూటీ స్పీకర్

ఒకప్పుడు తెలంగాణ పదంపై వలసాధిపత్య పాలక శక్తులు నిషేధం విధించిన చోట.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు సగర్వంగా తలెత్తింది. మద్రాస్ నుంచి విడిపోతేనే తెలుగువాళ్ల అభ్యున్నతి సాధ్యమని చాటి.. అందుకోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తిగా.. ఆయన వర్థంతినాడే తెలంగాణ మళ్లీ తన సొంత రాష్ట్రాన్ని సాధించుకునే చారిత్రిక మలుపు వద్ద చివరి మెట్టుపై నిలిచింది. వనరుల్లో దోపిడీని.. ఉద్యోగాల్లో దోపిడీని.. కేటాయింపుల్లో వివక్షను.. సంస్కృతి, సంప్రదాయాలు.. యాసభాషలపై సీమాంధ్ర చిన్న చూపును నిత్యం ఎదుర్కొంటున్న ఒక దగాపడిన సమాజానికి ఎట్టకేలకు న్యాయం సిద్ధించనుంది. వివక్షపై దోపిడీపై గళమెత్తిన తెలంగాణ.. తన విరామమెరుగని పోరాటాల ఫలితంగా ఏళ్లనాటి అంధకారాన్ని తరిమేందుకు కంచు కాగడాలా వచ్చిన ముసాయిదా బిల్లును ఆప్యాయంగా తడిమి.. చేతుల్లోకి తీసుకుంది! కౌరవులను ఎదుర్కొనడంలో పంచపాండవుల్లా అపురూపమైన ఐక్యతను ప్రదర్శించిన తెలంగాణ ఎమ్మెల్యేల మద్దతుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు -2013 ముసాయిదా సోమవారం అసెంబ్లీకి చేరింది. తెలంగాణ ఏర్పాటును ఖరారు చేస్తూ సభలో చర్చ మొదలైంది. దశాబ్దాలుగా తెలంగాణను చిదిమేసిన శక్తులు.. చివరి నిమిషంలో ముసాయిదా బిల్లును కసిదీరా చించేసినా.. కాల్చేసినా.. తెలంగాణ సమాజం చెదరని విజయహాసంతో ప్రగతి పథానికి పయనమైంది!

తెలంగాణ మల్లుల సంపూర్ణ ఐక్యత ధాటికి సీమాంధ్ర ముల్లులు విరిగిపోయాయి. సవాలక్ష కుట్రలను అధిగమించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ.. ఆఖరి అడ్డుగోడలను బద్దలు కొట్టుకుని అసెంబ్లీలోకి ప్రవేశించింది. ముసాయిదాను చదివి వినిపిస్తున్న అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం చుట్టూ తెలంగాణ ఎమ్మెల్యేలు మూడంచెల రక్షణగోడగా నిలువడంతో సీమాంధ్ర ఎమ్మెల్యేల చివరి ప్రయత్నాలు చెదిరిపోయాయి.

swamygoud ప్రభుత్వం, స్పీకర్ నిబంధనలను అనుసరించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ మొదలైంది. అయితే.. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో విధిలేని పరిస్థితుల్లో అసెంబ్లీ వాయిదా పడింది. అయితే.. తమ ఆగ్రహాన్ని సభ వెలుపలా ప్రదర్శించిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు.. ముసాయిదా ప్రతులను చించేసి.. కాల్చేసి.. తమ ప్రకోపాన్ని చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు సోమవారం ఉదయం పది గంటలకు శాసనసభ ముందుకు వచ్చింది. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లు ముసాయిదాను అసెంబ్లీ సెక్రటరీ రాజా సదారం స్పీకర్ తరఫున సభ్యులకు చదివి వినిపించేందుకు సిద్ధమయ్యారు. డ్రాఫ్ట్ బిల్లును స్పీకర్ తరఫున సెక్రెటరీయే చదువుతారని తెలుసుకున్న టీడీపీ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. డ్రాఫ్ట్‌ను చదువుతున్న సెక్రెటరీ చుట్టూ తెలంగాణ ఎమ్మెల్యేలను రక్షణ కవచంగా నిలిపారు. దీంతో ఈ ప్రక్రియ సజావుగా సాగిపోయింది. సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఎంత గొంతు చించుకున్నా.. రాజాసదారం ముసాయిదాను చదివి వినిపించారు. ఇది ముగియగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను అరగంట వాయిదా వేశారు. సెక్రెటరీ డ్రాఫ్ట్ బిల్లును చదువుతున్నా అడ్డుకోలేక.. అహం దెబ్బతిన్న సీమాంధ్ర ఎమ్మెల్యేల.. తమ ఆగ్రహాన్ని అనంతరం మీడియా పాయింట్ వద్ద చూపించారు.

Hareeshసభ వాయిదా పడిన వెంటనే అక్కడికి చేరుకున్న తెలంగాణ వ్యతిరేక ఎమ్మెల్యేలు.. పరమ పవిత్రమైన ముసాయిదా ప్రతులను చించేశారు. మరికొందరు వాటికి నిప్పుపెట్టి తమ ఆనందాన్ని తీర్చుకున్నారు. అయితే వారి చర్యలను అక్కడే ఉన్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అడ్డుకున్నారు. మా గడ్డపైకి వచ్చి మా ఆత్మగౌరవ బిల్లు ప్రతులనే తగుల బెడతారా? అని మండిపడ్డారు. సీమాంధ్ర ఎమ్మెల్యేల తీరుపై యావత్ తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది.

గంట ముందే చేరుకున్న తెలంగాణ ఎమ్మెల్యేలు
తెలంగాణ ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉండాలన్న ప్రజల ఆకాంక్షలను టీ ఎమ్మెల్యేలు నెరవేర్చారు. సమావేశాలు ప్రారంభం కావడానికి గంట ముందుగానే అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. తెలంగాణ రాజకీయ చర్రితలో మొదటి సారిగా పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలంగా ఒక్కటైన అపురూప దృశ్యం అసెంబ్లీలో ఆవిష్కృతమైంది. పార్టీలు పక్కకుపోయాయి. తమకు ప్రాంత ప్రయోజనాలే అన్నింటికన్నా ముఖ్యమని నాయకులు అసెంబ్లీలో లాబీలో ప్రకటించారు. ఫ్లోర్ కోఆర్డినేషన్ బాధ్యతను టీడీపీ టీ ఫోరం నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు తీసుకున్నారు. ఎమ్మెల్యేలకు, ఆయా పార్టీల శాసనసభాపక్ష నాయకులకు వారే ఫోన్‌లు చేశారు. పలుసార్లు టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం నాయకులతో చర్చలు జరిపారు. ఎప్పటికప్పుడు సభలో సీమాంధ్రులు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేశారు. సీమాంధ్రులు తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన కుట్రలను ముందే ఎక్కడికక్కడ ఛేదించారు. ముసాయిదా బిల్లు సభ ముందుకు సజావుగా రావడానికి మార్గం సుగమం చేశారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ సమైక్య తీర్మానం చేయాలని వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. సభలో తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలు మార్మోగాయి. స్పీకర్ పోడియాన్ని సభ్యులు చుట్టుముట్టారు. దీంతో సభను ఉదయం 10 గంటల వరకు వాయిదా వేశారు.

sriderbabuబిల్లు చేయించడానికి తీవ్ర కృషి చేసిన డిప్యూటీ సీఎం, జానా, శ్రీధర్‌బాబు
ముసాయిదా బిల్లును సభలో చేయించడానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తీవ్ర కృషి చేశారు. ఒక దశలో సీఎంపై దామోదర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సభకు రాకుండానే సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలతో కూడా ఫోన్‌లో మాట్లాడుతూ బిల్లును అడ్డుకోవడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా బిల్లుపై చర్చ జరిగేలా చేస్తానని అన్నారు. చెప్పడమేకాకుండా.. చేతల్లోనూ చూపించారు. సభ వాయిదా పడగానే స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో దామోదరరాజనర్సింహ, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లును వెంటనే సభలో ప్రవేశ పెట్టాలని కోరారు.

ఆర్టికల్ 175/2 ప్రకారం గవర్నర్‌నుంచి వచ్చిన బిల్లు ప్రతిని సభకు తెలియజేయాలని కోరారు. అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతాయని అన్నారు. ఆ తరువాత అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు.. ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో భేటీ అయి ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టడానికి సహకరించాలని కోరారు. మరోవైపు సీనియర్ మంత్రి జానారెడ్డి ఎప్పటి కప్పుడు తాజా పరిస్థితులను చర్చించడానికి తన చాంబర్‌లో మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉన్నారు. అన్నీ తానై నడిపించారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు జానారెడ్డితో టచ్‌లో ఉండి ఇబ్బందులు తొలగించారు. పార్టీలకతీతంగా నెలకొన్న అపురూప ఐక్యతా దృశ్యాన్ని చూసి.. టీడీపీ అధినేత చంద్రబాబు సహా సీమాంధ్ర నేతలు జీర్ణించుకోలేక పోయారు. తెలంగాణ నేతల ఐక్యతతో సీమాంధ్ర నాయకులు నైతిక బలాన్ని కోల్పోయారు.

KTRఅప్రమతత్తంగా వ్యవహరించిన టీఆర్‌ఎస్
తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తున్న సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అప్రమత్తంగా వ్యవహరించారు. బిల్లును అడ్డుకోవడానికి సీమాంధ్ర ఎమ్మెల్యేలు చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు పసిగట్టి, వాటి విరుగుడుకు ఎత్తుగడలు వేశారు. తెలంగాణ కల సాకారం అవుతున్న వేళ 12 ఏళ్లుగా నిరంతర పోరాటం చేసిన పోరాట యోధులైన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. అందరినీ కలుపుకొనిపోవడానికి సంయమనం పాటించారు. ఎక్కడా ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా.. టీ కాంగ్రెస్, టీడీపీ టీ ఫోరం ఎమ్మెల్యేలతోపాటు.. బీజేపీ, సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలతో కలిసి పోయారు.

పెద్దలుగా ఆందోళన కార్యక్రమాలలో వారినే ముందుంచారు. తద్వారా తెలంగాణకు చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేల మనసు గెలిచారు. మొన్నటిదాకా పరస్పరం విమర్శించుకున్న నేతలు.. వాటన్నింటినీ పక్కనపె అన్నా అంటూ అప్యాయంగా ఒకరినొకరు పలుకరించుకుని యావత్ తెలంగాణను పులకింపజేశారు. అసెంబ్లీలో సీమాంధ్ర నేతలు బిల్లుపై చర్చను అడ్డుకునేందుకు వేసిన కుట్రలను తిప్పి కొడుతూ అందరినీ కలుపుకొని స్పీకర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ధర్నాలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు కూడా పాల్గొనడం విశేషం. టీఆర్‌ఎస్ తరపున శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కేటీఆర్‌లు కీలక సమయంలో అందరినీ సమన్వయం చేయడంలో ముఖ్య పాత్ర వహించారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌డ్డితో పాటు సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, యన్నం శ్రీనివాసరెడ్డి రెండుసార్లు ప్రత్యేకంగా స్పీకర్‌ను కలిసి సభలో బిల్లుపై చర్చ చేయాలని కోరారు. సీమాంధ్రులు స్పీకర్ కార్యాలయంలో బైఠాయించడాన్ని వారు తప్పుపట్టారు. సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్ కూడా ఇదే తీరుగా తెలంగాణ ఎమ్మెల్యేలతో కలిసి ముందుకు సాగారు.

నిబంధనల ప్రకారం వ్యవహరించిన స్పీకర్
ముసాయిదా బిల్లును అసెంబ్లీలో చేయనీకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు పన్నిన పన్నాగాలు నిలువలేదు. బిల్లు కాదు.. సీమాంధ్ర నాయకుల కుట్రలు, కుతంత్రాలను అధిగమించి చర్చకు సైతం వచ్చింది. ఈ విషయంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిబంధనల ప్రకారం వ్యవహరించారు. స్పీకర్ సీమాంధ్రకు చెందిన నేత అయినప్పటికీ ఆ ప్రాంత నేతల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గకుండా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి, నిబంధనల ప్రకారం ముసాయిదా బిల్లును అసెంబ్లీలో చేశారు. అయిన బిల్లుపై చర్చ జరుగకుండా సీమాంధ్ర ఎమ్మెల్యేలు విశ్వ యత్నాలు చేసినప్పటికీ.. ఏ దశలోనూ నిబంధనల నుంచి పక్కకు మళ్లని స్పీకర్.. ప్రజాస్వామిక పద్ధతిలో వ్యవహరించి.. దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగానైనా సభను తిరిగి ప్రారంభించారు. బిల్లుపై చర్చ మొదలయ్యేలా చూశారు. తనను సీమాంధ్ర ఎమ్మెల్యేలు తన కార్యాలయం వద్ద ఘెరావ్ చేయడంతో సభలో చర్చ మొదలు పెట్టే అవకాశాన్ని తన సహచరుడు డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించారు.

బాధ్యత తీసుకున్న భట్టి విక్కమార్క సీమాంధ్ర ఎమ్మెల్యేల ఆధిప్యతపు ఆందోళనల మధ్య చర్చను ప్రారంభించారు. బిల్లును అసెంబ్లీలో చేయడంతో పాటు చర్చ జరిగే విధంగా మంత్రి శ్రీధర్‌బాబు తన చతురతను ప్రదర్శించారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో చర్చ మొదలైందని శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ధ్రువీకరించారు. సభను ప్రారంభించేందుకు డిప్యూటీ స్పీకర్ తనకు అవకాశం ఇచ్చారని ఆయన చెప్పారు. ఆ తర్వాత బిల్లుపై మాట్లాడాలని ప్రతిపక్ష నేతకు కూడా కోరారని అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన విలేకరులకు తెలిపారు. ముసాయిదా బిల్లుపై అభిప్రాయ సేకరణ మొదలైందని, గత బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకే చర్చ మొదలైందని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అధ్యక్ష స్థానంలో ఉండి తాను తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించే అవకాశం లేదని ఆయన అన్నారని సమాచారం.

హైలైట్స్
-రాష్ట్రపతి నుంచి వచ్చిన ముసాయిదా బిల్లును 13 షెడ్యూళ్లతో.. 65 పేజీల్లో పొందుపరిచారు.
-రెండు రాష్టాలకు ఉమ్మడి గవర్నర్. ఉమ్మడి రాజధానిగా కొనసాగే పదేళ్లలో జీహెచ్‌ఎంసీలో శాంతి భద్రతలు, అంతర్గత భద్రతపై గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు.
– ప్రస్తుత హైకోర్టే రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా కొనసాగుతుంది. దీని ఖర్చును రెండు రాష్ట్రాలు జనాభా నిష్పత్తిలో భరిస్తాయి.
-వివిధ ఉన్నత విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఉన్న అడ్మిషన్ల విధానం పదేళ్ల పాటు కొనసాగుతుంది.
-రెండు ప్రాంతాల్లో గత ఐదేళ్లు వినియోగం ఆధారంగా విద్యుత్‌ను పంపిణీ చేస్తారు. నిష్పత్తి ప్రకారం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పంపిణీ.
-పదేళ్ల వ్యవధిలో ఏ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంటుందో ఆ రాష్ట్రం మిగులు ఉన్న రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసుకోవచ్చు.
-ఉద్యోగుల పంపిణీకి సలహా సంఘాలు ఏర్పాటు..సమాన నిష్పత్తిలో పంపిణీ
-బిల్లు ఆమోదించిన 60 రోజుల్లో కృష్ణ, గోదావరి నదులపై డ్యాంలు, నీటి పంపకాలు, కాలువలు, నదుల నిర్వహణ, ట్రిబ్యునల్స్ తీర్పుల అమలుకు మేనేజ్‌మెంట్ బోర్డులు.
-ప్రస్తుత ఏపీపీఎస్సీ విభజన అనంతరం ఏపీకి పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేస్తుంది.
-సింగరేణి బొగ్గు గనుల్లో 51% తెలంగాణ ప్రభుత్వానికి, 49% కేంద్ర ప్రభుత్వానికి వాటా. ప్రస్తుత బొగ్గు లింకేజీల్లో మార్పులు ఉండవు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.