దిగ్విజయ్‌కు జేఏసీ చైర్మన్ కోదండరాం లేఖ

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సమైక్యాంధ్ర పరిక్షణ వేదిక పేరుతో తెలంగాణ ప్రజల హక్కులపై దాడి చేశారని, సంయమనంతో, శాంతియుతంగా నిరసనలు తెలియచేస్తున్న తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారని వివరిస్తూ జేఏసీ చైర్మన్ కోదండరాం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయసింగ్‌కు లేఖ రాశారు. పోలీసులు అక్రమంగా, సుప్రీంతీర్పునకు భిన్నంగా, విశ్వవిద్యాలయాలలో జులుం చేశారని, ప్రిన్సిపాల్ అనుమతి లేకుండానే నిజాంకాలేజీ హాస్టల్‌లో చొరబడి విద్యార్థులను చితకబాదారని, బాలరాజు అనే విద్యార్థి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడని లేఖలో తెలిపారు. శనివారంనాటి పోలీసుల జులుం సంఘటనలను, సాక్ష్యాలుగా ఉన్న ఫోటోలను జతచేసి దిగ్విజయ్‌కి ఫిర్యాదును ఫాక్స్ ద్వారా పంపించారు. సమైక్యాంధ్ర సభలో జై తెలంగాణ అని నినదించిన ఈ ప్రాంత కానిస్టేబుల్‌ను చితకబాదారని తెలిపారు. విజయవాడ నుండి ఒక వంద వోల్వా బస్సులు వచ్చాయని కోదండరాం వివరించారు. సాగరహారం, సడక్‌బంద్ సందర్భాలలో పోలీసుల పక్షపాత ధోరణిని వివరిస్తూ ఫిర్యాదులు చేశామని జేఏసీ కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్ పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.