దసరానాడు పాలపిట్ట తీరు- తెలంగాణ

వాళ్ళెవరు? మనకు నీతులు బోధించడానికి!
వాళ్ళెవరు? మన నేతలై బాధించడానికి
వాళ్ళెవరు? పాదయావూతలై పాదధూళి మిగల్చడానికి
వాళ్ళెవరు? యోధపువూతికలై బాణాలు సంధించి ఎద రగల్చడానికి
వాళ్ళెవరు? మనిషినో జెండాగా నిలబెట్టి
మనిషికో ఎజెండా చేతికిచ్చి- గుండెల మీద పొర్లాడిన పోరగాండ్లకు
కండ్లముందల కదలాడుతున్న రెండు కండ్ల ముచ్చటకు
బీరిపోయి బలిదానాలతో జారిపోతే ఎండుకట్టెలయి నిల్చునేలాచేసి
రోడ్‌షో, రోడ్ మ్యాప్‌లో మైనం బొమ్మలుగా నిలబెట్టి

మనకాళ్ళ కింద భూమిని, మన కళ్లలోని కాంతిని
గుంజుకునే చీకటి దొంగలకు కాళ్ళు బార్లా జాపి
వంగీ వంగీ రాజకీయ యాచకులై- ‘రండి! రండి! మిమ్ముల పోలిన
నేతల కండ్లజూడలే! ఈనేల ఇంతకు ముందల.. అని సాగిలబడి
వందల సలాముల స్వాగతోరణాలు కడుదామా!
మన బీళ్ళకు నీళ్ళు వదిలే తూముల పగులగొట్టిన
కాడినుంచే వాళ్ళనే పోగేసుకొని ‘వదల బొమ్మాలీ! వదల

నీ తెలంగాణను’ అని గద్వాల దాటుతుంటే..
ఎదురొచ్చిన నిరసన గళాల పాలమూరు పొలిమేరలనే అదిమిపట్టి
దండయావూతల కొనసాగిస్తున్న వాళ్ళకు
పొగడ్తల దండకము పాడుదమా!

వాడింకా తెలంగాణ అంటే..
లూటిబోయిన చేననుకుంటున్నడు.. చెరువను కుంటున్నడు..
ఎవలైనా రావొచ్చు! ఏమైనా చెప్పొచ్చు!!
పాలోని తరఫున వకాల్తా పుచ్చుకోవడానికి, రచ్చచెయ్యడానికి
బేషరమ్‌గాళ్ళు సవాలక్ష మంది ఉన్నప్పుడు… అవ్..
వాడి దూకుడుకు కళ్ళెం వేయకపోతే.. వాడే మనల్ని
ఊ కొడతారా! ఉలిక్కిపడతారా!? అంటాడు
వాడే అఖిల పక్షం వెయ్యమంటడు.. మోకాలడ్డం పెడతడు
నాకు డబ్బులు దాచుకుని దోచుకునే శక్తి ఉందిగని

తెలంగాణ ఇచ్చే శక్తి లేదంటడు
ఒకడు సిన్మాలో తెలంగాణకు అవార్డుల పంట అంటడు
ఒకడు ‘పూరా’ మనసులున్న విషమంతా రాంబాబుతో కక్కిస్తడు
ఇప్పుడు విలన్ ఎవడు? హీరో ఎవడు?
ప్రతిపక్షమెవ్వడు? పాలకుడెవ్వడు?
మానుకోటలో తెలువలే! లక్ష్మక్కపేటలో తెలువలే
రీల్ సినిమా! రియల్ గనుమా!
ఇప్పుడు వాళ్ళ పాదయాత్ర ఒక మిష మాత్రమే..

విషయం పాలకుడికి ఎరుకే… ప్రతి పక్షానికి ఎరుకే..
వోట్ల జాతరకు బండ్లు కట్టుకొని బయలుదేరిన ఏలికలారా!
రేపో మాపో వచ్చే వోట్ల కోసం కాదురా..

తెలంగాణ ఎదురు చూస్తున్నది
వేకువ తొలి పొద్దులా…
ముద్దాడి మాయమైన సూర్యుని ముఖం తీరు
దసరనాడు ముస్తాబైన జనపదాల పలుకరించిన
పాలపిట్ట తీరు… ఇస్తనన్న తెలంగాణ ఇగెప్పుడొస్తదని చూస్తున్నరు!

-డాక్టర్ చెరుకు సుధాకర్

This entry was posted in POEMS.

Comments are closed.