దర్యాప్తు ముసాయిదా నివేదికలో మార్పులు నిజమే..న్యాయమంత్రి తలదూర్చారు

 

suprim
మార్చి 6న మమ్మల్ని పిలిపించుకొని కీలక మార్పులు చేశారు.. పీఎంవో, బొగ్గు శాఖ అధికారులు కూడా.. అయినప్పటికీ ప్రధానాంశాన్ని మార్చలేదు నిందితులు, అనుమానితుల పేర్లు తొలగించలేదు.. నివేదికను పంచుకోవడంపై సుప్రీంకు సీబీఐ చీఫ్ అఫిడవిట్ మార్పులు చేసినందుకు న్యాయస్థానానికి రంజిత్‌సిన్హా క్షమాపణ బొగ్గు కుంభకోణంపై ఇక స్వతంత్ర దర్యాప్తుకు హామీ.. ప్రగతి నివేదికలను పంచుకోవడంపై మార్గదర్శకాలు లేవని వెల్లడి రేపు సుప్రీంకోర్టు కీలక విచారణ.. అశ్వనికుమార్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు!

బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంపై దర్యాప్తులో కేంద్ర న్యాయశాఖ మంత్రి అశ్వనికుమార్ జోక్యానికి సంబంధించి సీబీఐ మరిన్ని సంచలన విషయాలు వెల్లడించింది. దర్యాప్తు ముసాయిదా నివేదికలో న్యాయశాఖ మంత్రి కీలక మార్పులు చేసినట్టు సుప్రీంకోర్టు ఎదుట అంగీకరించింది. ప్రధానమంత్రి కార్యాలయం, బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ అధికారులు కూడా పలు సవరణలు ప్రతిపాదించినట్టు స్పష్టంచేసింది. బోగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక విచారణ చేపట్టనున్న నేపథ్యంలో సీబీఐ చీఫ్ రంజిత్‌సిన్హా సోమవారం సర్వోన్నత న్యాయస్థానానికి అందజేసిన తొమ్మిది పేజీల అఫిడవిట్‌లో పలు వివరాలు వెల్లడించారు. న్యాయశాఖ మంత్రి అశ్వనికుమార్, అటార్నీ జనరల్ జీఈ వాహనవతి, అదనపు సొలిసిటర్ జనరల్ హరిన్ రావెల్, పీఎంవో, బొగ్గు మంత్రిత్వశాఖ జాయింట్ కార్యదర్శులు శత్రుఘ్న సింగ్, ఏకే భల్లాతో సీబీఐ అధికారులు జరిపిన భేటీ వివరాలను ఆయన అఫిడవిట్‌లో వివరించారు.

దర్యాప్తు ముసాయిదా నివేదికలో మొత్తంగా నాలుగు మార్పులు చేయగా, అందులో రెండు న్యాయశాఖ మంత్రే చేశారని, మిగతా రెండు పీఎంవో, బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారుల సూచనల మేరకు చేశారని తెలిపారు. దర్యాప్తు నివేదికలో మార్పులతో తనకే మాత్రం ప్రమేయం లేదని న్యాయమంత్రి అశ్వనికుమార్ చేస్తున్న వాదనను సీబీఐ చీఫ్ సమర్పించిన అఫిడవిట్ పూర్తిగా కొట్టిపారేయడం గమనార్హం. అలాగే దర్యాప్తు నివేదికను చూడలేదని వాహనవతి గతంలో కోర్టులో చేసిన వాదనను కూడా ఆయన నిర్దంద్వంగా తోసిపుచ్చారు. ప్రభుత్వ న్యాయాధికారులు నివేదికను చూడటమేకాకుండా పలు సూచనలు చేశారని, దాంతో తాము మార్పులు చేశామని కోర్టుకు నివేదించారు. సీబీఐ కోరుకోనప్పటికీ న్యాయశాఖ మంత్రితో రెండుసార్లు భేటీ జరిపామని రంజిత్‌సిన్హా తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్‌లో పెట్టి నివేదిక సమర్పించడానికి రెండురోజుల ముందు మార్చి 6న న్యాయశాఖ మంత్రితో సమావేశమయ్యామని వివరించారు. ‘‘మార్చి 6న న్యాయశాఖ మంత్రి నివేదిక పరిశీలించాలని కోరుకుంటున్నారని మా న్యాయవాది ఏఎస్‌జీ మాకు తెలిపారు.

ఆ ప్రకారం మేము నివేదికను తీసుకొని ఆయన కార్యాలయానికి వెళ్లాం. (2006-09 మధ్యకాలంలో చేసిన) బొగ్గు గనుల కుంభకోణానికి సంబంధించిన ముసాయిదా నివేదిక పీఈ 219 2012 ఈ 002ను ఆయన చదివి.. పలు మార్పులు సూచించారు’’ అని రంజిత్‌సిన్హా సుప్రీంకోర్టుకు నివేదించారు. అయితే న్యాయమంత్రి, వాహనవతి సూచనలతో చేసిన మార్పుల మేరకు.. నివేదిక పూర్తిగా మారిపోలేదని, దర్యాప్తు దృష్టిని ఏరకంగానూ మరల్చలేదని అఫిడవిట్ స్పష్టంచేసింది. దర్యాప్తు ప్రగతి నివేదిక నుంచి నిందితుల పేర్లుగానీ, అనుమానితుల పేర్లుగానీ తొలగించలేదని, ఈ ప్రక్రియలో ఏ ఒక్క నిందితుడుగానీ, అనుమానితుడిని గానీ వదిలిపెట్టలేదని రంజిత్‌సిన్హా వివరించారు. ‘‘నివేదికను సరిచేయడానికి మెజారిటీ మార్పులను మా అధికారులే చేశారు. సొంతంగా లేదా ఏఎస్‌జీ (రావల్)తో సంప్రదింపులు జరిపి ఈ మార్పులు చేశారు. దాంతోపాటు పీఎంవో, బొగ్గు మంత్రిత్వశాఖ అధికారులు, ఏజీ సూచనల మేరకు మరికొన్ని మార్పులు జరిగాయి’’ అని ఆయన వివరించారు. అయితే, ఈ దశలో ప్రతి మార్పును ఒక వ్యక్తికి ఆపాదిస్తూ వివరించడం కష్టమని సుప్రీంకోర్టుకు నివేదించారు. న్యాయశాఖ మంత్రి, ఏజీ, పీవోంవో, బొగ్గు మంత్రిత్వశాఖ అధికారుల సూచనల మేరకు చేసిన కొన్ని మార్పులను రజింత్ సిన్హా నివేదికలో వివరించారు. ‘‘ కేటాయింపులకు సంబంధించి ప్రత్యేక ప్రాధాన్యం, పాయింట్లు ఇచ్చేందుకు ఒక వ్యవస్థ లేకపోవడానికి సంబంధించి మా ప్రాథమిక నిర్ధారణలను.. పీఎంవో, బొగ్గు గనుల శాఖ అధికారుల సూచనల మేరకు తొలగించాం’’ అని ఆయన వివరించారు. ‘‘స్క్రీనింగ్ కమిటీ బ్రాడ్‌షీట్‌నుగానీ, చార్ట్‌ను గానీ సిద్ధంచేయకపోవడంపై మా ప్రాథమిక నిర్ధారణను న్యాయమంత్రి నివేదిక నుంచి తొలగించారు’’ అని తేల్చిచెప్పారు.

ఇవి ప్రాథమిక నిర్ధారణలు కావడంతో ఈ మర్పులను తాము ఆమోదించినట్టు చెప్పారు. చట్ట సవరణ ప్రక్రియ నడుస్తుండటంతో అక్రమ కేటాయింపులపై దర్యాప్తు పరిధికి సంబంధించిన ఒక వాక్యాన్ని న్యాయమంత్రి తొలగించారని వెల్లడించారు. పీఎంవో, బొగ్గు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీలైన శత్రుఘ్న సిన్హా, ఏకే భల్లా పేర్లను అఫిడవిట్‌లో ప్రస్తావించిన సీబీఐ చీఫ్.. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తుకు సంబంధించి తమ అధికారులతో వారు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. అజాక్షిగత్తగా కొన్ని విషయాలు తొలగించి, మార్పులు చేసినందుకు రంజిత్‌సిన్హా సర్వోన్నత న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. న్యాయస్థానం పరిధిలో ఉండి.. కొనసాగుతున్న దర్యాప్తుకు సంబంధించిన ప్రగతి నివేదికలను ఇతరులతో పంచుకోవాలా? వద్దా? అనే దానిపై సీబీఐ నిబంధనావళిలో ఎలాంటి మార్గదర్శకాలు లేవని చెప్పారు. ఈ విషయంలో డిపార్టమెంటల్ సర్క్యులర్, ప్రభు త్వం సూచనలు కూడా ఏమీ చెప్పలేదని వాపోయారు. ఏ ప్రాతిపదికన న్యాయమంవూతికి, అధికారులతో దర్యాప్తు నివేదికను పంచుకున్నారని గత విచారణలో సుప్రీంకోర్టు సంధించిన ప్రత్యేక ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. రాజకీయ ప్రతినిధి, ప్రభుత్వ అధికారులతో దర్యాప్తు నివేదిక పంచుకున్న విషయాన్ని సుప్రీంకోర్టు ఎదుట దాచిపెట్టే ఉద్దేశం తనకు లేదని నివేదించారు. దర్యాప్తు నివేదిక ఎవరితో పంచుకోలేదని హరెన్ రావల్ తనకుతానుగా కోర్టుకు చెప్పారని స్పష్టంచేశారు.

సీబీఐ డైరెక్టర్ సుప్రీంకోర్టుకు సమర్పించిన
అఫిడవిట్‌లోని 8 ప్రధాన అంశాలు
-దర్యాప్తు ప్రగతి నివేదిక ముసాయిదాను మాత్రమే రాజకీయ ప్రతినిధి, ఏజీతో పంచుకున్నాం. తుది దర్యాప్తు ప్రగతి నివేదికను కాదు.
– దర్యాప్తు ప్రగతి నివేదిక నుంచి నిందితుల పేర్లుగానీ, అనుమానితుల పేర్లుగానీ తొలగించలేదు. ఏ ఒక్క నిందితుడుగానీ, అనుమానితుడిని గానీ వదిలిపెట్టలేదు.
– ఈ దశలో ప్రతి మార్పునూ ఒక నిర్దిష్ట వ్యక్తికి ఆపాదిస్తూ వివరించడం కష్టం.
పధానమంత్రి కార్యాలయం, కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు చేసిన సూచనలు మేరకు కూడా కొన్ని మార్పులు చేశాం.
– పీఎంవో సంయుక్త కార్యదర్శి (జేఎస్) శత్రుఘ్నసింగ్ సూచన మేరకు ఆయనతో, బొగ్గు శాఖ జేఎస్ ఏకే భల్లాతో సీబీఐ జాయింట్ సెక్రటరీ భేటీ అయ్యారు.
– న్యాయశాఖ మంత్రితో జరిపిన భేటీలో అటార్నీ జనరల్ వాహనవతి, ఏఎస్‌జీ రావెల్ కూడా పాల్గొన్నారు.
–ఈ మార్పులతో.. నివేదిక పూర్తిగా మారిపోలేదు. దర్యాప్తు దృష్టిని ఏరకంగానూ మరల్చలేదు.
-అజాగ్రత్తగా కొన్ని విషయాలు తొలగించి, మార్పులు చేసినందుకు సర్వోన్నత న్యాయస్థానానికి సీబీఐ చీఫ్ రంజిత్‌సిన్హా బేషరతుగా క్షమాపణలు చెప్పారు. బొగ్గు గనుల కుంభకోణంపై స్వతంత్ర దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.