దమ్ముంటే చర్చకు రండి-టీడీపీ, వైసీపీకి హరీష్, కేటీఆర్ సవాల్

ktrharishrao
బాబూ.. బహిరంగ చర్చకు రా.. కేసీఆర్ స్వయంగా వస్తారు
టీడీపీ అధ్యక్షుడికి టీఆర్‌ఎస్ నేత హరీశ్ సవాల్.. వైఎస్, బాబు తెలంగాణ ద్రోహులు
పాదయాత్రలతో టీడీపీ, వైఎస్సార్సీపీ కొత్తగా చేసేదేముంది
సూర్యాపేట సమరభేరి సన్నాహక సమావేశంలో కేటీఆర్
విశ్వసనీయత ఎవరిదో మాట్లాడుదాం
తెలంగాణను అడ్డుకున్నది చంద్రబాబే
ఆయన పాదయాత్రలో నడుస్తుంటే..
ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి పరుగెడుతున్నారు
విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు వ్యాఖ్యలు
ఆగే ఓపిక లేదు.. షిండే వ్యాఖ్యలపై స్పందన
రాజకీయంగా బలపడితే ఉద్యమానికే ఉపయోగం
కాంగ్రెస్ పిలిస్తేనే అనివార్యత గుర్తించి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు
కృష్ణుడు రాయబారం చేసినా.. యుద్ధం తప్పలేదు
యాచించి కాదు.. శాసించి రాష్ట్రం తెచ్చుకోవాలి
ద్రోహుల బట్టలు విప్పే రోజులు వస్తున్నాయి
నల్లగొండలో తారకరామారావు వ్యాఖ్యలు
తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ స్పందించింది. దీనిపై బహిరంగ చర్చకు రావాలని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత టీ హరీశ్‌రావు సవాలు విసిరారు. ఈ చర్చకు కేసీఆర్ స్వయంగా హాజరవుతారని ప్రకటించారు. విశ్వసనీయత ఎవరిది? మాటపై నిలబడేది ఎవరో బహిరంగంగా చర్చిద్దామని అన్నారు. ‘బాబు బహిరంగ చర్చకు వస్తే మా అధినేత కేసీఆర్ స్వయంగా పాల్గొంటారు. చార్మినార్, జూబ్లీహాల్, ఎల్బీ స్టేడియం లేదా ఏ టీవీ చానల్లోనైనా బహిరంగ చర్చకు మేము సి ద్ధంగా ఉన్నాం. ఏ ప్రాంతంలోనైనా సరే. బాబూ.. తేల్చుకో. బహిరంగ చర్చకు సిద్ధమేనా?’ అని నిలదీశారు. పూటకో మాట మాట్లాడుతూ ఇటు తెలంగాణ, అటు సీమాంవూధలో చంద్రబాబు విశ్వాసాన్ని కోల్పోయారని విమర్శించారు. విశ్వసనీయత, ఆడిన మాట తప్పక పోవడంపై తమవైపు తప్పులుంటే తాను ముక్కు నేలకు రాస్తానని అన్నారు. బాబు ఏనాడూ మాట మీద నిలబడలేదని పేర్కొన్నారు. బాబు పాదయావూతలో నడుస్తుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు పరుగులు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ అధినేత కేసీఆర్ ప్రతినిత్యం తెలంగాణ కోసమే పరితపిస్తున్నారని, చంద్రబాబులాగా రెండు కళ్ల సిద్ధాంతం, రెండు నాల్కల ధోరణిని ఎన్నడూ అవలంబించలేదన్నారు. తెలంగాణను అడ్డుకున్నదీ, ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా సమైక్యవాద ఉద్యమాలను నడిపిందీ చంద్రబాబేనని టీడీపీ ఆంధ్ర ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్ వెల్లడించారని గుర్తు చేశారు. టీడీపీ వల్లే తెలంగాణ ఇవ్వలేదని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ సైతం చెప్పారని అన్నారు. జైల్లో ఉన్న జగన్‌తో జై తెలంగాణ అనిపిస్తారా అని కొండా సురేఖకు సవాల్ విసిరారు. తెలంగాణ పరిష్కారం కోసం మరికొన్ని నెలలు ఆగాలన్న కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమా ర్ షిండే వ్యాఖ్యలపై అంతకుముందు నగర టీఆర్‌ఎస్ సమావేశంలో స్పందించిన హరీశ్.. ఆగే ఓపికలేదని స్పష్టం చేశారు.

మరోవైపు సూర్యాపేటలో తలపెట్టిన ‘సమరభేరి’ ఏర్పాట్లలో భాగంగా జరిగిన నల్లగొండ జిల్లా కార్యవర్గ సమావేశాల్లో మాట్లాడిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు.. తెలంగాణకు వైఎస్, చంద్రబాబు ద్రోహులని స్పష్టం చేశారు. చంద్రబాబు, విజయమ్మ నిర్వహిస్తున్న పాదయావూతలు, పార్టీలో చేరిక సభలతో ఆ రెండు పార్టీలకూ కొత్తగా ఒరిగేది ఏమీ లేదన్నారు. ‘‘అధికారం అనుభవించిన ఈ పార్టీలు రాజకీయాలకు కొత్త కాదు. గతంలో అధికారంలో లేనట్లు, పార్టీలే లేనట్లు మాట్లాడుతున్నారు. రాజన్న రాజ్యం తెస్తామని అర చేతిలో స్వర్గం చూపిస్తున్నారు. వైస్సార్సీపీ అంటేనే వైఎస్, కాంగ్రెస్ పార్టీగా ఉంది. వాపు చూసి బలుపు అనుకుంటున్నారు. ఇక్కడ వాదం తక్కువగా ఉందనే వారి ఆలోచనలు సూర్యాపేట సమరభేరితో పటాపంచలు చేయాలి’ అని కేటీఆర్ అన్నారు. ‘తెలంగాణ ప్రజలు రాజకీయ శక్తిగాఎదగాలి. యాచించి కాదు.. శాసించి తెలంగాణ తెచ్చుకోవాలనే జయశంకర్ సార్ ఆకాంక్ష మేరకు రాజకీయంగా బలపడాల్సిన అవసరం ఉంది. అది ఉద్యమ బలోపేతానికే ఉపయోగం. కొందరు తెలంగాణ ద్రోహులు చట్టసభల్లో పదవులు అనుభవిస్తున్నారు. ప్రజలు అలాంటి వారి బట్టలు విప్పేరోజు వస్తోంది’’ అని చెప్పారు. కాంగ్రెస్‌పై ప్రేమ, నమ్మకంతో కేసీఆర్ ఢిల్లీ వెళ్లలేదని, రాజకీయ బాధ్యత గల ఉద్యమ సంస్థగా కాంగ్రెస్ నేతలు పిలిస్తే అనివార్యత గుర్తించి వెళ్లారని చెప్పారు. ‘‘శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం ఆగుతుందని.. కౌరవుల వద్దకు రాయబారానికి వెళ్లి విఫలమయ్యాడు. అయినా యుద్ధం తప్పలేదు. తెలంగాణ వస్తుందనే ఓ చిరు ఆశతో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు’’ అని ఆయన వివరించారు. 2013లోనే కేంద్ర, రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని కేటీఆర్ చెప్పారు. ‘‘ప్రజాసమస్యల పోరాటంలో ముందుండే ఉద్యమ పార్టీని ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. ప్రజల అంచనాలకు తగినట్లు గట్టిగా పని చేస్తే ఢిల్లీ వెళ్లడం కాదు.. ఢిల్లీ పెద్దలే దిగి వస్తారు’’ అని కేటీఆర్ చెప్పారు. ఇదిలా ఉండగా.. ‘వస్తున్నా మీ కోసం’ అంటూ పాదయాత్ర నిర్వహిస్తున్న చంద్రబాబుకు కరీంనగర్ జిల్లాలో నిరసనలు తప్పవని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు హెచ్చరించారు. తెలంగాణకు అడ్డంకి చంద్రబాబేనని, ఈ యాత్ర ప్రజలకోసం కాదని, ఆయన కోసమేనని అన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.