త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి తెలంగాణ నోట్: షిండే

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజలకు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తీపికబురు చెప్పారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి తెలంగాణ నోట్‌ను పంపనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇవాళ ఆయన తన శాఖ నెలవారి సమీక్ష నివేదికను విలేకరుల సమావేశంలో వెల్లడిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ నోట్ ముందుగా అసెంబ్లీకి వెళ్లదని, కేంద్ర మంత్రుల బృందం నివేదికను సమర్పించిన అనంతరం కేబినెట్ ఆ నివేదికను ఆమోదించి రాష్ట్రపతికి పంపుతుందని తెలిపారు. రాష్ట్రపతి ఆ నివేదికను అసెంబ్లీకి పంపుతారని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఆ నోట్‌ను పరిశీలించి పార్లమెంట్‌కు పంపుతుందని వెల్లడించారు. తెలంగాణపై వీలైనంత త్వరలో తీర్మానం వస్తుందని పేర్కొన్నారు. రేపు మంత్రుల బృందం తెలంగాణపై చర్చిస్తుందని, అందరి వాదనలు వింటుందని తెలిపారు. ఈ బృందంలో ఏపీకి చెందిన మంత్రులు లేరుకదా అని విలేకరులు ప్రస్తావించగా, లేకపోయినా ఇబ్బందేమి ఉండదని అన్నారు. విభజనతో సీమాంధ్ర ప్రాంతానికి ఎలాంటి అన్యాయం జరగదని, వారికి కూడా న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.