తొండి

మనసంతా గాలిగాలి
బతుకంతా గోసగోస
పాడినకాడికి సాలుతియ్
ఇగ
లాలిపాటలు ఆపుజేయ్
జోలపాటలు బందుజేయ్
రేషం పాటలు మోసం పాటలు
షురూ చేయ్
అయిందొకనాడు
పోయిందొకనాడు
తెలంగాణ పదాన్ని
వడిసెలలో పెట్టి
పంటను సీరుకతింటున్న
ఆధిపత్య పక్షుల్ని గెదిమి గెదిమి కొట్టాలె
ఇసంత రమ్మంటే
ఇల్లంతా నాదనే
కూసుండ కుర్చీ ఇత్తే
పండ మంచమడిగె’
డప్పందుకో జమిడకందుకో
పీరందుకో బోనమెత్తుకో
ఏక్‌దో ఏక్‌దో తీన్‌మార్
పట్టు పరువు పాదం కలుపు
అవ్!
తెలంగాణ కాంగిరేసోల్లు
మీకడుపుల ఏముందో
కమునిట్టోల్లు మీ మనసుల
ఏం మెదులుతుందో
తెలుగుదేశమోల్లు మీ దమాక్‌ల
ఏం కూసుందో
మీ గుండెలమీద సెయ్యేసుకొని
ఇమానంగా సెప్పుండ్రి
పిల్లల బలిదానాలు
మీకు చీమ కుట్టినట్టు లేదు
మీకు చీము నెత్తురు ఉన్నట్టులేదు
పదవులకు ఆశపడి
గాళ్ల మంచాలు ఎత్తుకు
ఎన్నొద్దులు తిరుగుతరు
అవతలోల్లు నవ్వినందుకుగాదు
తోటి యారాలు అన్నందుకు
మీబాధ సూసి
నవ్వాల్నో ఏడ్వాల్నో తెల్వదు
అంతా అత్తగారింటికి
సద్దిమోసే కోతి భాషణలు
అంతా సుట్టంగాని సుట్టాన్ని చాటుకు
అలాయ్‌బలాయ్ తీసుకునే విభీషణులు
సెప్పులున్నోనితోని
సెప్పులు లేనోడు నడిచినట్టు
యాభైఏడేండ్ల తొవ్వల
గుచ్చుకున్న ముండ్లతోని
మా గుండెలు తడతడ పెడుతున్నయ్
సొచ్చుడు సొచ్చుడే
ఉడుం సొచ్చినట్టు సొత్తిరి
నల్లికుట్లతనం పాయిదార్ల గుణం
తెలుగు జాతి అంతా ఒక్కటంటిరి
తెలివి మీరి వనరులకు ఎసరు పెడితిరి
పగోనివైతే కైరతుగుంటం
పాలోనివైతే పైలంగుంటం
ఉప్పేసి కూడిన పొత్తులు
తేనె పూసిన కత్తులు
మిమ్ముల్ని అనేదేమిలేదు
దొంగకు సీకటిసోపతైనట్టు
మీతోని శరీకైన బద్మాష్‌లు
మావోల్లే అసలు లఫంగలు
ఓట్లు సీట్లతో వచ్చేదుంటే
69లనే తెలంగాణ వచ్చేది
ఇంకా ఎన్నొద్దులు
బొంకిత్తరు బోర్లేత్తరు
అవ్! బిడ్డా
మీ తెలుగుఅమ్మ నెత్తిమీద
సెయ్యిపెట్టి సెప్పుండ్రి
హైద్రాబాద్ మీదా మీ అయ్యదా
బేటా! నకరాల్ సెయ్యకుండ్రి
నమ్మితే పానం ఇత్తం
నమ్మక్కరమైతే నిలువునా పానం తీత్తం
మీ పూటకో
ఏషాలు సూచి పిల్లి సిగ్గుపడుతుంది
మీ మాటకో మోసాలు సూసి
నక్క ఊళపెడుతుంది
యాల్ల మించుకచ్చింది
మోకా ముందు కచ్చింది
కపటజాతితనం
ఇసపాతక గుణం
ఉన్న ఇంటి వాసాలు లెక్కపెట్టెటోల్లు
తిన్నరేవు అర్కీజ్ తలువనోల్లు
పానాలగుత్తోల్లు
మీరెందుకు పోతరు
మీరెందుకు పోతరు
ఊసరవెల్లులు ఊసరవెల్లులు

-జూకంటి జగన్నాథం

This entry was posted in POEMS.

Comments are closed.