తెలుగు వర్సిటీలో సీమాంధ్ర ఆచార్యుల తిష్ఠ

-టాప్ క్యాడర్ నిండా ఆ ప్రాంతంవారే
– 21 మంది ప్రొఫెసర్లలో 18 మంది సీమాంధ్రులు
– తెలంగాణ ప్రాంతం వారు ముగ్గురే
– సూపరింటెండెంట్ పోస్టుల్లోనూ అదే తంతు
– స్థానిక పోస్టులనూ కొల్లగొట్టారు
– స్థానికత ఆధారంగా సీమాంధ్ర ఉద్యోగులను పంపించాలి
-తెలంగాణ ఉద్యోగుల డిమాండ్
 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని కీలక పోస్టుల్లో సీమాంధ్రులే తిష్ఠ వేశారు. అకడమిక్‌పరంగా ప్రొఫెసర్ పోస్టులు కీలకంకాగా అడ్మినిస్ట్రేషన్ పరంగా సూపరింటెండెంట్ పోస్టులు ప్రధానమైనవి. టాప్ క్యాడర్‌లోని ఈ రెండు కేటగిరీల్లోనూ సీమాంధ్ర ఉద్యోగులే అధికంగా ఉండటంతో సహజంగానే వర్సిటీ వారి నియంత్రణలో కొనసాగుతోంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో మాత్రమే తెలంగాణ ప్రాంత ఉద్యోగుల సంఖ్య కాస్త మెరుగ్గా ఉంది.
వర్సిటీలోని 21 ప్రొఫెసర్ పోస్టుల్లో 18 మంది సీమాంధ్రులే ఉండగా, ముగ్గురు మాత్రమే తెలంగాణ ప్రాంత ప్రొఫెసర్లు ఉన్నారు. 11 సూపరింటెండెంట్ పోస్టులు ఉండగా, అందులో ఎనిమిది మంది సీమాంధ్రులే ఉన్నారు. తెలంగాణకు చెందిన ముగ్గురు మాత్రమే సూపరింటెండెంట్ కొలువులో ఉన్నారు. ఇక తెలుగు విశ్వవిద్యాలయంలో మొత్తం 217 బోధన, బోధనేతర పోస్టులు ఉండగా, అందులో 110 మంది తెలంగాణ ఉద్యోగులు, 104 మంది సీమాంధ్ర ఉద్యోగులు, మరో ముగ్గురు నేపాల్‌కు చెందిన వారు ఉన్నారు.

potti-sriramulu

వర్సిటీ పోస్టుల్లో సంఖ్యాపరంగా తెలంగాణ ఉద్యోగులే ఎక్కువగా ఉన్పప్పటికీ ఇందులో అట్టడుగు కేటగిరీలైన ఆఫీస్ సబార్డినేటర్స్, డ్రైవర్లు, కామాటీలే ఎక్కువ. నిజానికి ఈ పోస్టులు నూటికి నూరుశాతం తెలంగాణ ప్రాంతానికి చెందినప్పటికీ సీమాంధ్రులతోనూ భర్తీ చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో కమలనాథన్ కమిటీ రాష్ట్రస్థాయి యూనివర్సిటీగా ఉన్న తెలుగు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న బోధన, బోధనేతర పోస్టుల సంఖ్యను లెక్కగట్టారు. నిబంధనల ప్రకారం యూనివర్సిటీలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల వివరాలను వర్సిటీ నోడల్ ఆఫీసర్ సిద్ధం చేశారు. ఇందులో ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు? వారి స్థానిక జిల్లా ఏది? పదో తరగతి ఏ జిల్లాలో చదువుకున్నారు? పుట్టిన తేదీ వివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేశారు. ఇందులో నేపాల్‌కు చెందిన ముగ్గురు ఉద్యోగులు ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తున్నారు.

మిగతా వారు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. వివిధ కేటగిరీల్లో తెలంగాణ ఉద్యోగుల వివరాలు పరిశీలిస్తే 28 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 17 మంది కాగా 11 మంది సీమాంధ్రులు ఉన్నారు. 18 జూనియర్ అసిస్టెంట్ పోస్టులలో తెలంగాణ వారు 8 మంది, సీమాంధ్రులు 10 మంది ఉన్నారు. తొమ్మిది మంది సీనియర్ అసిస్టెంట్లలో తెలంగాణ వారు ఐదుగురు, సీమాంధ్ర వారు నలుగురు ఉన్నారు. ఎల్‌డీసీ కం టైపిస్టులు, టైపిస్టులు 11 పోస్టులకుగాను 8 మంది తెలంగాణ వారు ఉండగా ముగ్గురు సీమాంధ్రులు ఉన్నారు.

స్థానిక పోస్టుల్లో సీమాంధ్రులు..

ఆఫీస్ సబార్డినేట్(అటెండర్), డ్రైవర్, కామాటి పోస్టులను పూర్తిగా స్థానికులతో భర్తీ చేయాలి. కానీ దాదాపు సగం పోస్టులను సీమాంధ్రులతో భర్తీ చేసి తెలంగాణ నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టారు. తెలుగు యూనివర్సిటీ అధికారిక లెక్కల ప్రకారం 49 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి. ఇందులో 49 పోస్టులను తెలంగాణ ప్రాంతం వారితోనే భర్తీ చేయాలి. కానీ ఇందులో 30 పోస్టుల్లో మాత్రమే తెలంగాణ వారికి అవకాశం కల్పించి.. మిగతా 19 పోస్టులను సీమాంధ్రులతో భర్తీ చేశారు. ఈ 30 మందిలోనూ కొంత మంది ఉద్యోగులు 610 జీవో అమలు సమయంలో తప్పుడు బోనోఫైడ్ సర్టిఫికెట్లు పెట్టి స్థానికులుగా సర్వీసు రికార్డుల్లో నమోదు చేయించుకున్నట్లు తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

రెండు డ్రైవర్ పోస్టులలో సీమాంధ్ర ప్రాంతం నుంచి ఒకరు, తెలంగాణ ప్రాంతం నుంచి ఒకరు ఉన్నారు. కుక్, కామాటీ, వాచ్‌మెన్, మాలి, స్వీపర్ కేటగిరీల్లో 18 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ స్థానికులతో భర్తీ చేయాలి. కానీ సీమాంధ్ర ప్రాంతం వారికీ అవకాశం కల్పించారు. ఇందులో 13 పోస్టు లు సీమాంధ్రులకు దక్కగా.. తెలంగాణకు చెందిన ఐదుగురికి మాత్రమే కొలువులు లభించాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో స్థానిక కోటాలో భర్తీ అయిన స్థానికేతరులను సీమాంధ్ర ప్రాంతానికి పంపించాల్సిందేనని తెలంగాణ ఉద్యో గ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత అయినా స్థానికులకు న్యాయం చేయాలని కోరుతున్నాయి.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.