తెలుగు తల్లి మాకు సవతి తల్లి కూడా కాదు

‘తెలుగుతల్లి ఎవరితల్లి? పెట్టుబడిదారుల తల్లి. మాకు సవతితల్లి కూడా కాదు’ అని ‘బహుజన కెరటాలు’ సంపాదకుడు పల్నాటి శ్రీరాములు అన్నారు. రాష్ట్రాన్ని విభజించి తెలుగుతల్లి తలను వేరు చేశారంటూ సీమాంవూధులు చేస్తున్న వాదనపై మండిపడ్డ ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు.ఒకే భాష మాట్లాడే ప్రజలకు ఒకే రాష్ట్రం ఉండాలంటూ సీమాంవూధులు చేస్తున్న వాదనకు వారు కట్టుబడితే వేరు వేరు భాషలు మాట్లాడే లంబాడీలకు ఒక రాష్ట్రం, ఎరుకలకు ఒక రాష్ట్రం, గోండులకు ఒక రాష్ట్రం చొప్పున ఇస్తారా? అని ప్రశ్నించారు. సీమాంవూధలో కమ్మ, రెడ్డి పెట్టుబడిదారుల ఉద్యమానికి గోరీ కడ్తున్న ఈ యుద్ధభేరి, బహుజనుల అధికారానికి నాంది పలుకుతోందన్నారు. సైమన్ కమిషన్‌ను అంబేద్కర్ స్వాగతించిన విషయాన్ని విశాలాంధ్ర మహాసభ నేత పరకాల ప్రభాకర్ గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు.

కారంచేడు, చుండూరులో దళితులను ఊచకోత కోసిన వారే ఈనాడు రాష్ట్రం విడిపోతే బహుజనులకు అధికారం దక్కుతుందన్న కుట్రతో సమైక్యాంధ్ర నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. వచ్చే నెల 6న గుంటూరులో జరిగే ‘అంబేద్కర్‌వాదుల మహాసభ’ను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. విభజన వద్దంటూ దిగ్విజయ్ వద్దకు వెళ్లిన మంత్రుల భార్యలు.. తాము బాధ్యతాయుతంగా కలిశామని చెప్పడం ఏమిటన్నారు. మహిళలపై లైంగికదాడులు జరిగినప్పుడు, తెలంగాణ యువత ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు బాధ్యతగుర్తురాలేదా? అని ప్రశ్నించారు.

పెట్టుబడిదారుల ఉద్యమం: జై ఆంధ్ర నేత వైకే
సీమాంవూధలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పెట్టుబడిదారులు నిర్వహిస్తున్నారని జై ఆంధ్ర నేత వైకే అన్నారు. ఈ పెట్టుబడిదారులు తెలంగాణ, సీమాంధ్ర ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు.
ప్రభుత్వమే ఆందోళన నిర్వహిస్తోంది: శ్రీనివాస్‌గౌడ్
సీమాంవూధలో ప్రభుత్వమే సమైక్యాంధ్ర ఆందోళన నిర్వహిస్తోందని టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. వారిది బలిసిన ఉద్యమన్నారు. యూటీ అంటే యుద్ధమేనని, ప్రజలు తిరుగబడతారని హెచ్చరించారు.

మీడియా సమన్యాయమేదీ?: విఠల్
తెలంగాణ అంశంపై మీడియా సమన్యాయం పాటించడం లేదని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ అన్నారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు యాంకర్ అని, మిగిలిన బాధ్యతలన్నీ.. సీమాంధ్ర పెట్టుబడిదారులు చూసుకుంటున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్ర ఆందోళన చేస్తున్నవారు.. ఇక్కడే పదేళ్లు ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాగానే.. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని సూచించారు.

‘యూటీ’ అంటే ఒక్క ఆంధ్రోడు బయటికెళ్లడు: అద్దంకి దయాకర్
హైదరాబాద్‌ను ‘యూటీ’ చేస్తే.. ఇక్కడి నుంచి ఏ ఒక్క ఆంధ్రోడు బయటకెళ్లలేడని టీ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్ హెచ్చరించారు. మాల, మాదిగల మధ్య తగవులు పెట్టి, లబ్ధి పొందాలని పెట్టుబడిదారులు చూస్తున్నారని ఆరోపించారు. తామ వర్గీకరణకే వ్యతిరేకం తప్ప మాదిగలకు కాదన్నారు.

ఒప్పుకున్న పార్టీలకు అభ్యంతరమెందుకు?: ఎంపీ వివేక్
సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన తరువాత సీమాంధ్ర పార్టీలు ఎందుకు అభ్యంతరం చెబుతున్నాయని టీఆర్‌ఎస్ నేత, ఎంపీ వివేక్ ప్రశ్నించారు. అన్ని పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించిన తరువాతే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. సీమాంధ్ర పార్టీలు మళ్లీ యూ టర్న్ తీసుకున్నాయని ఆరోపించారు.

బీజేపీ మద్దతిస్తేనే తెలంగాణ: మంత్రి సర్వే
బీజేపీ మద్దతు కూడా ఉన్నందున తెలంగాణ రాష్ట్రం తప్పక ఏర్పడుతుందని కేంద్ర మంత్రి సర్వేసత్యనారాయణ స్పష్టం చేశారు. సోనియాగాంధీ డిక్షనరీలో ఇఫ్, బట్ పదాలు ఉండవన్నారు. తెలంగాణపై వెనక్కితగ్గితే ఈ ప్రాంత ప్రజలు ఏం చేస్తారో అందరికీ తెలుసన్నారు. సీమాంవూధులు రాజీనామా చేస్తే వారి స్థానాల్లో గెలుపు గుర్రాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

చివరి పోరాటం చేయాలి: కిషన్‌డ్డి
తెలంగాణ సాధన కోసం చివరి దశ పోరాటం చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌డ్డి పిలుపునిచ్చారు. స్పష్టమైన ప్రకటన చేసిన కాంగ్రెస్, మళ్లీ వాయిదా వేయడం వల్ల సీమాంధ్ర ప్రజల్లో అపోహలు ఏర్పడ్డాయన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న ప్రతిపాదనను బీజేపీ అంగీకరించదని, ఈ తరహా బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.

ఏపీఎన్జీవో సభ సక్సెస్ ఎక్కడైంది: ఎంపీ మందా జగన్నాథం
ఏపీఎన్జీవో సభ సక్సెస్ అయిందంటూ మీడియా చూపించిన కథనాలపై మందా జగన్నాథం మండిపడ్డారు. హైదరాబాద్‌లో 30 లక్షల మంది సీమాంవూధులు ఉన్నారంటూ ప్రకటనలు చేస్తే వచ్చింది 30వేల మందేనని ఎద్దేవా చేశారు. 30 వేల మంది వస్తే ఎలా సక్సెస్ అయినట్టు అని ప్రశ్నించారు. హైదరాబాద్ మాది అంటున్న అశోక్‌బాబుకు, అసలు చరిత్ర తెలుసా? అని ప్రశ్నించారు.

తరిమికొడ్తాం: విమలక్క
తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంధ్ర పెట్టుబడిదారులను తరిమికొడ్తామని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నాయకురాలు, విప్లవ గాయకురాలు విమలక్క హెచ్చరించారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు బహుజనులకే చెందాలన్నారు. సత్యవాణి చేత అసత్యాలను ప్రచారం చేయిస్తున్నారని, ఆమె కబ్జా చేసిన భూములను కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నారని విమర్శిచారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.