తెలంగాణ సొమ్ముతో సీమాంధ్ర సోకు

-బాగుపడ్డదెవ్వరు? బతికి చెడ్డదెవ్వరు?
-హైదరాబాద్ అభివృద్ధికి అప్పుల మీద అప్పులు
-ఆరు దశాబ్దాలుగా అదే తీరునగరాన్ని పిండుతున్న వారే
-తేరగా వచ్చే ఆదాయం పోతుందని పెడబొబ్బలు
‘హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాం..అభివృద్ధి చేశాం.. ఇందులో మా రక్తమాంసాలున్నాయి.. ఆస్తులు అమ్ముకుని పెట్టుబడులు పెట్టాం..ఈ నగరంలో మాకూ వాటా ఉంది.’ హైదరాబాద్‌నుంచి ఢిల్లీదాకా.. పత్రికలనుంచి చానళ్లదాకా సీమాంధ్రులు ఊదరగొడుతున్న ప్రచారమిది. ఉద్యోగులు కావొచ్చు.. నాయకులు కావొచ్చు.. ప్రజలు… లేదా మీడియా కావొచ్చు. ఇవాళ అంతా ఇదే పాట.

ఇక్కడ బోలెడు పెట్టుబడులు పెట్టాం.. మేం రాకముందేమీ లేదు.. అభివృద్ధి అంతా మా చలవే అన్నట్టు ప్రచారపటాటోపం. సైబర్ టవర్లు, ఫ్లై ఓవర్లు, విమానాశ్రయాలు, కొన్ని పరిశ్రమలు పదేపదే చూపుతూ భ్రమల్లోకి నెట్టేసే యత్నాలు. మేం రాకముందు తొండలు గుడ్లు పెట్టేవి కాదు.. వచ్చాక మేమే కృషి చేసి పెట్టించాం అంటాడొకడు.. రాళ్లు రప్పలు తప్ప ఏమీ ఉండేవి కావంటాడు మరొకడు. మూడేళ్లుగా రాజధానిగా ఉన్న కర్నూలులో పైసా పెట్టుబడి ఎందుకు పెట్టలేదో చెప్పలేనివాడు …హైదరాబాద్ రాజధాని కాబట్టి పెట్టుబడులు పెట్టాం అంటాడు. ఇంతకీ వారు చెబుతున్న ఈ అభివృద్ధిలో సీమాంద్రుల వాటా ఎంత? పెట్టుబడులు చూస్తే శతకోటి లింగాల్లో బోడిలింగం. ఒక్క శాతం కన్నా తక్కువ. మరి హైదరాబాద్ అభివృద్ధికి సీమాంధ్రులు చేసిందేమిటి? ఊళ్లలో ఆస్తులు అమ్ముకుని ఇక్కడ పెట్టిందేమిటి? దానివల్ల హైదరాబాద్‌కు ఒరిగిందేమిటి?
అసలు.. హైదరాబాద్ పేరుచెప్పుకుని బాగుపడ్డదెవ్వరు? బతికి చెడ్డదెవ్వరు?

సీమాంధ్ర నుంచి రత్నాలు, వజ్రాల రాసులేవో తెచ్చి హైదరాబాద్‌ను అభివృద్ది చేసినట్టు కలరింగులు ఇస్తున్న సీమాంధ్రులు వాస్తవానికి విలీనం నాటినుంచి నేటివరకు తెలంగాణ ఆదాయాన్నే తరలించుకుపోయారు.
ఆ సొమ్ము తో తమ ప్రాంతానికి సోకులు చేసుకున్నారు. తెలంగాణ సొమ్ముతో అక్కడ బ్యారేజీలు బాగు చేసుకున్నారు. యూనివర్సిటీలు, రోడ్లు, ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు. ముష్టి రెండు కోట్లు పెట్టే స్తోమత లేక మూడేళ్లు రాజధానిని డేరాల్లో నడుపుకున్న చరిత్ర వారిది.

ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకాక మునుపు కొట్టుకుపోయిన బ్యారేజీలను తెలంగాణ మిగులుతో తప్ప బాగు చేసుకోలేని దౌర్భాగ్యం వాళ్లది. ఇలా తెలంగాణ సొమ్మును తెగ మరిగిన వారు విభజన అంటే చలిజ్వరం తెచ్చుకుని ఉన్మత్త ప్రేలాపనలకు దిగుతున్నారు. రాష్ట్ర విభజన తప్పదంటే హైదరాబాద్ ఆదాయాన్ని శాశ్వతంగా కొట్టేయాలని కుట్రలు చేస్తున్నారు. హైదరాబాద్‌ను తామే అభివృద్ది చేశామని తొండి మాటలు చెపుతున్నారు. ఇందుకు అప్పులు చేసి నిర్మించిన ఔటర్‌రింగ్ రోడ్డు, ప్రైవేట్ వ్యక్తుల చేత నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చూపుతున్నారు. ఒక రోడ్డు, ఒక విమానాశ్రయ నిర్మాణం, ఒక సైబర్ టవర్ నిర్మాణమే నగర అభివృద్ధికి కొలమానాలా? అన్న ప్రశ్న పట్టణ నిర్మాణ రంగ నిపుణుల్లో వ్యక్తమవుతుంది. నగరాలను అభివృద్ధి చేయరని, వాటి అభివృద్ధి కాలక్షికమంలో జరుగుతుందని, నగరాలలో బతకడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి మాత్రమే మనం వస్తామని కేంద్రహోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య ఒకనొక సందర్భంగా అన్న మాటలు వాస్తమని హైదరాబాద్ ఆదాయ వ్యవహారాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.

విలీనం నాటికే లండన్‌తో సమానంగా అభివృద్ధి
భారతదేశంలో విలీనమయ్యేనాటికే అత్యంత విలాసవంతమైన నగరంగా హైదరాబాద్ పేరొందింది. హైదరాబాద్ స్టేట్ యునైటెడ్ కింగ్‌డమ్(ఇంగ్లండ్)తో సమానంగా తులతూగింది. అభివృద్ధి చెందిన దేశంగా ఉన్న నిజాం సంస్థానం 1948లో దేశంలో విలీనమైంది. ఈ విషయాన్ని శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్టులో పొందుపర్చింది. 1921లో 84 కిలో మీటర్లు ఉన్న నగరం,1933లోనే చాదర్‌ఘాట్‌ మున్సిపాలిటీని విలీనం చేసుకున్నది,1937లో జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ విలీనం ఆతరువాత 1945 సికింద్రాబాద్ మున్సిపాలిటీ వీలినం జరిగింది.1951 నాటికే హైదరాబాద్ నగరం11 లక్షల జనాభా కలిగి ఉంది. ఆంధ్రలో విలీనానికి ముందు 1954-55లో ఆదాయ పన్ను వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్ స్టేట్‌లో పన్నుల రూపంలో రూ.2,56,35,581 వసూలు అయింది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 11 సర్కిల్స్ ద్వారా ఆనాడు వసూలైన అమ్మకం పన్ను అక్షరాలా రూ.1.23 కోట్లు. మిగిలిన తెలంగాణ జిల్లాల్లో రూ.45 లక్షలు.

ఇప్పటికీ అదే వరవడిని కొనసాగిస్తూ వేల కోట్ల ఆదాయాన్ని హైదరాబాద్ సంపాదిస్తోంది. భారత దేశంలో విలీనానికి పూర్వం హైదరాబాద్ హాలి విలువ డాలర్‌తో సమానం. నాడు భారత రూపాయి విలువ కన్నా హైదరాబాద్ హాలీ విలువే ఎక్కువ. హైదరాబాద్ రాష్ట్రం పారిశ్రామిక రంగంలోనూ పురోగతిలో ఉన్నది. 1944లోనే హైదరాబాద్ సంస్థానంలో 675 పరిశ్రమలు 55 వేల మందికి ఉద్యోగాలు కల్పించాయి. 1954లో 1,117 ఫ్యాక్టరీలు 76 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగా ఇందులో హైదరాబాద్ 239 పరిశ్రమలలో 22,912 మంది ఉద్యోగం చేశారు. వరంగల్‌లోని 63 పరిశ్రమలలో 4,777 మంది కార్మికులుండేవారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఉపాధి కోసం వలసలు రావడం శతాబ్దం క్రితంనుంచే ఉంది. హైదరాబాద్ నగరం ఏఒక్క ప్రాంత పెట్టుబడిపై ఆధారపడిలేదు. ప్రైవేట్ పెట్టుబడులన్నీ పరిస్థితులకు అనుగుణంగా, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు , మానవ వనరులు, ఇతర సర్వీసులపై ఆధారపడే వచ్చాయని శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్టులో పేర్కొన్నది.

1954-55నాటి సామాజిక ఆర్థిక సర్వేను పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రం విడిపోకముందే మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి 1,29,455 మంది హైదరాబాద్‌కు వలస వచ్చారు. ఇందులో ఉద్యోగ, వ్యాపార రీత్యా82,663 మంది వచ్చారని సర్వే తేల్చింది. ఇంతే కాదు. బొంబాయి నుంచి 1,29,265 మంది వలస వచ్చారు. ఇందులో ఉద్యోగ, వ్యాపార రీత్యా వచ్చిన వాళ్లు42,612 మంది ఉన్నారు. మిగిలిన వాళ్లు వ్యవసాయం కోసం వచ్చారు. వ్యవసాయేతర రంగాలలో వచ్చిన వారంతా ఎక్కువ శాతం హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. ఇలా అన్ని ప్రాంతాల వారిని తనలో విలీనం చేసుకొని పేదల ఊటిగా రాజసంతో విలసిల్లిన హైదరాబాద్‌ను తామే అభివృద్ది చేశామంటూ సీమాంధ్రులు పచ్చి అబద్దాలతో చర్రితను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజాం సంస్థానంలోనే హైదరాబాద్ దేశంలో ఐదవ పెద్ద నగరంగా అభివృద్ధి అయిందన్నది చారిత్రక సత్యం.

సీమాంధ్రకు తరలిన తెలంగాణ సంపద
విలీనం నాటి నుంచి నేటి వరకు లక్షల కోట్ల విలువ చేసే తెలంగాణ ఆదాయం సీమాంధ్రకు తరలిపోయింది. హైదరాబాద్‌ను సీమాంధ్ర పెట్టుబడిదారులు కుళ్లబొడిచి నగరాన్ని మురికి కూపంగా మార్చారు. పూలతోటలతో కలకలలాడిన నగరం నేడు కాలుష్య నగరమైంది. వందేళ్ల కిత్రం నిజాం కాలంలో వేసిన హైదరాబాద్ డ్రైనేజి వ్యవస్థను పునర్నిర్మించని వారు ఇక్కడి భూములు అమ్మగా వచ్చిన వేల కోట్లను మాత్రం తమ ప్రాంతాలకు తరలించుకున్నారు. హైదరాబాద్ నిధులతో పులివెందుల, విజయవాడ, గుంటూరు, తెనాలి పట్టణాలకు సోకులు అద్దుకున్నారు.

పట్టణాలకు మౌలిక సదుపాయాలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలకు హైదరాబాద్ సంపదే ఆధారభూతమైంది. 1969లో తెలంగాణ ఉద్యమం అనంతరం కేంద్రం తెలంగాణ నిధుల తరలింపుపై వేసిన కుమార్ లలిత్ కమిటీ తెలంగాణ ఆదాయం భారీగా తరలిపోయిందనే చెప్పింది. ఈ నివేదిక ప్రకారం తెలంగాణ ఆంధ్ర విలీనం జరిగిన సంవత్సరం 1956-57లో రాష్ట్ర ఆదాయం రూ.25.44 కోట్లు కాగా తెలంగాణ నుంచి రూ.10.94 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ మొదటి ఏడాదికే రూ. 4.49 కోట్ల తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్రకు తరలించి ఖర్చు చేసుకున్నారు. ఇలా 1967-68 వరకూ పదేళ్లలో రూ.63.93 కోట్లు తరలించేశారు. కేంద్రం నుంచి రాష్ట్ర వాటా నిధులు దీనికి అదనం.

తెలంగాణ మిగులు సీమాంధ్రకు తరలిస్తున్న విషయం బయటకు పొక్కడంతో పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ, ఆంధ్రా ఆదాయం, వ్యయం వివరాలను బడ్జెట్‌లో విడిగా చూపించే విధానానికి స్వస్తి పలికారు. మలివిడత తెలంగాణ ఉద్యమం సీమాంధ్ర నేతలు తామే తెలంగాణ అభివృద్ధి చేశామంటూ పేలుతుంటే 2007 మార్చి 21వ తేదీన సీపీఐ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి రాష్ట్రంలో ప్రాంతాల వారీ ఆదాయ, వ్యయ వివరాలివ్వాలని అసెంబ్లీలో 7406 కింద ప్రశ్న వేశారు. కుడితిలో పడ్డ ఎలుకలా గింజుకున్న సర్కారు తప్పనిసరై 2003-04 నుంచి 06-07 జనవరి నాటికి ఆదాయ, వ్యయ వివరాలిచ్చింది. తెలంగాణ ఆదాయం రూ. 34 వేల కోట్లను సీమాంధ్రకు తరలించినట్టు తేలింది. సీమాంధ్రుల ధన దాహానికి రాజధాని భూములు కరిగిపోయాయి. హౌసింగ్ బోర్డుకు కేటాయించిన భూములను అమ్మించి రూ.2600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఏపీ ఐఐసీ ద్వారా రాష్ట్ర సర్కారు భూముల పందేరం చేయించి దాదాపు రూ.6,000 కోట్లు తీసుకున్నది. అలాగే హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ భూములమ్మించి రూ.3500 కోట్లను తీసుకున్నది.

ఆనాడు భూములు విక్రయించగా వివిధ కారణాల మూలంగా హెచ్‌ఎండీఏకు సొమ్ము రాకపోవడంతో రాష్ట్ర ఖజానాకు చెల్లింపులు చేయడంలో ఆలస్యమైంది. దీంతో ప్రభుత్వం హెచ్‌ఎండీఏ మెడపై కత్తి పెట్టడంతో హడావిడిగా రూ.500 కోట్లు బ్యాంకులో రుణం తీసుకువచ్చి మరీ చెల్లింపులు చేసింది. ఫలితంగా ఇప్పటికీ ప్రతి యేటా హెచ్‌ఎండీఏ బ్యాంకులకు వడ్డీలు చెల్లిస్తోంది. ఇది చాలదన్నట్లుగా వీజీటీ (విజయవాడ, గుంటూరు, తెనాలి) అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకీ అభివృద్ధి పనుల కోసం రూ.15 కోట్లు, పులివెందుల అభివృద్ధి కోసం రూ. 2 కోట్లు హెచ్‌ఎండీఏ నుంచి పట్టుకెళ్లారు. ఇలా హైదరాబాద్‌లో భూముల అమ్మకాల ద్వారా, ఇతర పన్నుల ద్వారా, స్థానిక సంస్థల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేన్నీ వదలకుండా సీమాంధ్రకు తరలించుకుపోయారు. తెలంగాణ ఆదాయాన్ని తరలించుకుపోతున్న సీమాంధ్రులు విశాఖ, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, విశాఖ, మచిలీపట్నం, గుంటూరు. ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు పట్టణాలకు నిధుల కేటాయించుకున్నారు.

అప్పులు చేసి.. రోడ్లు వేసి
హైదరాబాద్‌ను ఇంత అభివృద్ధి చేసి ఇక్కడి నుంచి ఎలా పోతామని పేచీలు పెడుతున్న సీమాంధ్రులు అప్పులు చేసి రోడ్లువేసి ఇదే అభివృద్ధి అంటున్నారు. హైదరాబాద్ అభివృద్ధిగా సీమాంధ్రులు చెప్పుకుంటున్న ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తిగా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించారు. రూ.6688 కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టుకు మొదటి దశ 24.4 కిలో మీటర్ల నిర్మాణానికి రూ.699 కోట్ల రుణం స్థానిక బ్యాంకుల నుంచి తీసుకు వచ్చారు.

అలాగే మూడవ దశ 62.3 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.2439 కోట్లను జపాన్ బ్యాంకు నుంచి రుణం తీసుకువచ్చారు. రెండవ దశకు చెందిన 71.3 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.3550 కోట్లు నిర్మించి, నిర్వహించి అప్పగించే పద్దతిలో సీమాంధ్ర గుత్తేదార్లకే అప్పగించారు. ఔటర్ రింగ్‌రోడ్డు కోసం చేసిన ఖర్చంతా హైదరాబాద్ ప్రజలు రాబోయే 33 ఏళ్లలో చెల్లింపులు చేయాల్సిందే. అందులో భాగంగా ఈ రోడ్డు మీద టోల్‌గేట్లు మొలిచాయి. ఇక శంషాబాద్ ఎయిర్‌పోర్టు… రూ.2500 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టును ప్రభుత్వం నయాపైసా ఖర్చు పెట్టకుండా శ్రీకాకుళం జిల్లాకు చెందిన గ్రంధి మల్లిఖార్జున రావుకు చెందిన జీఎంఆర్ సంస్థకు నిర్మించి, నిర్వహించి అప్పగించే(బీఓటి) పద్దతిలో అప్ప జెప్పారు. జీఎంఆర్ సంస్థ నయాపైసా పెట్టకుండానే కార్పొరేట్ వ్యాపారం చేసుకోవడానికి ఐదు వేల ఎకరాల భూమిని ఎయిర్‌పోర్టు పేర అప్పగించేసింది. ఇక చంద్రబాబు నాయుడు తాను నిర్మించానని గర్వంగా చెప్పుకునే సైబర్‌టవర్‌ను ఎల్‌అండ్ టీ కంపెనీ స్వయంగా నిర్మించి, ప్రభుత్వానికి 15శాతం డివిడెండ్ రూపంలో ఇచ్చింది.

అయితే సైబరాబాద్ నిర్మాణానికి ముందే తన సామాజిక వర్గం చేత అక్కడ భూములు కొనిపించారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని వేల కోట్లు సంపాదించుకున్నది సీమాంధ్రులే. సైబరాబాద్ అభివృద్ది వెలుగు నీడల కింద గుట్టలబేగంపేట, ఖాజాగూడ, మాదాపూర్ చుటుపక్కల గ్రామాల తెలంగాణ ప్రజలు భూములను కోల్పోయి రోడ్డున పడితే సీమాంధ్రులు కోట్లు కుమ్ముకున్నారు. ఈ అభివృద్ది వెలుగునీడల్లో గురుకుల్ ట్రస్ట్ భూములు సీమాంధ్రుల కబ్జాకు గురయ్యాయి. పాలకులు గొప్పగా చెప్పుకునే ప్రాజెక్టు మెట్రోరైల్ నిర్మాణం రూ.14,132 కోట్లతో గొప్పగా నిర్మిస్తున్నామని చెపుతున్న ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నగరంలోని విలువైన 212 ఎకరాల తెలంగాణ భూమిని సేకరించి ఇస్తుంది. ఎల్ అండ్ టీ కంపెనీ మెట్రో రైల్ ప్రాజెక్టును నిర్మించినందుకు 33 ఏళ్లు తానే వ్యాపారం చేస్తుంది. ఇక ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నయాపైససా ఇవ్వలేదు.. హైదరాబాద్‌కు చెందిన స్థానిక సంస్థలైన జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలు తమ స్వంత నిధులతో వీటిని నిర్మించాయి.

వీటిని తెలంగాణ మిగులు అని చెప్పారు కానీ ఎక్కడా తిరిగి తెలంగాణకు ఉపయోగించలేదు. మొత్తం సీమాంధ్రకే తరలిపోయాయి. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్స్‌ను ఎక్కడా కలుపలేదు.
2007 మార్చి21వ తేదీన శాసన సభలో చాడ వెంకటరెడ్డి అడిగిన 7406 ప్రశ్నకు ఆనాటి ఆర్థిక మంత్రి రోశయ్య ఇచ్చిన సమాధానం ఆధారంగా…
ఆదాయం ప్రాంతాల వారీగా… రూ. కోట్లలో
ప్రాంతం 2003-04 04-05 05-06 06-07
(జనవరి-07) వరకు
ఆంధ్రా 2786 3494 3702 3690
రాయలసీమ 730 867 1004 987
తెలంగాణ 5565 4725 5935 6093
(హైదరాబాద్ లేకుండా)
ప్రధాన కార్యస్థానాలు 5095 8311 9708 9319

(హైదరాబాద్‌ను ప్రత్యేకంగా చూపారు. దీనిపై అసెంబ్లీలో చాడ వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు)
అయితే ఈ పద్దు కింద పెట్రో ఉత్పత్తులు, లిక్కరు, పీఎస్‌యులు(టీడీఎస్‌లు ద్వారా సింగల్ పాయింట్ నుంచి అందిన రాబడులు, బొగ్గు ఇతర సెస్సు మున్నగు వాటి నుంచి అందిన రాబడులు చేరి ఉన్నాయని సమాధానం ఇచ్చారు.
మొత్తం 14,186 17,397 20349 20089
ఇతర ప్రాంతాలు 3220 3283 4055 4980
ఇతర ప్రాంతాల కింద 20శాతం రాబడి డ్యూటీలు, ఇతర పన్నుల వడ్డీ రాబడులు, డివిడెండ్లు, వృత్తి పన్నుతో సహా ఇతర పన్నుల ద్వారా వసూలయ్యేదని ఆ సమాధానంలో వివరించారు.
ఇందులో హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయమే గణనీయంగా ఉంటుంది.
వెరసి మొత్తం ఆదాయం 17,406 20,680 24,404 25,069

వాస్తవంగా మొదట్లో ఎక్కడా హైడ్ క్వార్టర్స్ అనేపదాన్ని ఆదాయ వ్యయాలలో వాడలేదు.. సీమాంధ్ర పాలకులు హైదరాబాద్ ఆదాయంపై కన్నేసి 1969 ఉద్యమం తరువాత హైదరాబాద్‌ను తెలంగాణ నుంచి వేరు చేయాలనే కుట్రలో భాగంగానే హెడ్ క్వార్టర్స్, ఇతర ప్రాంతాలు అనే పదాలను బడ్జెట్‌లో లేని వాటిని వెతికి సృష్టించారని తెలంగాణ ప్రాంత మేధావులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సభలోనే ఎమ్మెల్యేలు ఆనాడు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా సీమాంధ్ర పాలకులు కావాలని చేసిన తప్పులను సమర్ధించుకునే ప్రయత్నాలు సభ సాక్షిగా చేపట్టారు.

విలీనం నుంచి స్వాహాయే…
1969లో తెలంగాణ ఉద్యమం అనంతరం కేంద్రం తెలంగాణ నిధుల తరలింపుపై వేసిన కుమార్ లలిత్ కమిటీ తెలంగాణ ఆదాయం భారీగా తరలిపోయిందనే చెప్పింది. ఈ నివేదిక ప్రకారం.. తెలంగాణ ఆంధ్రలో విలీనమైన సంవత్సరం 1956-57లో రాష్ట్ర ఆదాయం రూ.25.44 కోట్లు కాగా తెలంగాణ నుంచి రూ.10.94 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ మొదటి ఏడాదికే రూ. 4.49 కోట్ల తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్రకు తరలించి ఖర్చు చేసుకున్నారు. ఇలా 1967-68 వరకూ పదేళ్లలో రూ.63.93 కోట్లు తరలించేశారు. కేంద్రం నుంచి రాష్ట్ర వాటా నిధులు దీనికి అదనం. తెలంగాణ మిగులు సీమాంధ్రకు తరలిస్తున్న విషయం బయటకు పొక్కడంతో పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ, ఆంధ్రా ఆదాయం, వ్యయం వివరాలను బడ్జెట్‌లో విడిగా చూపించే విధానానికి
స్వస్తి పలికారు.

అప్పుల మారాజులే..

హైదరాబాద్ అభివృద్ధిగా సీమాంధ్రులు చెప్పుకుంటున్న ఔటర్‌రింగ్ రోడ్డును
పూర్తిగా బ్యాంకు రుణాలు,
ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించారు. రూ.6688 కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టుకు
మొదటి దశ 24.4 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.699 కోట్ల
రుణం స్థానిక బ్యాంకుల నుంచి తీసుకువచ్చారు. అలాగే మూడవ దశ 62.3 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.2439 కోట్లను జపాన్
బ్యాంకు నుంచి రుణం తీసుకువచ్చారు. రెండవ దశకు చెందిన 71.3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి.. రూ.3550 కోట్లతో నిర్మించి, నిర్వహించి అప్పగించే పద్ధతిలో సీమాంధ్ర కాంట్రాక్టర్లకే అప్పగించారు. ఔటర్ రింగ్‌రోడ్డు కోసం చేసిన ఖర్చంతా హైదరాబాద్ ప్రజలు రాబోయే 33 ఏళ్లలో చెల్లింపులు చేయాల్సిందే. అందులో భాగంగా ఈ రోడ్డు మీద టోల్‌గేట్లు మొలిచాయి.

This entry was posted in Top Stories.

Comments are closed.