తెలంగాణ సాయుధ పోరాటయెధుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి

ఆకలై అన్నంలేక సొమ్మసిల్లిన వ్యవసాయ పాలేరును చూసి కలతచెంది, ఆకలికి కారణమేమిటన్న ఆవేదనతో ఆయన పోరాట ప్రస్థానం ప్రారంభమయింది. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరంభం నుంచి చివరిదాకా పోరాడిన అగ్రనాయకులలో భీమిరెడ్డి నర్సింహారెడ్డి చిరస్మరణీయులు. ప్రజలంతా ప్రేమగా పిలుచుకునే పేరు బీఎన్. నల్లగొండ జిల్లా తుంగతుర్తి ప్రాంతంలోని కర్విరాల కొత్తగూడెం గ్రామంలో వందలాది ఎకరాలు కలిగిన భూస్వామ్య కుటుంబంలో 1922 మార్చి 15న భీమిరెడ్డి నర్సింహారెడ్డి జన్మించారు. వెట్టిచాకిరీ రద్దు చేయాలని, పనికి తగిన వేతనం ఇవ్వాలని స్వగ్రామంలోనే బీఎన్ పోరాటానికి శ్రీకారం చుట్టడం విశేషం.

రైతు కూలీల్లో పోరాట చైతన్యాన్ని ప్రోదిచేయడంతో ఆగ్రహించిన అధికారులు, బీఎన్‌ను దొమ్మీ కేసులో అక్రమంగా ఇరికించి అరెస్టు చేశారు. రెండు రోజుల తరువాత పోలీసులు బీఎన్‌ను కోర్టులో హాజరు పరచినప్పుడు కేసు వాదించాల్సిన న్యాయవాది డ్రెస్‌కోడ్ పాటించకపోవడంతో, తన కేసును తానే వాదించుకోక తప్పని స్థితి ఎదురైనప్పటికీ, ఏ మాత్రం బెదరక బీఎన్ ప్రదర్శించిన చతురత న్యాయవాదులను ముక్కుమీద వేలేసుకునేలా చేసింది. ఎడ్ల బండిని అవలీలగా ఎడమ చేత్తో లేపగలిగిన బలశాలిగానే కాక, కర్రసాము, వడిసెలతో రాళ్లు విసరడం వంటి విద్యల్లో బీఎన్ ప్రదర్శించే చాకచక్యాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గొప్పగా చెప్పుకునేవారు. అనంతర కాలంలో తుపాకీ శిక్షణలోనూ ఆయన గొప్పగా రాణించారు. బువ్వ గింజల కోసం పాలకుర్తికి చెందిన చాకలి ఐలమ్మ సాగించిన పోరాటంలో విసునూరు దొరల గూండాలకు ఎదురొడ్డి నిలిచి, ఐలమ్మ చెమటోడ్చి పండించిన పంటను ఆమె ఇంటికి చేర్చడంలో బీఎన్ ప్రదర్శించిన సాహసం మరువలేనిది. తన గురువుగా భావించే దేవులపల్లి వెంకటేశ్వరరావు ప్రభావం బీఎన్‌పై బలంగా ఉండేది.

తెలంగాణ సాయుధపోరాటంలోనే కాక, స్వాతంత్య్రానంతరం కూడా బీఎన్ ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో ముందున్నారు.

పాతిక సంవత్సరాల పార్లమెంటరీ జీవితంలో మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడుగా పేరు పొందారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ‘తెలంగాణ ప్రజాసమితి’ అభ్యర్థిని ఓడించి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సీపీఎం నాయకుడు బీఎన్ ఒక్కరే కావడం విశేషం. సామాజిక న్యాయం లక్ష్యంగా రాజ్యాధికారం కోసం రాజీలేని పోరాటం సాగించాలని 1996లో లక్ష మందిని సమీకరించి సూర్యాపేట పట్టణంలో భారీ ప్రదర్శనను నిర్వహించిన విఖ్యాతి ఆయనది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుంచి సీపీఎం, ఎంసీపీఐ వరకూ పార్టీ ఏదైనా, ఆయన జీవితమంతా ప్రజల కొరకే పోరాడారు. ఏడు దశాబ్దాలకు పైగా ప్రజా ఉద్యమాల్లో దిగ్గజంగా వెలుగొందిన బీఎన్ 2008 మే 9న తుదిశ్వాస విడిచారు. ఆకలిదప్పులు, అసమానతలులేని సమసమాజం నిర్మించాలని అహరహం తపించారు.

This entry was posted in TELANGANA MONAGALLU.

Comments are closed.