తెలంగాణ రాష్ట్రంతోనే ఇంటికి-నాగం జనార్దన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 : తెలంగాణ రాష్ట్రం తీసుకునే తాను ఇంటికి వెళతానని, అప్పటివరకు ఢిల్లీలోనే ఉంటానని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. తాను తెలంగాణ కోసమే జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరానని వివరించారు. నా కల సాకారమైందన్నారు. పార్టీపై మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మవద్దని అన్నారు. ‘రెండు రోజులు ఆగండి. బీజేపీ ఎలా బిల్లును పాస్ చేయిస్తుందో తేలిపోతుంది. బీజేపీది ఒకటే మాట.. ఒకటే బాట’ అని అన్నారు. సభలో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ అనుసరించిన విధానాన్ని తప్పుబట్టారు. సీమాంధ్ర ఎంపీలు దేశం పరువు తీశారని, పార్లమెంటు వ్యవస్థకే మచ్చ తెచ్చారని తీవ్రంగా మండిపడ్డారు. తమ నాయకురాలు సుష్మాస్వరాజ్ తెలంగాణ బిల్లును దర్జాగా సభలో ప్రవేశపెట్టాలని కోరుకున్నారని, ఆ సమయంలో బల్లలు చరిచి ఆహ్వానించాలనుకున్నారని, దొంగల్లా బిల్లును ప్రవేశపెట్టారనే బాధను, ఆవేదనను వ్యక్తం చేశారన్నారు.

kishan 12 వ తేదీన ప్రధాని మన్మోహన్ సింగ్ తమ నాయకులను పిలిచి విందు ఇచ్చినప్పుడు బిల్లుకు అండగా ఉంటామని, మద్దతు ఇచ్చి పాస్‌ చేస్తామని హామీ ఇచ్చారని, అలాంటప్పుడు దొంగల్లాగా బిల్లును సభలో ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. ఇది తెలంగాణను అవమానించినట్లు కాదా? అని ప్రశ్నించారు. బిల్లు సభలో పెట్టే విషయాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ బిల్లును గురువారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో ప్రవేశ పెడతారని కాంగ్రెస్ ఎంపీలకు మినహా దేశమంతటికీ తెలిసిందన్నారు. ఆనాడు బిల్లును సభలో ప్రవేశపెట్టే సందర్భంగా దేశం పరువుతీశారని, పార్లమెంటు వ్యవస్థకే మచ్చగా మిగిలిపోయిన సంఘటనను మాత్రమే సుష్మాస్వరాజ్ ఖండించారని వివరించారు. బీజేపీకి ద్వంద్వ నీతి లేదని పేర్కొన్నారు.

తమ నాయకురాలు ఈ విషయాన్ని స్పష్టం చేశారని వెల్లడించారు. తెలంగాణ బిల్లును లోక్‌సభకు పంపించిన రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపిన నాగం.. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుతో బిల్లుపై ఆ పార్టీ చిత్తశుద్ధి శంకించాల్సి వస్తున్నదన్నారు. రాజ్యసభకు కాకుండా మొదట లోక్‌సభకే బిల్లును పంపిస్తే ఈ పాటికి ప్రక్రియ పూర్తి కావచ్చేదని అన్నారు. రాజ్యసభకు పంపడం, తిరిగి లోక్‌సభకు పంపడం ద్వారా అనిశ్చితి ఏర్పడిందని, దీనికి కాంగ్రెస్ కారణం కాదా..? అని ప్రశ్నించారు. తమ నాయకులు ప్రధానికి బిల్లుపై హామీ ఇచ్చినా.. దొంగల్లా బిల్లును ప్రవేశపెట్టారని విమర్శించారు. ఇదే విషయం సుష్మాస్వరాజ్‌కు బాధ కలిగించిందన్నారు. ఆమె తెలంగాణ కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నారని పేర్కొన్నారు. గౌరవంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ బిల్లును పాస్ చేసే ప్రజల్లోకి వెళతామన్నారు.

మంత్రి కమల్‌నాథ్‌పై ఫైర్: బిల్లు సభలో ప్రవేశపెట్టడానికి ముందు ప్రధాని తమ నేతలకు విందు ఇచ్చారని, ఆ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులను అదుపులో పెట్టుకోవాలని సూచించారని.. అయితే సభ్యుల మాట అటుంచి కేంద్ర మంత్రులను సైతం అదుపులో పెట్టుకోని పరిస్థితిలో వారు ఉన్నారని నాగం విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రి కమలనాథ్ బీజేపీ తెలంగాణపై యూ టర్న్ తీసుకున్నదని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు. బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ బిల్లు పాస్ చేయగలరా..? అని ప్రశ్నించారు. తమ పార్టీపై టీఆర్‌ఎస నాయకులకు ఏమైనా అనుమానాలు ఉంటే.. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్‌సింగ్, సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్‌లతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలని సూచించారు.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్న పార్టీపై నిందలు వేయడం మంచిది కాదని హితవు పలికారు. తెలంగాణ రావాలన్న చిత్తశుద్ధి ఉంటే బీజేపీపై విమర్శలు మానుకోవాలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించకముందే బీజేపీ తెలంగాణపై నిర్ణయం తీసుకున్నదన్న విషయాన్ని గుర్తు చేశారు. తమ పార్టీ తెలంగాణ రాష్ట్రం కావాలని గట్టిగా కోరుకుంటున్నదని స్పష్టం చేశారు. అదే సమయంలో సీమాంధ్ర సమస్యలు పరిష్కరించాలని బిల్లులో కొన్ని సవరణలు సూచించామని.. కేంద్రం ఆ సవరణలు చేసినా, చేయకున్నా తాము బిల్లును గెలిపిస్తామన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక తాము పేర్కొన్న సవరణలు చేసి సీమాంధ్రకు న్యాయం చేస్తామన్నారు.

బీజేపీ లేకపోతే తెలంగాణ రాదని ప్రచారం చేసిన మీడియాకు కృతజ్ఞతలు: బీజేపీ యూ టర్న్ తీసుకున్నదని, తెలంగాణ రాదని మీడియాలో కథనాలు ప్రచారం చేశారని, ఇది ఒక రకంగా మంచిదేనని మీడియాపై నాగం చలోక్తులు విసిరారు. ఇలాగైనా బీజేపీ మద్దతు లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాదని ప్రజల్లో ప్రచారం చేశారని, ఇందుకు మీకు కృతజ్ఞతలు తెలుపాలన్నారు. బీజేపీని అనుమానించేలా మీడియాలో వస్తున్న కథనాలు నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అరుణ్‌జైట్లీ శుక్రవారం ఇంటర్నెట్‌లో పోస్టు చేసిన ఒక లేఖలో ఇప్పటికిప్పుడే తెలంగాణ బిల్లును సభలో ఆమోదింపజేయాలని రాశారని, కానీ మీడియా దీనిని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ఇచ్చినంత మాత్రాన సీమాంధ్ర సమస్యలను జాతీయ పార్టీలు పట్టించుకోకూడదన్న తీరుగా వార్త కథనాలు ఇస్తున్నాయన్నారు. మీడియా అనుసరించే వైఖరిని ఆయన తప్పుబట్టారు.

సుష్మాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ బీజేపీ నాయకులు: లోక్‌సభ ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, ఎన్నెం శ్రీనివాసరెడ్డి, మాజీఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, తెలంగాణ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, బీజేపీ నాయకులు గురువారెడ్డి తదితరులు పుష్పగుచ్ఛం ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతలు ఆమెతో మాట్లాడుతూ ‘ఆప్‌కే హమారే మా హై’ అని అనగా ‘నై నై ఆప్‌కే మౌసీ హూ’ అని సుష్మా పేర్కొన్నారు. ఆ వెంటనే ‘తెలంగాణ కే నిర్మాణ్ కరే సోంచో’ అని చెప్పారు. బీజేపీ మొత్తం ఓట్లు వేసి తెలంగాణను గెలిపిస్తుందని ఆమె తన జన్మదినం సందర్భంగా తెలంగాణ నేతలకు పూర్తి భరోసా ఇచ్చారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.