తెలంగాణ ‘యాస’ నెపుడు యీసడించు-కాళోజి

తెలంగాణ ‘యాస’ నెపుడు
యీసడించు భాషీయుల
‘సుహృద్భావన’ ఎంతని
వర్ణించుట సిగ్గుచేటు

వాక్యంలో మూడుపాళ్ళు
ఇంగ్లీషు వాడుకుంటు
తెలంగాణీయుల మాటలో
ఉర్దూపదం దొర్లగానే
హిహీ అని ఇగిలించెడి
సమగ్రాంధ్ర వాదులను
ఏమనవలెనో తోచదు.

‘రోడ్డని’ పలికేవారికి
సడకంటె ఎవగింపు
ఆఫీసని అఘొరిస్తూ
కచ్చేరంటే కటువు
సీరియలంటే తెలుగు
సిల్సిల అంటే ఉరుదు

సాల్టు, షుగర్, టిఫిన్ తెనుగు
షర్కర్, నాష్తంట్ కొంప మునుగు
టీ అంటే తేట తెనుగు
చా అంటే ‘తౌరక్యము’
పొయినడంటే చావు
తోలడమంటే పశువు

దొబ్బడమంటే బూతు
కడప అంటే ఊరి పేరు
త్రోవంటె తప్పు తప్పు
దోవంటేనే దారి.

బొక్కంటే ఎముక కాదు
బొక్కంటె పొక్క తెలివి
మందలిస్తె తిట్టినట్లు
చీవాట్లు పెట్టినట్లు
పరామర్శ కానేకాదు

బర్రంటె నవ్వులాట
గేదంటేనే పాలు
పెండంటె కొంప మునుగు
పేడంటేనే ఎరువు

రెండున్నర జిల్లాలదె
దండి భాష తెలుగు
తక్కినోళ్ల నోళ్ల యాస
త్రొక్కి నొక్కి పెట్టు తీర్పు

వహ్వారే! సమగ్రాంధ్ర
వాదుల ఔదార్యమ్ము
ఎంత చెప్పినా తీరదు
స్నేహము సౌహర్ద్రమ్ము

భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
భోయి భీమన్న ఒకడు
బెజవాడ గోపాలుని
సభ్యత నెర్గిన ఆంధ్రుడు

భోయీ భీమన్న ఒకడు
పదారణాల ఆంధ్రుడు
తెనుగు సభ్యత సంస్కృతి
ఆపాద మస్తకంబు
నోరు విప్పితే చాలు
తెనుగు తనము గుబాళించు

కట్టుబొట్టు మాట మంతి
నడక ఉనికి ఒకటేమిటి
ఎగుడు దిగుడు ఊపిరిలో
కొట్టొచ్చే తెనుగు తనము
గోపాల కీర్తనమే జీవిక
పాపము అతనికి

ఉర్డంటే మండి పడెడి
పాటి తెనుగు ఆవేశము
జౌనపదుని లేఖ లేవో
జౌఇన రహిత ప్రాయంబున
వ్రాసినాడు అంతెకాని
తెలివిన పడి, వృద్ధదశలో
కాస్మా పాలిటన్ తనము
శిఖరోహణ అనుకొని
పరిణతి దశ నందు కొనగ
తాపత్రయ పడుచున్నడు

భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
సమైక్యాంధ్రవాది వాడు
భీమశాస్ర్తి అని నాతో
పిలుపించు కొన్నవాడు
జానపదుని లేఖావళి
నాటి సఖుడు భీమన్న
-కాళోజి

This entry was posted in POEMS.

Comments are closed.