తెలంగాణ మహిళా జేఏసీ ఆవిర్భావం

– 29 మందితో అడ్‌హాక్ కమిటీ.. 10 జిల్లాల్లోనూ ఏర్పాటుకు యత్నాలు
– కన్వీనర్‌గా సంధ్య.. కో-కన్వీనర్లుగా మరో ఆరుగురు త్వరలో భర్తీ
– 8న మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం: సంధ్య

తెలంగాణ ఉద్యమంలో మహిళా జేఏసీ ఆవిర్భవించింది. దీనికి 29 మందితో ఏర్పడిన అడ్‌హాక్ కమిటీకి పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య కన్వీనర్‌గా ఎంపికయ్యారు. మరో ఆరుగురు కో-కన్వీనర్‌లను త్వరలో భర్తీ చేయనున్నారు. అంతర్గత సమావేశం అనంతరం కన్వీనర్ సంధ్య విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ పది జిల్లాల్లోనూ మహిళా జేఏసీలు ఏర్పాటుచేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా ఉద్యమిస్తామని అన్నారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ దినోత్సవాన్ని మహిళా హక్కుల దినంగా గుర్తించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులపై, మహిళలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు తీర్మానాలను ఆమోదించామన్నారు.

తెలంగాణ ఉద్యమంలో మహిళలుల కీలక పాత్ర పోషిస్తున్నారని, మరింత చురుకుగా పాల్గొనేలా చూస్తామన్నారు. మహిళా నాయకత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. తెలంగాణకు సీమాంధ్ర రాజకీయ పార్టీలు చేస్తున్న అన్యాయాలను ఎండగడతామని ఆమె హెచ్చరించారు. టీజేఏసీ భాగస్వామ్య పక్షాల మహిళా విభాగం ప్రతినిధులు ఈ కమిటీలో ఉంటారన్నారు. టీజేఏసీ మహిళా విభాగం ప్రతినిధులు దేవకీ, ఝాన్సీ, అనురాధాడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు ఉద్యమాలను ఉధృతంగా కొనసాగిస్తామన్నారు. త్వరలోనే భేటియై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాలని సమావేశంలో నిర్ణయించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.