తెలంగాణ మర్చిన తెలుగుదేశం, కాంగ్రెస్

టీ శ్రేణుల మాట పట్టించుకోని నేతలు ఏమార్చేందుకు కొత్త ఎత్తుగడలు

ఆ రెండు పార్టీలు తెలంగాణను మరిచాయి.. ఎన్నికల కోసం సమాయత్తమవుతున్న ఆ రెండు పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను మరిచాయి.. చెప్పేదేదో కేంద్రానికే చెప్పేశామంటూ చేతులు దులిపేసుకున్న తెలుగుదేశం పార్టీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేస్తున్నామని మాట ఇచ్చి నాలుక మడతపడిందంటున్న కాంగ్రెస్ పార్టీ.. రెండూ ఇప్పుడు ఎన్నికల వేళ తెలంగాణ ఊసెత్తకుండానే ఓటరు దగ్గరికి వెళ్లేందుకు పథకాలు రచిస్తున్నాయి. అందుకే టీడీపీ అధినేత కొత్త అంశాలన్నట్టుగా పాత ముచ్చట్లనే ముందుకు తెస్తున్నారు. అవినీతిని అంతం చేసేందుకు తను నడుంకట్టానని జనం తన నడిస్తే చాలునని చెబుతున్నారు.

రాష్ట్ర కేబినెట్‌లోని కళంకిత మంత్రులను తొలగించాలని ఉద్యమం చేపట్టి ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ దాకా వెళ్లివచ్చిన చంద్రబాబు తెలంగాణ గురించి ఒక్కమాటా మాట్లాడలేదు. బాబు మనసెరిగిన టీడీపీ తెలంగాణ ఫోరం నేతలు ఆయన అడుగుజాడల్లో పయనిస్తూ, ఇంకా ఏం తెలంగాణ అన్నట్టుగా నొసలు చిట్లిస్తున్నారు. నెలాఖరులో జరుగనున్న పార్టీ మహానాడులో తెలంగాణపై తీర్మానం తీసుకురావాల్సిన అవసరమే లేదని తెగేసి చెప్పారు. మరోవైపు, తెలంగాణ ఇచ్చేది మేమేనని ఇన్నేళ్లు ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణపై చేతుపూత్తేసిన మొన్నటి చాకో మాటల్లోనే స్పష్టమైంది. ఆ స్పష్టతలోంచే ముగ్గురు టీ కాంగ్రెస్ ఎంపీలు పార్టీ అధిష్ఠానవర్గానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై డెడ్‌లైన్ కూడా విధించారు. కాదంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు సిద్ధమేనని కూడా సంకేతాలిచ్చారు.

ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ఏమిటన్న క్షేత్రస్థాయి నాయకుల ప్రశ్నకు ముఖ్యనేతల వద్ద సమాధానం కరువవుతోంది. పీసీసీ నేతల్ని గురిపెట్టి బుధవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో శరపరంపరగా జిల్లా నాయకులు తెలంగాణపై ప్రశ్నలు సంధించారు. ‘తెలంగాణ ఇస్తారా? లేదా? స్పష్టం చేయండి. తెలంగాణ ఇవ్వనంత వరకు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ప్రజలకోసం ఎంతచేసినా లాభం లేదు. ఇక్కడ పార్టీ గెలువడం అసాధ్యం’. ఈ సమావేశంలో తెలంగాణ జిల్లాల క్షేత్రస్థాయి నాయకులు స్పష్టంగా చెప్పిన మాట ఇది. ఉద్యమ పార్టీలకు పోటీగా తాము పనిచేయలేని స్థితి ఏర్పడిందని ఆ నేతలు ఆందోళన, ఆవేదన వ్యక్తపరిచారు. తెలంగాణ అంశంపై మాట్లాడేందుకు అనుమతించకపోయినా, దానిపై మాట్లాడొద్దంటూ ఆంక్షలు విధించినా, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఐదున్నర దశాబ్దాల డిమాండ్‌ను తెలంగాణ కాంగ్రెస్ బిడ్డలు కొందరు ఘంటాపథంగా వినిపించారు. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన రాష్ట్రస్థాయి ముఖ్యనేతలు ఎవరూ కూడా ఈ సదస్సులో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించలేదు.

మరోసారి తెలంగాణ గళాన్ని అధిష్ఠానానికి చేరవేసేందుకు అందివచ్చిన వేదికను సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు, మంత్రి జానాడ్డి, పీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీలకు వేదికపై మాట్లాడే అవకాశం లభించినా తెలంగాణ ఆంశాన్ని ప్రస్తావించకుండా అధిష్ఠానం పట్ల వీరవిధేయతను ప్రదర్శించుకున్నారు. ఒకవిధంగా కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో తెలంగాణవాదం క్షేత్రస్థాయి నుంచి మార్మోగింది. ఆంక్షలను ఈ ప్రాంత నేతలు పట్టించుకోలేదు. డిసెంబర్ 9న చేసిన ప్రకటనను అమలు చేస్తేనే కాంగ్రెస్ బతుకుతుందని, లేదంటే తెలంగాణలో పార్టీకి పుట్టగతులుండవని తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకునేవిధంగా రాష్ట్ర నాయకత్వం కేంద్రానికి నివేదికలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ప్రత్యేక రాష్టాన్ని ఏర్పాటు చేయాలని అదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత హరికృష్ణ డిమాండ్ చేశారు.

తెలంగాణ అంశంపై స్పష్టత ఇచ్చాక పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టంచేశారు. అధిష్ఠానం ప్రకటించిన తెలంగాణ రాష్ట్రాన్ని అమలు చేసేవిధంగా రాష్ట్రంలోని ముఖ్యనేతలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని వరంగల్ జిల్లాకు చెందిన పసునూరి మనోహర్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేయడంవల్ల ఆ వర్గాలు పార్టీకి దూరమయ్యాయని వివరించారు. తెలంగాణ ఆంశంపై స్పష్టమైన వైఖరిని పార్టీ క్యాడర్‌కు తెలియజేయాల్సిన అవసరం ఉందని, తెలంగాణ ఇస్తామా? ఇవ్వమా? ఏదో ఒకటి చర్చించి స్పష్టం చేయాలని, అలా చేయకుండా నాన్చుతూ పోతుండడం వల్ల కార్యకర్తలు ఊబిలో ఇరుక్కు పోయారని కరీంగనర్ డీసీసీ అధ్యక్షుడు రవీందర్‌రావు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు చెప్పారు. తమ ప్రాంతంలో తెలంగాణవాదం బలంగా ఉందని అదే జిల్లాకు చెందిన రాజశేఖర్ తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఒక ఎత్తయితే, తెలంగాణవాదం మరొక ఎత్తవుతుందని ఆయన వెల్లడించారు. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని, అప్పుడే అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని రంగాడ్డి జిల్లాకు చెందిన మహ్మద్ సిరాజ్ అన్నారు. ఇప్పుడు నడుస్తున్న ఉద్యమం తెలంగాణ అవశ్యకతను తెలియజేస్తున్నదని, ఆ విషయాన్ని పార్టీ హై కమాండ్ పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మండల, బ్లాక్, జిల్లా అధ్యక్షులు తెలంగాణ గురించి ఇలా కుండ బద్ధలుకొట్టినట్టు మాట్లాడుతుంటే వేదికపై ఉన్న తెలంగాణ ప్రాంత ముఖ్యనేతలు మాత్రం మౌనం వహించారు. పీసీసీ చీఫ్ బొత్స జిల్లా నేతలను వారించే ప్రయత్నం చేస్తున్నా, ముఖ్యనేతలు చూస్తూ ఉండిపోయారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.