తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర

water
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రానికి సంబంధించిన రెండు కీలక దస్త్రాలపై సంతకం చేశారు. రాష్ట్ర పునర్విభజన బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. అలాగే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకూ ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పటికే పార్లమెంటు ఆమోదించిన టీ బిల్లు చట్టంగా మారింది. రాష్ట్రంలో గవర్నర్ చేతికి పాలనా పగ్గాలు అందాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇవాళే గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడే ఛాన్స్ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీ ఎప్పుడూ అనేది అసక్తికరంగా మారింది. బహుషా ఎన్నికల అనంతరం జూన్ 1వ తేదీని అపాయింటెడ్ తేదీగా నిర్ణయించే అవకాశముందని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. అప్పటివరకు ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వెలువడుతాయి. జూన్ 1 లేదా 2న రెండు చోట్లా కొత్త ప్రభుత్వాలు కొలువు దీరే అవకాశముంది. అలాగే రాష్టంలో ప్రధాన కార్యదర్శి పదవిని కూడా జూన్ వరకు పొడగించారు. రెండు రాష్ర్టాలకు సంబంధించి విభజన అనంతర ప్రక్రియపై ఇంకా కొంత కసరత్తు చేయాల్సి ఉన్నందున, ఆస్తులు, అప్పుల పంపకం కొనసాగుతున్నందున రెండు రాష్ట్రాలు వేరు కాపురం పెట్టడానికి కొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలు పూర్తయి రెండు రాష్ర్టాల్లో ప్రభుత్వాలు ఏర్పడే నాటికి ఆవిర్భావ తేదీని నిర్ణయించే ఛాన్సు ఉంది. అయితే ఈ తేదీ ఎప్పడనేది గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొనే ఛాన్స్ ఉంది.
రాష్ట్రపతి పాలనకు ప్రణబ్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై కేంద్ర కేబినెట్ సిఫారసుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన ఫైల్‌పై ఆయన ఇవాళ సంతకం చేశారు. దీంతో ఈరోజే నోటిఫైడ్ తేదీగా పరిగణనలోకి వస్తుంది. అంటే ఇవాల్టీ నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులోకి వస్తుంది. ఢిల్లీ నుంచి గవర్నర్‌కు సమాచారం అందగానే పాలనా పగ్గాలు ఆయన చేతిలోకి వస్తాయి. దీంతో సీఎం సహా మంత్రులందరూ మాజీలుగా మారారు. ఎమ్మెల్యేలకూ ఎలాంటి అధికారాలు ఉండవు. జీతాలు మాత్రం అందుతాయి. అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉంటుంది.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.