తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చిన బీజేపీపై షిండే ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 :  కీలకమైన తెలంగాణ బిల్లు ఆమోదం విషయంలో ప్రతిపక్షంపైనా, ప్రత్యేకించి బీజేపీ మద్దతుపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌పైనా ప్రశంసల జల్లు కురిపించారు. 15వ లోక్‌సభ చివరి రోజు సమావేశంలో ఆయన వీడ్కోలు ప్రసంగం చేశారు. సభలో వేర్వేరు అంశాలపై అధికారపక్షం, ప్రతిపక్షం పరస్పరం విభేదించుకున్నా.. సభ వెలుపల వాటిని కొనసాగించకపోవడం భారత ప్రజాస్వామ్య సౌందర్యమని ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం ముగియబోతున్న 15వ లోక్‌సభ లోక్‌పాల్ చట్టం, ఆహార భద్రత చట్టం, భూ సేకరణ చట్టం, నిర్భయ చట్టం సహా అనేక మైలు రాళ్ల వంటి చట్టాలను ఆమోదించిందని చెప్పారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక చట్టాలను తీసుకువచ్చేందుకు మనం కలిసి నిర్ణయం తీసుకున్నాం అంటూ ఆయన లోక్‌సభ సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ బిల్లు విషయాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీ ఇచ్చిన మద్దతుకు కతజ్ఞుడినై ఉంటానని అన్నారు.

shinde బిల్లుకు బీజేపీ మద్దతు ఇస్తుందన్న విషయంలో మొదట్లో నమ్మకం లేదు. కానీ.. మీరు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చి ఉన్నారు అని చెప్పారు. ఈ విషయంలో సుష్మాస్వరాజ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. మీ మాటలు మిఠాయి కంటే తియ్యగా ఉంటాయి అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం సహకారం లేకుండా ఏదీ జరుగదని నిర్మాణాత్మక పద్ధతిలో సహకరించేందుకు ప్రతిపక్షం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని షిండే వ్యాఖ్యానించారు. సభ నిర్వహణలో సహకరించారంటూ సమాజ్‌వాది, బీఎస్పీ, వామపక్షాలు, డీఎంకే, ఏఐఏడీఎంకే తదితర పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

2012 డిసెంబర్‌లో ఢిల్లీలో జరిగిన దారుణమైన గ్యాంగ్‌రేప్ ఘటనపై ప్రతిపక్షాలు స్పందించిన తీరును ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఘటన మనందరినీ తీవ్రంగా కలచివేసింది. నేర చట్టం సవరణ బిల్లును సభ ఆమోదించింది. విభేదాలు ఉన్నా ఈ విషయంలో మనమంతా ఐక్యంగా నిలిచాం. ఇలాంటి సందర్భాలు చాలా అరుదు అన్నారు. సభ నిర్వహణలో స్పీకర్ మీరాకుమార్ పాత్రను ఆయన కీర్తించారు. అత్యంత క్లిష్టమైన పనిని ఆమె సమర్థవంతంగా నిర్వహించారని చెప్పారు. టీ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా చోటు చేసుకున్న పెప్పర్‌స్ప్రే ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. తోపులాటకూడా జరిగింది. నేను భయపడిపోయాను అన్నప్పుడు పలువురు సభ్యులు ఆయనను అడ్డుకుంటూ దేశానికి హోంమంత్రి దేనికీ భయపడకూడదని అన్నారు. ఇందుకు షిండే స్పందిస్తూ.. బాధ్యత వహించేందుకు తాను భయపడనని బదులిచ్చారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.