తెలంగాణ బిల్లుకు భారీ మద్దతు!

కాస్త్త ముందో వెనుకో తెలంగాణ బిల్లు పార్లమెంటు ప్రవేశం ఖాయమైపోయింది. అరవై ఏళ్ల ఈ ప్రాంతవాసుల ఆకాంక్ష నెరవేర్చేందుకు తొమ్మిదేళ్ల క్రితం ఇచ్చిన హామీ అమలుకు అధికారపక్షం కృతనిశ్చయంతోనే ఉంది. పార్టీవేదికపై తెలంగాణకు గండి కొట్టాలని విఫలయత్నం చేసిన సీమాంధ్ర నేతలు ఇపుడు బిల్లును ఓడించేందుకు ఇతర పక్షాలవైపు దృష్టి సారించారు. వైఎస్సార్సీపీ నేత జగన్మోహన్‌రెడ్డి దేశవ్యాప్త పర్యటన చేస్తుంటే ఇంకొందరు తెరవెనుక యత్నాలు చేపట్టారు. వచ్చే ఏడాది ఎన్నికలు, కొత్త ఫ్రంట్‌లు, కూడికలు తీసివేతల వాతావరణంలో కొన్ని పార్టీల స్వరం మారడం తెలంగాణవాదులను ఆందోళనకు గురిచేస్తున్నది. దీనికి తోడు మీడియా ప్రచారాలు హోరెత్తుతున్నాయి. ఏనాడో ఏకాభిప్రాయం వచ్చిన తెలంగాణ అంశంలో బిల్లు ఆమోదం జరగదని, కష్టమని వాదనలు చర్చలు గందరగోళం సృష్టిస్తున్నాయి. అయితే ఇందులో నిజానిజాలేమిటి? బిల్లు బలపరిచేదెవరు? అడ్డుపడేదెవరు? ఎవరి బలాబలాలేమిటి? మద్దతెంత.. వ్యతిరేకత ఎంత?

tgflagహైదరాబాద్ డిసెంబర్ 2 (టీ మీడియా):తెలంగాణ రాష్ట్ర బిల్లును అతిత్వరలో పార్లమెంటు ముందుకు తెస్తామని హోం మంత్రి షిండే ప్రకటించారు. అది ఈ నెల 20 లోగా వస్తుందా లేక మరో ప్రత్యేక సమావేశంలో వస్తుందా అనే సంగతి ఎలా ఉన్నా తొందర్లోనే రావడం మాత్రం ఖాయం. ఈలోగా పార్లమెంటులో బిల్లు నెగ్గదంటూ ప్రచారాలు ప్రారంభమయ్యాయి. వివిధ పార్టీలు తెలంగాణకు మద్దతు ఇవ్వబోవనేది తెలంగాణ ఏర్పాటు ఆగిపోవాలనుకుంటున్న ఆశావాదుల అంచనా. తెలంగాణను అటువైపు నుంచి నరుక్కుంటూ రావాలన్న యోచన కొందరు సీమాంధ్ర నేతల్లో కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇందుకోసం వివిధ పార్టీల వద్దకు పర్యటనలు కూడా చేస్తున్నారు. ఇది చంద్రబాబు ఢిల్లీ దీక్షను అధిగమించే యత్నమనే భావన ఉంది.

ఇక టీడీపీ చాప కింద నీరులా బిల్లు ఆమోదం పొందకుండా రాజకీయం చేసే అవకాశముందని తెలంగాణ వాదుల అనుమానం. మరోవైపు బిల్లు ప్రవేశపెట్టే సమయానికి సీమాంధ్ర నాయకులు కూడా అదే పని చేయరని చెప్పలేము. కాంగ్రెస్‌లో పార్టీపరంగా ఒత్తిడితో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నిలిపివేయడంలో విఫలమైన వర్గాలు తాజాగా ఇతర జాతీయ పక్షాల వేపు చూడడం సహజమే. దీనికి తోడు గతంలో తెలంగాణ అంశానికి మద్దతు ప్రకటించిన కొన్ని పార్టీలు రూటు మార్చుకుంటున్నాయి. ఎన్నికల తర్వాత వైఎస్సార్సీ మద్దతు దృష్టితో కావొచ్చు. జేడీ(యూ) నేత శరద్ యాదవ్ విభజన రాజ్యాంగబద్దంగా జరగలేదనే పల్లవి ఎత్తుకున్నారు. బిజూ జనతాదళ్ నవీన్ పట్నాయక్ సమన్యాయం రాగం అందుకున్నారు. వీరిద్దరూ గతంలో తెలంగాణకు బేషరతు మద్దతు పలికిన వారే. గతంలో యూపీఏలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మమత తాజాగా వ్యతిరేక స్వరం వినిపిస్తున్నది.

డీఎంకే ముందునుంచీ వ్యతిరేకమే. ఎన్‌డీఏ కూటమిలో ఉన్నా విదర్భ డిమాండ్ భయంతో శివసేన చిన్న రాష్ట్రాలకు ఆదినుంచి వ్యతిరేకమే. అయితే వ్యతిరేక ఓటు దాకా వెళ్లదు. ఇక అనుకూల పక్షాల విషయానికి వస్తే ఎన్సీపీ శరద్‌పవార్ మద్దతు అచంచలం. ఆఎల్డీ అజిత్‌సింగ్ స్వయంగా హరితప్రదేశ్ ఉద్యమకారుడు, పైగా యూపీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి మద్దతు చెక్కు చెదరదు. బీఎస్సీ మాయావతి, ఆర్జేడీ లాలూ ప్రసాద్, జేడీఎస్ దేవెగౌడలు కూడా మద్దతు కొనసాగిస్తారు. వామపక్షాల్లో సీపీఎం అటు వైపు సీపీఐ ఇటు వైపు పరిస్థితి యథాతథమే. జేఎంఎం శిబూసోన్ టీఆర్‌ఎస్‌కు కులగురువు. ఫార్వర్డ్‌బ్లాక్, ఆర్‌ఎస్‌పీ సూత్ర రీత్యా చిన్నరాష్ట్రాలకు అనుకూలం. వీరందరిలో ఎవన్ని ప్రయత్నాలు చేసినా పెద్ద మార్పును ఊహించలేం. సింపుల్‌గా చెప్పాలంటే థర్డ్‌ఫ్రంట్, మమత ఫ్రంట్ తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడితే యూపీఏ, ఎన్‌డీఏలోని మెజార్టీ పక్షాలు అనుకూలంగా ఉంటాయి. ఆసక్తికర అంశం ఏమిటంటే మూడో్ఫ్రంట్‌గా ఏర్పాటవుతాయని భావిస్తున్న కొన్ని పార్టీలు గతంలో తెలంగాణకు మద్దతు లేఖలు ఇచ్చిఉండడం. అవి తాజా పరిణామాల్లో విశ్వసనీయతను కాపాడుకుంటాయా లేక ప్లేటు ఫిరాయిస్తాయా అనేది వేచి చూడాలి.

tgflag1 ఎపుడో ఏకాభిప్రాయం…
వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద దేశవ్యాప్తంగా ఎపుడో ఏకాభిప్రాయం వచ్చేసింది. తెలంగాణపై ఏకాభిప్రాయ సాధనకు 2005 మార్చ్‌లో యూపీఎ-1 ప్రభుత్వం ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఛైర్మన్‌గా మిత్రపక్షాలైన ఆర్‌జేడీ నుంచి రఘువంశప్రసాద్, డీఎంకే నుంచి దయానిధి మారన్ సభ్యులుగా ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ ఎనిమిది వారాల్లో నివేదిక ఇస్తుందని ప్రకటించింది. ప్రణబ్ కమిటీ పని సులువు చేసే ప్రక్రియలో భాగంగా టీఆర్‌ఎస్ దేశంలోని అనేక ప్రధాన రాజకీయ పక్షాలను సంప్రదించి మద్దతు లేఖలు సంపాదించింది. పార్లమెంటులో ఆనాడు తెలంగాణకు మద్దతు తెలిపిన వ్యక్తులు, పార్టీలకు ఉన్న సభ్యుల సంఖ్య 440. ఆ రకంగా ఆనాటి సభలోనే తెలంగాణకు భారీ మద్దతు వచ్చేసింది. అయితే ఆనాడున్న యూపీఎ 1 తెలంగాణపై తేల్చకుండానే 2009 ఎన్నికలకు వెళ్లింది. అయితే నాడు చేపట్టిన లేఖల సేకరణ ప్రక్రియ ఇవాళ తెలంగాణ బిల్లు ఆమోదం విషయంలో ప్రయోజనకారి కాబోతున్నది. నాడు ఆమోదం తెలిపిఉన్న పార్టీలు ఇవాళ ఏ కూటమిలో ఉన్నప్పటికి మద్దతు తెలిపే అవకాశం ఉంది.

సంప్రదింపులు లేకుండానే ఏకాభిప్రాయం
ప్రణబ్‌ముఖర్జీ కమిటీ మూడు, నాలుగుసార్లకు మించి రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించలేదు.అయితే సమావేశాలకు పిలవని పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇస్తూ ప్రణబ్‌ముఖర్జీకమిటీకి లేఖలు రాశాయి. నాటి యూపీఎ-1కూటమిలో 13 పార్టీలు భాగస్వాములు కాగా వాటిలో 11 పార్టీలు అనుకూల లేఖలు ఇచ్చాయి. 2006లో నిర్వహించిన యూపీఎ సమావేశంలో తెలంగాణ అంశానికి కరుణానిధి మద్దతు ప్రకటించారు. ఇక యూపీఎకు 11 పార్టీలు బయటి నుండి మద్దతు ఇవ్వగా అందులో ఆరు తెలంగాణకు మద్దతు తెలియజేశాయి. సమాజ్‌వాది పార్టీ వ్యతిరేకించగా మిగిలినవి తటస్తవైఖరి తీసుకున్నాయి.

tgflag3 రూట్ మార్చుకున్న కొన్ని పార్టీలు
అయితే ఆనాడు అనుకూల లేఖలిచ్చిన పార్టీల్లో కొన్ని ఇపుడు ఎన్నికలు, కూటముల లెక్కలతో వైఖరి మార్చుకున్నాయి. వీటిలో జేడీయూ, డీఎంకే, టీడీపీ ఉన్నాయి. రాబోయే థర్డ్ ఫ్రంట్‌లో కీలకంగా ఉండాలనుకోవడమే ఈ యూటర్న్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. డీఎంకే పార్టీ యూపీఎ1,2 ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించింది. కనిమోళి, 2జీ కేసుల్లో దానికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దీనితో కాంగ్రెస్ పై ఆగ్రహంతో మూడో ఫ్రంట్ వైపు అడుగులేస్తోంది. ఇక జేడీయూ పార్టీకి అధ్యక్షుడుగా జార్జి ఫెర్నాండెజ్ ఉన్న కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు లేఖ రాశారు. అధ్యక్షుడు మారడం, థర్డ్ ఫ్రంట్ ఆలోచన ఆ పార్టీ వైఖరిలో మార్పుకు కారణమైంది.

విభజన రాజ్యాంగబద్ధంగా జరగడం లేదనే సాకు చూపుతోంది. ఇక తెలుగుదేశం పార్టీ విధానం జగద్విదితం. రాష్ట్ర ఏర్పాటుకు అవకాశం లేదని బలంగా నమ్మకం కలిగినపుడు మద్దతు ప్రకటించడం, తీరా ఏర్పాటు ప్రక్రియ చేపడితే కుంటిసాకులతో వ్యతిరేకత తెలపడం ఆ పార్టీ విధానమనే విషయం ఇపుడు జాతీయ స్థాయిలో కూడా వెల్లడైపోయింది. మొదట్లో థర్డ్ ఫ్రంట్ అనుకుని తర్వాత అదీ లాభం లేదనుకుని తాజాగా బీజేపీ వాకిట్లో వారి పిలుపుకోసం పడిగాపులు పడుతున్నది.

నలుగురు ప్రధానుల ఆమోద లేఖలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేవలం పార్టీలే కాకుండా నలుగురు మాజీ ప్రధానులు కూడా సోనియాగాంధీకి, యూపీఎ ప్రభుత్వానికి, ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి లేఖలు రాశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై హామీ ఇచ్చినందున వెంటనే ఆ దిశగా కాలయాపన చేయకుండా నిర్ణయం తీసుకోవాలని ఆ మాజీలు పలుమార్లు లేఖలు రాశారు.

టీ జేఏసీ కార్యచరణ..
తెలంగాణ బిల్లుకు మద్దతు కూడగ తెలంగాణ రాజకీయ జేఏసీ నడుం బిగించింది. ఇప్పటికే ఢిల్లీ చేరిన నాయకులు నాడు అనుకూలంగా లేఖలు అందించిన అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కోరనున్నారు. అలాగే ఇతర పార్టీల పెద్దలను కూడా కలిసి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ప్రాధాన్యతను వివరించి కూడగట్టే కార్యక్రమం రూపొందించుకున్నారు.

మాజీ ప్రధానుల నాటి మాట..
మొదటి ఎస్సార్సీ సూచించిన విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగాలని కే చంద్రశేఖరరావు నేతృత్వంలో జరిగిన బహిరంగసభలో నేను ప్రకటన చేశాను. ఇప్పటికీ నా అభిప్రాయం అదే.

– హెచ్‌డీ దేవెగౌడ

ప్రత్యేక రాష్ట్రం కావాలన్న తెలంగాణ ప్రజల కోరిక సహేతుకమని భావిస్తున్నాను. ఇంకేమాత్రం సమయం వృథా చేయకుండా ఇందుకోసం వెంటనే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను.

– వీపీ సింగ్

తెలంగాణ రాష్ట్ర డిమాండ్ పూర్వాపరాలన్నీ నాకు తెలుసు. దానికి నా పూర్తి మద్దతు ఉంది. ఈ డిమాండ్ నెరవేర్చడం వల్ల ఆ ప్రాంత ప్రజల వేదనలు, ఇబ్బందులు తొలగిపోతాయి.

– ఐకే గుజ్రాల్

బాధ్యతాయుత ప్రజాస్వామ్య వ్యవస్థలో తెలంగాణ ప్రజలు సుదీర్ఘకాలంగా తమ వంతు కోసం ఓపికగా వేచి ఉన్నారు. ప్రజల ఆకాంక్షలను మనం ఇంకేమాత్రం ఉపేక్షించకుండా వీలైనంత త్వరగా పరిశీలించాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నా హృదయపూర్వక, రాజీలేని మద్దతు ప్రకటిస్తున్నాను.

– చంద్రశేఖర్

-ప్రత్యేక తెలంగాణ కావాలన్న ప్రజల డిమాండ్‌కు బీజేపీ ఎల్లప్పుడూ మద్దతు పలుకుతూనే ఉంది.

– భారతీయ జనతా పార్టీ, 2006 మే 3 జాతీయ కార్యవర్గ సమావేశం తీర్మానం

ఎన్సీపీ వర్కింగ్ కమిటీ 2003 ఆగస్ట్ 21న సమావేశమై తెలంగాణ అంశంపై సమక్షిగంగా చర్చించి మద్దతు పలికింది. ఇంకేమాత్రం కాలాతీతం జరగకుండా తెలంగాణ ఏర్పాటు కావాలని ఎన్సీపీ అభిప్రాయపడుతున్నది.

– శరద్ పవార్, నేషనలిస్టు కాంగ్రెస్

ఇప్పటికే యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలో అంగీకరించిన విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్తి మద్దతు తెలుపుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏర్పాటు చేయాలని హృదయపూర్వకంగా సూచిస్తున్నది.

-లాలూ ప్రసాద్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వాగ్దానం చేసి ఇప్పటికే ఏడాది దాటినందున ఇంకేమాత్రం ఆలస్యం చేసినా అది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపే అవకాశముంది. అందువల్ల వీలైనంత త్వరగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని బీఎస్పీ కోరుతోంది.

– మాయావతి, బహుజన్ సమాజ్ పార్టీ

లోక్ జనశక్తి పార్టీ చిన్నరాష్ట్రాల డిమాండ్లకు మద్దతు తెలపడమే కాకుండా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేవిధంగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని మా పార్టీ కోరుతున్నది.

– రాం విలాస్ పాశ్వాన్, లోక్ జనశక్తి

రాష్ట్రీయ లోక్‌దళ్ తెలంగాణతో సహా చిన్నరాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలం. తెలంగాణ ప్రక్రియ ప్రారంభించేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నాం.

– అజిత్ సింగ్, రాష్ట్రీయలోక్‌దళ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మా పార్టీ సమర్థిస్తుందని తెలియచేస్తున్నాం.

-జార్జి ఫెర్నాండెజ్, జనతాదళ్(యూ)

కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశానికి వచ్చిన అంగీకారం యూపీఏ పక్షాల ఏకాభిప్రాయానికి అద్దం పడుతున్నది. మన కూటమి వాగ్దానం చేసి కూడా ఇప్పటికే ఏడాది గడిచినందున ఇక దానిని నెరవేర్చవలిసి ఉంది.

-శిబూ సోరెన్, జార్ఖండ్ ముక్తి మోర్చా

అట్టడుగు వర్గాల ప్రతినిధిగా పట్టలి మక్కల్ కట్చి పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తక్షణమే ప్రారంభించాలని గట్టిగా కోరుతోంది.

– ఎస్.రాందాస్, పట్టలి మక్కల్ కట్చి

యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తక్షణమే అవసరమైన సంప్రదింపులు, తదితర చర్యలు చేపట్టాలని ఎండీఎంకే పార్టీ కోరుతున్నది.

– వైకో, ఎండీఎంకే

సంప్రదింపుల ప్రక్రియ ఇంతకు ముందే ప్రారంభం కావాల్సి ఉండేది. తెలంగాణ ఏర్పాటులో జాప్యం ఆ ప్రాంతంలో అశాంతికి కారణమవుతున్నందున తక్షణమే చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ఏర్పాటు ఆ ప్రాంతంతో పాటు దేశ విస్తృత ప్రయోజనాలకు ఉపయోగకరం.

– రాందాస్ అథవాలె, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా

దేశవ్యాప్తంగా విస్తృత అంగీకారం వచ్చిన అనంతరం కూడా రాష్ట్ర ఏర్పాటు అంశంలో ఆలస్యం జరిగిందని మేం భావిస్తున్నాం. మా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తున్నది.

– మహబూబా ముఫ్తి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ

This entry was posted in ARTICLES.

Comments are closed.