తెలంగాణ బిడ్డలంతా ఏకం కావాలి: కేసీఆర్

మహబూబ్‌నగర్: తెలంగాణ బిడ్డలంతా ఏకం కావాలని తెలంగాణ ఉద్యమనేత, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టీఆర్‌స్ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ ఆయన టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో దేవరకద్రలో నిర్వహించిన టీఆర్‌ఎస్ నియోజక వర్గస్థాయి కార్యకర్తల శిక్షణా శిభిరంలో మాట్లాడారు. తెలంగాణ బిడ్డలంతా ఒక్కటై తెలంగాణ సాధన కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకోసం మనమంతా ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ శిక్షణా తరగతుల్లో చర్చిస్తున్న విషయాలను కార్యకర్తలందరూ గ్రామాల్లో చర్చకు పెట్టాలని, ప్రజలకు తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాలపై తెలపాలని కోరారు. తెలంగాణ బిడ్డలంతా ఏకమవుతోన్న సందర్భమిది అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఆంధ్రా పార్టీల అవసరం ఉందా? అని కార్యకర్తలను ప్రశ్నించారు. ఈ విషయంపై కార్యకర్తలు గ్రామాల్లో చర్చలు జరుపాలన్నారు.

పాలమూరుకు నీళ్లిచ్చే బాధ్యత నాది: కేసీఆర్
పాలమూరు జిల్లాకు నీళ్లిచ్చే బాధ్యత తనదని కేసీఆర్ హామీ ఇచ్చారు. పది లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే బాధ్యత తనదని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో డ్యాంలకు వేసిన శంకుస్థాపన రాళ్లను ఒక దగ్గరకు చేర్చితే ఒక డ్యాంపూర్తయ్యేదని ప్రభుత్వాని ఎద్దేవా చేశారు. కోయిల్ సాగర్ పూడిక తీతకు తన ఎంపీ ల్యాడ్ ఫండ్స్ నుంచి రూ.10 లక్షలు విడుదల చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించా

బాబు 9 ఏళ్లలో 9 పైసలు కూడా ఇవ్వలేదు: కేసీఆర్
టీడీపీ ఈ రాష్ట్రాన్ని తొమ్మిది ఏళ్లు పాలించిందని, అయినా కూడా తెలంగాణకు తొమ్మిది పైసలు కూడా ఇవ్వలేదని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర పార్టీలు కుట్రపన్నాయని ఆరోపించారు. టీడీపీ సీమాంధ్ర పార్టీయే అవుతుందని అన్నారు.

పాలమూరు జిల్లాకు ఇంకెన్ని పునాది రాళ్లెస్తారు: కేసీఆర్
పాలమూరు జిల్లాకు ఇంకెన్ని పునాది రాళ్లెస్తారని కేసీఆర్ ప్రశ్నించారు. పాలమూరును దత్తత తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ జిల్లాను అభివృద్ధి చేయలేదని ఆయన విమర్శించారు.కల్వకుర్తి, నెట్టెంపాడులకు శిలా ఫలకం కూడా వేయలేదని, తొమ్మిదేళ్ల పాలనలో తొమ్మిదిరూపాయలు కూడా కేటాయించలేదని దుయ్యబట్టారు. ‘పాలమూరులో పళ్లేరు మొలిచే’ అని ఇంకెన్నాళ్లు పాట పాడుకుందామని అన్నారు. టీఆర్‌ఎస్ గుగ్గూ కూస్తే ఎల్లెలకల పడిన టీడీపీ తెలంగాణలో ఇంకా కోలుకేలేక పోయిందని విమర్శించారు. టీఆర్‌ఎస్ పుట్టిననాడు బొండిగ పిసుకుతమని అన్న ఆంధ్రోళ్లు అన్నారని, అయినా పార్టీ పుట్టిన నాటి నుంచి తెలంగాణ కోసం పోరాటం చేస్తూనే ఉందని తెలిపారు. ఎన్నికలు రాగానే సీమాంధ్ర నేతలకు తెలంగాణ మీద ఎక్కడాలేని ప్రేమ పుట్టుకొస్తదని, కడుపులోంచి ప్రేమ దేవుకొస్తదని తెలిపారు.

డీకే అరుణ ఏంచేస్తోంది: కేసీఆర్
ఆర్డీఎస్‌ను బద్దలు కొట్టి రాయలసీమ నేతలు నీళ్లను తరలించుకు పోతుంటే జిల్లా మంత్రి డీకే అరుణ ఏంచేస్తోన్నారని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ నేతగా దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం లేదా అని అన్నారు.

పిడికెడు మందితో ఉద్యమపార్టీ పుట్టింది: కేసీఆర్
2001లో పిడికెడు మందితో తెలంగాణ ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్ పుట్టిందని కేసీఆర్ అన్నారు. ఆనాడు అందరూ ఏం తెలంగాణ సాధిస్తారని ఎద్దేవా చేశారని తెలిపారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ జన ప్రభంజనంలా మారిందని అన్నారు. టీఆర్‌ఎస్ పుట్టినప్పటి నుంచి మడమ తిప్పకుండా పని చేస్తోందని, తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టే మనం ఈ స్థితిలో ఉన్నామని కేసీఆర్ వివరించారు.

సన్నాసులున్నరు కాబట్టే అన్యాయం జరుగుతుంది: కేసీఆర్
తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేదిలేదు అని శాసనసభలో సీఎం కిరణ్ అన్నప్పుడు మన తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ దద్దమ్మలు ఒక్కమాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. ‘ఆంధ్రా పార్టీలకు ఊడిగం చేసే తెలంగాణ సన్నాసులున్నరు కాబట్టే మనకు అన్యాయం జరుగుతుంది. అభివృద్దికి నోచుకోవడంలేదు’ అని కేసీఆర్ అన్నారు. చావుకు తెగించి తాను తెలంగాణ సాధిస్తే ఆంధ్రా జీవులన్నీ అడ్డుకున్నాయని కేసీఆర్ విమర్శించారు. సీమాంధ్ర పార్టీల నేతలు చంద్రబాబు, జగన్‌లు తెలంగాణను అడుగడుగునా అడ్డుకున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు మోక కోసం ఎదురు చూస్తున్నారని, అదును దొరగ్గానే సీమాంధ్ర పార్టీలకు కర్రు కాల్చి వాత పెడతారని పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.