తెలంగాణ ప్రొఫెసర్‌పై బౌన్సర్ దాడి

చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ)లో విద్యార్థినుల ఫొటోలు తీస్తున్నందుకు మందలించిన ఓ తెలంగాణ ప్రొఫెసర్‌పై బౌన్సర్ దాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై ప్రిన్సిపాల్ స్పందిచకపోవడంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సీబీఐటీలో భద్రత పేరుతో 25మంది బౌన్సర్లతో కూడిన ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటుచేశారు. శుక్రవారం కళాశాలలో ఓ బౌన్సర్ విద్యార్థినుల ఫొటోలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా గమనించిన ఉద్యోగులు టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణాడ్డికి విషయం తెలపడంతో ఆయన ప్రశ్నించగా బౌన్సర్ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అతడిని ప్రిన్సిపాల్ వద్దకు తీసుకెవెళ్లాడు. అక్కడ మాటామాటా పెరిగి బౌన్సర్ రామకృష్ణాడ్డిని తోయడంతో ఆయన కిందపడిపోయాడు. అక్కడే ఉన్న ప్రిన్సిపాల్ బీ చెన్నకేశవరావు కనీసం బౌన్సర్‌ను మందలించలేదు. విషయం తెలుసుకున్న తెలంగాణ టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు ప్రిన్సిపాల్ కార్యాలయానికి చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘జై తెలంగాణ’, ‘సీమాంధ్ర గోబ్యాక్’ అంటూ అక్కడే బైఠాయించారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. సెప్టెంబర్ 30న తెలంగాణ సభను ఏర్పాటుచేసినందుకు కుట్రపూరితంగా యాజమాన్యమే బౌన్సర్‌తో దాడిచేయించిందని రామకృష్ణాడ్డి ఆరోపించారు. ఈ నెల 25న సీబీఐటీలో ‘నవ తెలంగాణలో యువ ఇంజనీర్ల పాత్ర’ పేరిట నిర్వహించతలపెట్టిన మహా సదస్సును అడ్డుకోవాలని చూస్తుందన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.