తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్ష- లోక్‌సభలో హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే

తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌కు సుదీర్ఘమైన, అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్న ఈ ప్రాంతానికి విశిష్టమైన రాజకీయ సాంస్కతిక గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. 1960వ దశకంలోనే ప్రత్యేకతెలంగాణ రాష్ట్రం కోసం, 1970లో ప్రత్యేకఆంధ్ర కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమాలు జరిగాయి. చర్చలు, ఒప్పందాల ద్వారా అవి కాలక్రమేణా సమసిసోయాయి. అయితే.. ఇటీవలి కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆకాంక్షలు మళ్లీ ముందుకు వచ్చాయి.

Shindeప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలుగా పునర్వ్యవస్థీకరించడం ద్వారా తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఉభయ ప్రాంతాల భాగస్వాముల మధ్య ఆందోళనలు తొలగించేందుకు, రాష్ట్ర విభజనను నివారించేందుకు మేం శక్తివంచనలేకుండా ప్రయత్నించాం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాల నుంచి సమాచారాలు, సూచనలు ఆహ్వానించాం. వాటన్నింటీ పరిశీలించి.. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును తయారు చేశాం. ముసాయిదా బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకునేందుకు రాష్ట్రపతి నివేదించారు. 2014 జనవరి 23లోపు అభిప్రాయం తెలియజేయాలని రాష్ట్రపతి అసెంబ్లీని కోరారు. రాష్ట ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మరో వారం రోజులు గడువును రాష్ట్రపతి పొడిగించారు. జనవరి 30ని గడువుగా నిర్దేశించారు.

రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత వివిధ రంగాల నుంచి కూడా మేం అనేక సలహాలు అందుకున్నాం. వీటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని పరిశీలించింది. వాటి ఆధారంగా రూపొందించిన సవరణలను పరిశీలన నిమిత్తం ఈ ఉన్నత సభ ముందు ఉంచాం. ఉభయ రాష్ర్టాల సమగ్రాభివృద్ధి కోణాన్ని ఈ బిల్లు పరిగణనలోకి తీసుకున్నది. దీనిని సభలో చర్చకు ఆమోదానికి ఉంచాల్సిందిగా కోరుతున్నాను.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.