తెలంగాణ ప్రజలకే ఈ విజయం అంకితం-కేసీఆర్

సోనియా పట్టుదల వల్లే తెలంగాణ సాకారం-సహకరించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు-జయశంకర్‌సార్, అమరవీరులకు కన్నీటి నివాళి-విడిపోయినా.. అన్నదమ్ముల్లా కలిసి బతుకుదాం-సీమాంధ్రులకు ఎలాంటి ఇబ్బందులుండవు-విశ్వనగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందాం-ఢిల్లీలో విలేకరులతో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్హైదరాబాద్, ఫిబ్రవరి 20 (టీ మీడియా): ఈ విజయాన్ని తెలంగాణ ప్రజలకే అంకితం చేస్తున్నా. తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న టీఆర్‌ఎస్ శ్రేణులు, ఉద్యోగులు, కార్మికులు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఉద్యమకారులను సమన్వయం చేసిన టీజేఏసీ బృందానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ బిల్లును ఉభయ సభల్లోనూ ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఆమోదింపచేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, పార్లమెంటరీ పార్టీ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్‌లతోపాటు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా అని గులాబీ దళపతి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.kcrgaru.jpg గురువారం రాజ్యసభలోనూ బిల్లు ఆమోదం పొందిన తరువాత ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన మాటల్లోనే..ఆరు దశాబ్దాలుగా స్వరాష్ట్రం కోసం ప్రజలు, ఉద్యోగులు ఆత్మగౌరవ పోరాటాన్ని కొనసాగించారు. రాత్రనక, పగలనక నేను ఇచ్చిన ప్రతి పిలుపును అద్భుతంగా విజయవంతం చేసిన టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ముఖ్యంగా టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేను ఎప్పుడు కోరినా తమ పదవులను గడ్డిపోచల్లా త్యజించారు. ఈ ఉద్యమంలో ఎవరో గెలిచారని, ఎవరో ఓడారని కాదు. ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని సాధించుకున్నారు. తెలుగువారిగా ఉభయ రాష్ర్టాల్లోనూ కలిసిమెలిసి ఉందాం. సకల జనుల సమ్మెలాంటి గొప్ప ఉద్యమంతో ఉద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, ఆర్టీసీ, సింగరేణి కార్మికులు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, ప్రజలు, ప్రతి ఒక్కరూ చైతన్యాన్ని చాటారు. వీరందరినీ సమన్వయం చేసిన టీ జేఏసీకి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ అమరవీరులకు కన్నీటి నివాళి అర్పిస్తున్నాను.
ఉద్యమ భావజాలాన్ని రేపిన ఆచార్య జయశంకర్ సార్ ప్రస్తుతం మన మధ్య లేకపోవడం బాధాకరమే. తెలంగాణను ఆ సార్‌కు అంకితమిస్తున్నా. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని హామీ ఇస్తున్నా. కరీంనగర్ ఎంపీగా ఉండగా తెలంగాణ సాకారం అవుతుందనుకున్నా. కానీ ప్రస్తుతం మహబూబ్‌నగర్ ప్రజలకు ఆ ఘనత దక్కింది. తెలంగాణ కవులు, కళాకారులు సత్తా చాటారు. అన్ని కులాలు, మతాల ప్రజలు నాకు ఊపిరి పోసిండ్రు. నన్ను నడిపించింది తెలంగాణ ప్రజలే. ప్రస్తుతం తెలంగాణ పునర్నిర్మాణం ముఖ్యం. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను గొప్పగా అభివృద్ధి చేసుకుందాం. ప్రత్యేక విజన్‌తో ముందుకు సాగుదాం. సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా రెండు, మూడు రోజులు ఢిల్లీలోనే ఉంటా. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను, బీజేపీ నేతలను, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌లను కలిసి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సి ఉంది. మిగతా విషయాలన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. జైతెలంగాణ.

విడిపోయినా అన్నదమ్ములమే
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్రులు మనస్ఫూర్తిగా అంగీకరించాలి. రెండు రాష్ర్టాలుగా విడిపోయినప్పటికీ అన్నదమ్ముల్లా కలిసే ఉందాం. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలి. తెలంగాణ ఏర్పడటానికి సహకరించిన యూపీఏ భాగస్వామ్య పక్షాలకు కృతజ్ఞతలు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించడం ఖాయం.
– సుదర్శన్‌రెడ్డి, భారీనీటిపారుదల శాఖమంత్రి

సోనియా వల్లే తెలంగాణ వచ్చింది
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సోనియాగాంధీ వల్లే సాధ్యమైంది. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం వెనుక ఆమె కృషి ఎంతో ఉంది. రాష్ట్ర విభజనకు ఓట్లు, సీట్లు ముడిపెట్టవద్దు. తెలంగాణ ప్రజలకు చేసిన వాగ్ధానాన్ని సోనియాగాంధీ నెరవేర్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని అమరవీరులకు అంకితం ఇస్తున్నాం. బీజేపీ మద్దతు ఇచ్చినా, ఇవ్వక పోయినా బిల్లు ఆమోదం పొందేది.
– డీ శ్రీనివాస్, పీసీసీ మాజీ అధ్యక్షుడు

మహాతల్లి సోనియాను మరువలేము
తెలంగాణ ప్రజల 60 ఏళ్ళ కలను సాకారం చేసిన ఘనత పూర్తిగా సోనియాకే దక్కుతుంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అంకితభావం, పట్టుదలతో సోనియా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించే చరిత్రాత్మక రోజు. మహాతల్లి సోనియాను మరువలేము. గతంలో తెలంగాణ కోసం నా తల్లి ఈశ్వరీబాయి కూడా ఎంతో తపించిపోయారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి సోనియా రుణం తీర్చుకోవాలి.
-జే గీతారెడ్డి, రాష్ట్ర మంత్రి

సుముహూర్తం సావధాన..
లావొక్కింతయు లేదు.. అన్నట్లుగా మొసలి చేత చిక్కిన అసహాయుడైన గజేంద్రుడు తనను రక్షించమని విష్ణువును వేడుకున్న విధంగా తెలంగాణ ప్రజలు సోనియాగాంధీని వేడుకున్నారు. సోనియా తన బిడ్డల ఆకాంక్షలు తీర్చింది. తెలంగాణకు మద్దతు తెలిపిస చిన్నమ్మ సుష్మాస్వరాజ్, సోదరి మాయావతికి కృతజ్ఞతలు. బెంగాలీ దీదీగా పిలవబడే మమతాబెనర్జీ తెలంగాణను ఎందుకు అడ్డుకోవాలని చూశారో చెప్పాలి. చిన్న రాష్ర్టాల ఏర్పాటు వల్ల దళిత బహుజనులు అభివృద్ధి చెందుతారు. – రాపోలు ఆనందభాస్కర్, కాంగ్రెస్ ఎంపీ

విభజన కాదు.. విడిపోవటమే
దేశంలో ఏర్పడ్డ ఇతర రాష్ర్టాల మాదిరిగా ఏ రాష్ట్రం నుంచి తెలంగాణ విభజింపబటంలేదు. కేవలం గతంలో జరిగిన విలీనం నుంచి వైదొలుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాడిన తర్వాత తెలంగాణను అనేక షరతులతో బలవంతంగా విలీనంచేశారు. ఆ తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కడం ద్వారా సీమాంధ్ర పాలకులు మోసంచేశారు. అందుకే తెలంగాణ ప్రజలు స్వయం పాలన కోరుకున్నారు. ఇరు రాష్ర్టాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసి ఉండాలి. – వీ హనుమంతరావు, కాంగ్రెస్ ఎంపీ

ఇరుప్రాంతాలకు న్యాయం
రాష్ట్ర విభజన ద్వారా మా పార్టీ ఇరుప్రాంతాలకు న్యాయం చేస్తుంది. తెలంగాణ ప్రజల మేలు కోరి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ర్టాన్నిచ్చారు. సీమాంధ్రకు కూడా ప్రత్యేక రాయితీలిచ్చి సహకరించాలి. – ఎంఏ ఖాన్ , కాంగ్రెస్ ఎంపీ

తెలంగాణ ప్రజల కల సాకారమైంది
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నాలుగున్నకోట్ల తెలంగాణ ప్రజల కల సాకారమైంది. టీడీపీ తెలంగాణ బిల్లుకు పూర్తి మద్దతుగా నిలిచింది. రాష్ట్ర విభజన వల్ల బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడతాయి. తెలంగాణ రాష్ట్రం అతితక్కువ కాలంలోనే అభివృద్ధి చెందుతుంది. రాజకీయాలకు సంబందం లేకుండా పోరాడి వేలాది తెలంగాణ బిడ్డలు అమరులయ్యారు. తెలంగాణ రాష్ట్రం అమరులకు అంకితం. -దేవేందర్‌గౌడ్, టీడీపీ రాజ్యసభ పక్ష నేత

అమరవీరులకు జోహార్లు
తెలంగాణ రాష్ట్రం అమరవీరులకు అంకితం. స్థానికత ఆధారంగా ఉద్యోగులు, ఫించన్ల పింపిణీ చేయాలి. పోలవరం ద్వారా సర్వస్వం కోల్పోతున్న ఆదివాసీలను ఆదుకోవాలి.
-గుండుసుధారాణి, టీడీపీ ఎంపీ

సత్వర అభివృద్ధి కోసమే
సత్వర అభివృద్ధి కోసం రాష్ర్టాన్ని మాత్రమే విభజిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యానికి కాంగ్రెస్ పార్టీయే కారణం. ఓటు బ్యాంకు, అవకాశవాద రాజకీయాలకు పాల్పడిన ఆ పార్టీయే ఈ మొత్తం ప్రక్రియలో ప్రధాన దోషి. విభజన తర్వాత సీమాంధ్ర ప్రాంతం ఎదుర్కొనే రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదాను కట్టబెట్టాలి. పలు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించాలి. రూ. 10 వేల కోట్ల ప్యాకేజీని సీమాంధ్ర ప్రాంతానికి ఇవ్వాలి.
– వెంకయ్యనాయుడు, బీజేపీ నేత

సమగ్ర బిల్లును కోరుకున్నాం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేం అనుకూలం. కానీ చట్టపరంగా, న్యాయపరంగా చిక్కులు రాని బిల్లును ఆమోదించాలని మేం కోరుతున్నాం. రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ సర్కారు చేసిన కసరత్తు తీరు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది. బిల్లును రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించడం, బిల్లు ఆమోదం సందర్భంగా పార్లమెంటులో చోటుచేసుకున్న నిరసనలు సరైనవి కావు. హైదరాబాద్ శాంతిభద్రత అంశాన్ని గవర్నర్ చేతిలో పెట్టడమంటే కేంద్రం పరిధిలో ఉంచడమే. ఇది సమాఖ్య విధానానికి వ్యతిరేకం. – అరుణ్‌జైట్లీ, ప్రతిపక్ష నేత

ప్రభుత్వం, ప్రతిపక్షం మ్యాచ్ ఫిక్సింగ్
తెలంగాణ బిల్లు విషయంలో ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి. సభాపతి ఈ మ్యాచ్‌ఫిక్సింగ్‌లో భాగం కారాదు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సీపీఎం వ్యతిరేకం. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాం. – సీతారాం ఏచూరి, సీపీఎం నేత

ఆనందం కలిగిస్తోంది
తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తుండటం ఆనందం కలిగిస్తోంది. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. తెలంగాణ ఎంతోకాలం కిందటే ఏర్పాటు చేసి ఉండాల్సింది. ఇది సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ర్టాలుగా విభజించాలి. మహారాష్ట్ర నుంచి విదర్భ రాష్ర్టాన్ని కూడా ఏర్పాటు చేయాలి. – బీఎస్పీ అధినేత్రి మాయావతి

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.