తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది: షిండే

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నారు. తాను హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఇవాళ ఆయన మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని, ఇక రాజ్యాంగం ప్రకారం ప్రక్రియ మొదలుకానుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ తీర్మానం ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని స్పష్టంగా చెప్పారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. యూపీఏ కమిటీ కేంద్ర కేబినెట్‌కు నోట్ పంపింది. కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ ఏర్పడి ఈ నోట్‌ను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతామని ఆయన తెలిపారు. అక్కడ నుంచి రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం తెలుసుకునేందుకు బిల్లు ముసాయిదాను పంపుతారని, అసెంబ్లీ తీర్మానం ఎలా ఉన్నా రాష్ట్ర ఆవిర్భావం జరుగుతుందని వివరించారు.

ఐదు నెలల్లో తెలంగాణ ఏర్పాటు: షిండే
అయితే రాష్ట్ర ప్రక్రియ పూర్తి కావడానికి ఐదారునెలల సమయం పట్ట వచ్చని ఆయన తెలిపారు. వాస్తవానికి ఎనిమిది నెలల సమయం పడుతుందని కానీ తెలంగాణ విషయంలో ఐదు నెలల్లో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. అయితే ఈ పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టే వీలుకాకపోవచ్చని సూచనప్రాయంగా తెలిపారు.

తెలంగాణ పాత డిమాండ్: షిండే
తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఇప్పటిది కాదని, ఇది చాలా పూరతనమైన డిమాండ్ అని షిండే అన్నారు. సౌరాష్ట్ర గుజరాత్, మహారాష్ట్రలుగా విడిపోయే కంటే ముందే తెలంగాణ డిమాండ్ ఉందని ఆయన వివరించారు. దేశంలో విదర్బ కాకుండా చాలా చోట్ల నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు వస్తున్నాయని ఆయన అన్నారు. అయితే విదర్బ కంటే ముందే తెలంగాణ అంశం పెండింగ్‌లో ఉందని తెలిపారు. చాలా ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పెండింగ్‌లో ఉన్నందున నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని: షిండే
హైదరాబాద్‌ను సీమాంధ్ర, తెలంగాణ రెండు ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా చేయాలని సీమాంధ్ర ప్రాంత నేతలు డిమాండ్ చేస్తున్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా షిండే తీవ్రంగా స్పందించారు. సీడబ్ల్యూసీలో తీర్మానం చేసినట్టు పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తెలిపారు.

అన్ని డిమాండ్లను పరిశీలిస్తున్నాం: షిండే
దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం వస్తున్న అన్ని డిమాండ్లను కేంద్రం పరిశీలిస్తుందని షిండే తెలిపారు. కొత్త రాష్ట్రాల కోసం డిమాండ్ చేసేవారు వారి ఆందోళనలను ప్రజాస్వామ్యయుతంగా చేయాలని ఆయన కోరారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో తమ ముందుకు వచ్చే ప్రతి ప్రతిపాదనను పరిశీలిస్తామని అన్నారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.