తెలంగాణ పై ఉన్నది ఒకటే బిల్లు- జైరాం రమేష్

ఢిల్లీ, జనవరి 27 :ఒరిజినల్ బిల్లా? అదేమిటి? డూప్లికేట్ కరెన్సీ ఉన్నట్లు డూప్లికేట్ బిల్లులు ఉంటాయా? ఇదీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి లేవనెత్తిన వివాదంపై తెలంగాణ బిల్లు తయారీలో కీలకపాత్ర పోషించిన జీవోఎం సభ్యుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జైరాం రమేశ్ వ్యక్తం చేసిన సందేహం! అసెంబ్లీకి అసలు బిల్లు రాలేదంటూ సీఎం లేవనెత్తిన అభ్యంతరాలను కొట్టిపారేసిన జైరాం.. కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లును మాత్రమే రాష్ట్రపతి అసెంబ్లీకి పంపినట్లు స్పష్టం చేశారు. దాన్ని వక్రీకరించి అది అసలు బిల్లు కాదనడం సరికాదన్నారు. డ్రాఫ్టు బిల్లు ఒరిజినల్ బిల్లు అంటూ ఏమీ ఉండవని తేల్చి చెప్పారు.

okateyjairamఆయన సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో.. అసలు ఈ చర్చేంటో నాకు అర్థం కావటంలేదు. బిల్లుపై వింతవాదనలు చేయడం సరికాదు. బిల్లు అంటే బిల్లే. ఒరిజినల్, డూప్లికేట్ అంటూ కరెన్సీలో ఉంటుందని విన్నాను. కానీ బిల్లులో ఒరిజినల్, డూప్లికేట్ అంటూ ఉంటాయని నాకు తెలియదు అన్నారు. జీవోఎం తయారుచేసిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అదే బిల్లును రాష్ట్రపతికి పంపాం. అదే బిల్లును రాష్ట్రపతి అసెంబ్లీకి పంపారు. దాన్ని దాచిపెట్టుకుని వేరే బిల్లును పంపలేదు అని స్పష్టం చేశారు. తమకు అందిన సమాచారం మొత్తం అందులో పొందుపరిచినట్లు చెప్పారు. బిల్లుపై చర్చకు రాష్ట్రపతి తొలుత 42 రోజులు, తర్వాత మరో ఏడు రోజులు సమయం ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో జనవరి 30 వరకు మాత్రమే బిల్లు అసెంబ్లీ ఆస్తిగా ఉంటుందని జైరాం చెప్పారు. ఆ తర్వాత అసెంబ్లీ జోక్యం ఉండదని అన్నారు. దాని ఆమోదంతో సంబంధం లేకుండా రాష్ర్టాలను ఏర్పాటుచేసే హక్కు కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీ అభిప్రాయంతో తిరిగి వచ్చిన బిల్లును కేబినెట్ పరిశీలిస్తుందని, అవసరమైన మార్పులు, చేర్పులతో సవరించి పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుందని తెలిపారు. అనంతరం పార్లమెంటు చర్చించి ఇంకా ఏవైనా సవరణలు చేపట్టాలనుకుంటే చేసి, బిల్లును చట్టంగా మారుస్తుందని వివరించారు.

30 తర్వాత మరోసారి జీవోఎం భేటీ: బిల్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి 30న తిరిగి వచ్చిన తర్వాత మరోసారి జీవోఎం సమావేశమవుతుందని జైరాం చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే జీవోఎం సభ్యులు సుశీల్‌కుమార్‌షిండే, గులాం నబీ ఆజాద్ తదితరులతో సంప్రదించినట్లు తెలిపారు. అసెంబ్లీకి ఉన్న అభ్యంతరాలను, సభ్యుల సూచనలు, సవరణలను జీవోఎం పరిగణనలోకి తీసుకుంటుంది. సవరణలేమయినా ఉంటే అందరం కలిసి నిర్ణయిస్తాం. ఈ విషయం ఇప్పటికే పలువురు పెద్దలు స్పష్టం చేశారు కూడా. ఇదే విషయాన్ని ప్రధాని సీమాంధ్ర నేతలకు కూడా చెప్పారు. నేను మంత్రిగా ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లులో చర్చ అనంతరం 154 సవరణలను చేశాం అని చెప్పారు. రానున్న పార్లమెంటులో సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఆలోచిస్తున్న మాట వాస్తవమేనన్నారు. పార్లమెంటులో బిల్లు పాసవుతుందా? లేదా? అనే విషయం తనకు ఎట్లా తెలుస్తుందని విలేకరులను ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాల పొడిగింపుపై తనకు తెలియదన్నారు.

బిల్లుపై దుష్ప్రచారం తగదు: బిల్లు తప్పుల తడక అంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు.గతంలో కూడా తెలంగాణ అనే పదానికి బదులు తమిళనాడు అని ఉందనే తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుపై అసెంబ్లీకి అభ్యంతరాలుంటే ఉండవచ్చుగానీ అందులో తప్పులున్నాయనడం సరికాదన్నారు. సీమాంధ్ర విలేకరులు పదే పదే సీఎం అభ్యంతరాలను ఉటంకిస్తూ జైరాంరమేశ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ సందర్భంగా ఆయన కాస్త అసహనం వ్యక్తం చేశారు. తాను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అంత గొప్ప పరిపాలకుడిని కాదని, ఆయనంత న్యాయ, రాజ్యాంగ కోవిదుడినికాదని ఎద్దేవా చేశారు. గత కొద్దిరోజులుగా ప్రతి ఒక్కరూ బిల్లుపై చర్చిస్తూ, లేనిపోని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణపై ప్రశ్నించి, ప్రశ్నించి ప్రతి ఒక్కరూ నిష్ణాతులైపోయారు.. ఏం చేస్తాం అంటూ విలేకరులపైనా ఛలోక్తి విసిరారు. సీఎం ఏం మాట్లాడుతున్నారో తనకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ సలహాలు, సూచనలతో జీవోఎం కసరత్తు చేసిందన్నారు. కేంద్ర కేబినెట్ రాష్ట్ర విభజన బిల్లు-2013 ముసాయిదాను తయారు చేసిందన్నారు. ఆ తర్వాతనే రాష్ట్రపతి పరిశీలించి అసెంబ్లీకి పంపారని తెలిపారు. బిల్లుపై అసెంబ్లీలో ప్రతి ఒక్క సభ్యుడూ తన అభ్యంతరాలను తెలియజేయవచ్చన్నారు. అసెంబ్లీ సభ్యులకు అభ్యంతరాలుంటే ఉండవచ్చని, వాటిని తమ అభిప్రాయాలుగా మాత్రమే చెప్పాలని, అంతేగానీ బిల్లులో తప్పులున్నాయనడం సరికాదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

రాజ్యాంగం ప్రకారమే..: తాము రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపించడంపైనా జైరాం మండిపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే మేం బిల్లును తయారు చేశాం. నేను సీఎం అంత రాజ్యాంగ నిపుణుడిని కాకపోయినా ఇంగ్లీషు చదవడంలో నాకున్న అవగాహన మేరకు.. ఆర్టికల్ 3 ప్రకారం బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయమే తెలియజేయాలి అని స్పష్టం చేశారు. ఒకవేళ బిల్లును అసెంబ్లీ తిరస్కరిస్తే ఏమవుతుందని విలేకరులు ప్రశ్నించగా.. రాష్ట్రాల పునర్విభజన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 ప్రకారం జరుగుతుందని, దాని ప్రకారం రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం మాత్రమే అవసరమని, ఏకాభిప్రాయం (కన్సెంట్) అవసరం లేదని పునరుద్ఘాటించారు. అయితే ఈ విషయాన్ని దిగ్విజయ్ సింగ్ తదితరులను అడిగితే మేలన్నారు. వేరే రాష్ట్ర విభజన అయితే ఇలానే చేసేవారా? అన్న విలేకరుల ఎకసెక్కాలను ఆయన తిప్పికొట్టారు.

ఏ రాష్ట్ర విభజన అయినా ఆర్టికల్ 3 ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు. బిల్లు తయారీలో తాము రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 3 ప్రకారమే అంతా చేస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు మూడు ఉన్నాయని వివరించారు. 1959 బాబూరావు పరాటే తదితర కేసులను ఆయన ఉదహరించారు. బిల్లుపై జీవోఎం స్థాయిలో, కేంద్ర కేబినెట్ స్థాయిలో, ఆ తరువాత పార్లమెంటులో.. మొత్తంగా మూడు దశల్లో చర్చ జరిగే అవకాశాలున్నాయని అన్నారు. ఫైనాన్షియల్ మెమోరాండం తదితర వివరాలతో బిల్లు పూర్తి స్థాయిలో లేనందున దానిని తప్పులతడక అనటం సరికాదన్నారు. అవన్నీ ఎందుకు లేవని ప్రశ్నించే హక్కు సభ్యులకుంటుంది. సభ్యుల అభిప్రాయాలను కేబినెట్ పరిశీలిస్తుంది. అంతేకానీ బిల్లులో తప్పులున్నాయని అనటం పద్ధతి కాదు అని జైరాం చెప్పారు. బిల్లులో తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు ప్యాకేజీలను కూడా పొందుపరిచామని గుర్తు చేశారు. దాదాపు అన్ని అంశాలను రూపొందించామన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.