తెలంగాణ పదం ఉంటేనే ..బోనం దించేస్తావా ?

trsvsuman– ముమ్మాటికీ తెలంగాణను అవమానించినట్లే..
– చంద్రబాబుపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి ఫైర్
– చంద్రబాబు.. పక్కా ఆంధ్రాబాబు
– ఎర్రబెల్లి.. ఒళ్లు దగ్గరపెట్టుకో: బాల్క సుమన్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కపట ప్రేమ తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ పదం ఉన్నందుకే ఎత్తుకున్న బోనాన్ని బాబు దించేసి.. జై తెలుగుదేశం ఉన్న బోనాన్ని ఎత్తుకోవడమంటే తెలంగాణను అవమానిండమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా బాబు సంస్కృతి అని జూపల్లి ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘నమస్తే తెలంగాణ’ దినప్రతికలో వచ్చిన వార్తా-ఫొటో కథనాన్ని చూపించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ టీడీపీ నాయకులు ఆంధ్ర పార్టీలకు అతుక్కుపోయిన బల్లులు అని విమర్శించారు. తెలంగాణలో టీడీపీ ఇప్పటికే సమాధి అయిందని.. వచ్చే ఎన్నికల నాటికి ఉన్న ఆ కాసింత ప్రాణాలు కూడా పోతాయన్నారు. టీడీపీ నాయకుల పరిస్థితి లఫూట్‌గాళ్ల వ్యవహారంగా ఉందని అన్నారు. అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలు స్పష్టతనివ్వలేదని విమర్శించారు. ఆ మూడు పార్టీలకు తెలంగాణలో ఉరి వేయడం ఖాయమని హెచ్చరించారు. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా రాని టీడీపీకి, రానున్న ఎన్నికల్లోనూ ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎదురవుతుందన్నారు. టీడీపీ రాసిన లేఖలో ఎక్కడా తెలంగాణ ఇవ్వాలన్న పదమే లేదని మండిపడ్డారు.

జై తెలంగాణ అనిపించండి..
తెలంగాణ ఇవ్వాలని కేంద్రానికి చంద్రబాబుతో చెప్పిస్తే ఎన్టీఆర్ భవన్‌ను చీపురుతో ఊడుస్తానని జూపల్లి కృష్ణారావు తెలంగాణ టీడీపీ నాయకులకు సవాల్ విసిరారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు. టీ టీడీపీ నాయకులు ఎర్రబెల్లి, కడియం, రేవూరి, మోత్కుపల్లి, వరంగల్ జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబుతో వరంగల్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయించి.. కనీసం జై తెలంగాణ అని చెప్పించాలని డిమాండ్ చేశారు. బాబుకు ఊడిగం చేయడం మానుకోవాలని, తెలంగాణ పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. అమరుల ప్రాణాల కన్నా పాదయాత్ర ముఖ్యం కాదని, అఖిల పక్షానికి బాబు ఎందుకు వెళ్లలేదో జవాబు ఇవ్వాలని జూపల్లి డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్, తెలంగాణ భవన్ కార్యదర్శి ప్రొఫెసర్ మాదిడ్డి శ్రీనివాస్‌డ్డి పాల్గొన్నారు.

చంద్రబాబు.. పక్కా ఆంధ్రాబాబు: బాల్క సుమన్
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, టీడీపీ టీ ఫోరం నాయకుడు ఎర్రబెల్లిలపై టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదన్న బాబు.. ఈ మేరకు దీక్ష, ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ఇచ్చిన లేఖలో ఎక్కడ కూడా తెలంగాణ పదం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను బాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే కనీసం జై తెలంగాణ అని నినాదం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులైన టీఆర్‌ఎస్ నాయకులపై నోరు పారేసుకుంటే ఎర్రబెల్లి దయాకర్‌ను కాకతీయ కమాన్ వద్ద కేయూ, ఓయూ విద్యార్థులు ఉరి వేస్తారని హెచ్చరించారు. ఎర్రబెల్లి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. తెలంగాణ పదం ఉన్నందుకే బోనాన్ని దించేసిన బాబు.. పక్కా ఆంధ్రా బాబు అని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని బాల్క సుమన్ స్పష్టం చేశారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.