తెలంగాణ తొలి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్

 శాసనమండలి చైర్మన్‌గా కే స్వామిగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనితో శాసనమండలిలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఆధిక్యత ప్రస్ఫుటమయింది. బడుగు, బలహీనవర్గాలకు, ఆదివాసీలకు, మైనారిటీలకు అండదండలందిస్తుందని చెప్పిన మాట ప్రకారం వెనుకబడిన వర్గాలకు చెందిన స్వామిగౌడ్‌ను శాసనమండలి చైర్మన్‌గా ఎన్నుకొని టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటలకు యథార్థ రూపమిస్తున్నదని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి టీ హరీశ్‌రావు, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ స్పష్టంచేశారు. బుధవారం శాసనమండలి సభ్యుల గందరగోళం మధ్య చైర్మన్ స్థానంలోని డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ శాసనమండలి చైర్మన్ పదవికి ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. ఈ ఎన్నిక కోసమే సభను ప్రత్యేకంగా సమావేశపరిచారు. బ్యాలెట్ పద్ధతిలో 11 గంటల 50 నిమిషాలకు ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. 

goud12 గంటల 20 నిమిషాలకు ముగిసింది. కౌంటింగ్ 12.21కి ప్రారంభించగా పది నిమిషాల్లో పూర్తయ్యింది. మొత్తం 21మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. వారందరూ స్వామిగౌడ్‌కే ఓటు వేశారు. చైర్మన్ స్థానంలోని నేతి విద్యాసాగర్ కూడా స్వామిగౌడ్‌కే ఓటు వేసినట్లు స్పష్టమయ్యింది. ఎన్నికల ప్రక్రియ ముగియగానే స్వామిగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు విద్యాసాగర్ ప్రకటించారు. ఉదయం సభ ప్రారంభమైన సమయంలో 34 మంది సభ్యులు హాజరయ్యారు. ఎన్నికల ప్రక్రియలో మాత్రం 21 మంది మాత్రమే పాల్గొన్నారు. స్వామిగౌడ్‌తో పోటీపడిన కాంగ్రెస్ అభ్యర్థి ఫారూఖ్‌కు ఒక్క ఓటు కూడా పడలేదు. కాగా కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 13 మంది శాసనమండలి సభ్యులు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. టీఆర్‌ఎస్ సభ్యులతోపాటు ఎంఐఎం, పీడీఎఫ్‌లకు చెందిన సభ్యులు కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థికే ఓటు వేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూమంత్రి అయిన మహమూద్ అలీ తొలి ఓటును ఉపయోగించుకున్నారు.

అంతకుముందు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ చైర్మన్ పదవికోసం జరుగుతున్న ఎన్నిక అనైతికమని, అప్రజాస్వామికమని చేసిన వాదనలన్నింటినీ మంత్రి హరీశ్‌రావు తిప్పికొట్టారు. మండలి సభ్యుల అనర్హత కేసును గవర్నర్ పరిశీలిస్తున్న సందర్భంలో ఎన్నికలు నిర్వహించడం అప్రజాస్వామికమని ప్రతిపక్ష నేత వాదించారు. ఇందుకు హరీశ్‌రావు సమాధానం చెప్తూ 1980 జూలై 30న ఆనాటి రాజ్యసభ చైర్మన్ హిదాయతుల్లా అనుసరించిన విధానాన్నే తాము అనుసరిస్తున్నామని చెప్పారు. ఎన్నికలు అప్రజాస్వామికమని వాదిస్తూ ఏ విధంగా పాల్గొంటున్నారని ప్రశ్నించారు. ఈ గందరగోళం మధ్యనే తమ అభ్యర్థి ఫారూఖ్‌ను పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నామని ప్రతిపక్ష నేత ప్రకటించారు. అయితే అప్పటికే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఉపసంహరణ మాట వర్తించదని చైర్మన్ స్థానంలోని విద్యాసాగర్ పేర్కొన్నారు. దీంతో స్వామిగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయినట్లయింది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.