తెలంగాణ తొలి ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ

సీనియర్ పాత్రికేయులు, నమస్తే తెలంగాణ వ్యవస్థాపక ఎడిటర్, టీజేఎఫ్‌  అధ్యక్షుడు అల్లం నారాయణ తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్‌గా నియమితులు కానున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అల్లం.. జర్నలిస్టులను ఉద్యమంలో భాగస్వాముల్ని చేసి, తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో వారిని సంఘటితం చేశారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) స్థాపించి, ఉద్యమంలో సంపాదకుల నుంచి క్షేత్రస్థాయి జర్నలిస్టుల వరకు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక టీజేఎఫ్‌ను తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే)గా మార్చారు. తెలంగాణకు అనుకూలంగా రాజకీయశక్తులను సమన్వయపరచడం, సంఘటితం చేయడంతోపాటు వారితో అనేక సమావేశాలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన సమయంలో మాక్ అసెంబ్లీ నిర్వహించి, తెలంగాణ ఆవశ్యకతను, డిమాండ్‌ను తెలియజేశారు. వివిధ పక్షాల నేతలను ఒప్పించి, అందరూ ఒకే మాటపై నిలబడేందుకు కృషి చేశారు. ప్రాణహిత శీర్షిక ద్వారా అనేక వందల వ్యాసాలు రాసిన అల్లం.. తెలంగాణ ఆర్తిని, గోసను హద్యంగా అక్షరీకరించారు.

తెలంగాణ కోసం ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అల్లం నారాయణను తెలంగాణ తొలి ప్రెస్ అకాడమి చైర్మన్‌గా ఎంపిక చేశారు. ప్రభుత్వ నిర్ణయంపట్ల తెలంగాణవాదులు, తెలంగాణ జర్నలిస్టులు, మేధావులు హర్షం వ్యక్తంచేశారు. పోరు తెలంగాణ తరఫున అల్లం సార్‌కు శుభాకాంక్షలు. కంగ్రాట్స్‌ సార్..

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.