తెలంగాణ తేల్చరేమి..నాన్చుడు నష్టమే

– చౌరస్తాలో టీ కాంగ్రెస్48 రోజులు ముగిసినా కదలని ప్రక్రియ
– తెలంగాణవాదుల్లో అనుమానాలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ణయం ప్రకటించి 48 రోజులు ముగిసినప్పటికీ ఇంకా దీనిపై ప్రభుత్వపరంగా స్పష్టత రాకపోవడంపై తెలంగాణ ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. యూపీఏ భాగస్వామ్య పక్షాలు ఆమోదముద్ర వేసిన తర్వాత కూడా ఈ అంశాన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తేవటంలో తీవ్ర తాత్సారం జరుగుతున్నది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో వచ్చిన సానుకూలత క్రమేపీ తగ్గుతున్నది. అదే స్థానంలో వ్యతిరేకత క్రమక్రమంగా పెరిగే అవకాశం కనిపిస్తున్నది. అదే జరిగితే రాజకీయంగా కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న ఆలస్యంపై గాంభీర్యం ప్రదర్శిస్తున్న టీ కాంగ్రెస్ నేతలు.. ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ జెండా ఎగరేయాలని వారం రోజుల కార్యక్రమం పెట్టుకున్నా.. క్షేత్రస్థాయిలో వారు తీవ్ర నిరసన ఎదుర్కొనక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

HGlassఇకనైనా తెలంగాణ ప్రక్రియ వేగం పుంజుకోని పక్షంలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుందని పలువురు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే జరుగుతున్న జాప్యంపై తెలంగాణ ప్రజల్లో అసహనం పెరుగుతున్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. ఈ అసహనంతో ఇప్పటికే పలువురు తెలంగాణ యువకులు కలతపడి.. ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడే తరుణంలో ఈ బలవన్మరణాలను నివారించేందుకు, తెలంగాణ ఏర్పాటు విషయంలో ప్రజలకు నమ్మకం కల్పించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇటీవలి కాలంలో ఆహార భద్రత, భూములకు సంబంధించిన రెండు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం పట్టుపట్టి ఆమోదింపజేసిన పద్దతుల్లోనే తెలంగాణ విషయంలోనూ చొరవచూపితే మంచిదని పలువురు టీ కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్‌కు రాష్ట్రంలోని ఉభయ ప్రాంతాల్లోనూ నష్టం కలుగుతుందని స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం(సీడబ్ల్యూసీ) జూలై 30న తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సమావేశానికి ముందు యూపీఏ భాగస్వామ్య పక్షాలు కూడా భే జరిపాయి. గత ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, డిమాండ్, ఆవశ్యకతను గుర్తిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పచ్చజెండా ఊపాయి. యూపీఏ, సీడబ్ల్యూసీలు ఎంతో హడావిడి చేసి రాష్ట్ర విభజన ప్రకటన చేసినప్పటికీ, అంతే స్పీడుతో కేబినెట్ నోట్ రూపొందించి, కార్యాచరణ ప్రకటించి ఉంటే బాగుండేదని టీ వాదులు అభిప్రాయపడుతున్నారు.

విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత కమిటీ అయిన సీడబ్ల్యూసీలో జరిగిన నిర్ణయానికి సంబంధించిన అంశంపై కేబినెట్ నోట్ తయారు కావడంలో ఆలస్యం జరగడంలో ఔచిత్యం లేదని కాంగ్రెస్‌లో కొందరు అభిప్రాయపడుతున్నారు. కేబినెట్ నోట్ ఇంకా రూపుదిద్దుకోక పోయినా, తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైపోయినట్లు భావిస్తూ పార్టీ అధినేత్రి సోనియాకు కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమాలు చేపట్టడంపైనే దృష్టి సారిస్తున్నారే తప్ప కేబినెట్ నోట్ త్వరగా రూపుదిద్దుకుని రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సాధ్యమైనంత తొందరగా పూర్తయ్యేలా అధిష్ఠానంపై ఒత్తిడిపెంచే కార్యక్రమాలు చేపట్టడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఈ విషయంలో టీ కాంగ్రెస్‌లోనే తీవ్ర అభ్యంతరాలు వెలువడుతుండటం విశేషం. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చినా కూడా యువత ఆత్మహత్యలను అరికట్టడంపై దృష్టి సారించడం లేదని కొందరు బహిరంగంగానే టీ నేతల తీరుపై ధ్వజమెత్తుతున్నారు.

2009 డిసెంబర్ 9న వచ్చిన తెలంగాణ ప్రకటనను అడ్డుకున్న తరహాలోనే ఈసారి కూడా రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకుంటామంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, పెట్టుబడిదారులు చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలు టీ వాదులకు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్ర విభజనకు సంబంధించిన ఆంశాలు, కేబినెట్ నోట్ వంటి వాటిపై గత 10 రోజుల నుంచి జాతీయ నేతలు ఎవరూ నోరు మెదపడం లేదు. అంతకు ముందు పదే పదే మీడియా ముందుకు వచ్చి, తెలంగాణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన నేతలు ఇప్పుడు మౌనం వహిస్తుండడం వెనుక మతలబులపై టీ వాదులు చర్చించుకుంటున్నారు. కేబినెట్ నోట్ తయారీలో జాప్యానికి కొందరు చూపిస్తున్న కారణాలు ఔచిత్యంగా లేవని అంటున్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వైద్యంకోసం అమెరికా వెళ్ళడం, కేంద్రహోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే, రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని స్వల్ప అనారోగ్యానికి గురికావడం అనేవి నోట్ తయారీలో జరుగుతున్న జాప్యానికి సహేతుక కారణాలు కావని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

విభజన సందర్భంగా ఇరు ప్రాంతాల వారు తమ సమస్యలు, డిమాండ్లు వినిపించుకునేందుకు ఆంటోనీ కమిటీ వేశారు. ఆంటోని కమిటీ రిపోర్టు కోసమే కేబినెట్ నోట్ తయారీలో జాప్యం జరుగుతుందనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే గత నెలలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండడంతో ఆంటోనీ కమిటీ రాష్ట్ర పర్యటనకు వీలు పడదని, ఎవరైనా ఏదైనా చెప్పుకోవాల్సి ఉంటే ఢిల్లీ వచ్చి ఆంటోనీ కమిటీకి విన్నవించుకోవాలని అప్పట్లో పార్టీ పెద్దలు సూచించారు. దీంతో అన్ని వర్గాల వారు హస్తినకు వెళ్ళి ఆంటోనీ కమిటీని కలిసి తమ వాదనలు వినిపించారు.

సమస్యలు చెప్పుకున్నారు. నివేదికలు అందజేశారు. కనుక ఆంటోనీ కమిటీ తనకు అందిన ఇరు ప్రాంతాల వారి నివేదికలను వెను కేంద్ర ప్రభుత్వానికి వెంటనే అందజేసేందుకు వీలుందని అంటున్నారు. అయితే రాష్ట్ర విభజన ప్రక్రియను సాగదీయడానికే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆంటోనీ కమిటీ మళ్ళీ రాష్ట్రంలో పర్యటించాలని డిమాండ్ తీసుకొస్తున్నారని టీ వాదులు మండిపడుతున్నారు. సాధ్యమైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్‌ను తయారు చేసి తెలంగాణవాదుల్లో విశ్వాసం, నమ్మకం కల్పించే ప్రయత్నం చేయాలని, లేకుంటే కాంగ్రెస్ ఆలస్యానికి మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుందని వారు పేర్కొన్నార

This entry was posted in TELANGANA NEWS.

One Response to తెలంగాణ తేల్చరేమి..నాన్చుడు నష్టమే

  1. viswanadh says:

    Jai Telangana