తెలంగాణ తల్లిది గర్భశోకం

group22
– ఇది ప్రారంభం మాత్రమే.. మరింత అండగా ఉంటాం

హైదరాబాద్, మార్చి 28 (టీ మీడియా): కేంద్ర, రాష్ట్ర పాలకుల బాధ్యతా రాహిత్య ప్రకటనలతో అసంతృప్తికి, అసహనానికి, ఆక్రోశానికి గురై తెలంగాణ యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రపంచంలో ఏ ప్రజాస్వామిక ఉద్యమం అనుభవించని గర్భశోకాన్ని తెలంగాణ ఉద్యమం అనుభవిస్తున్నదని, వేయిమంది యువకుల ఆత్మబలిదానాలతో తెలంగాణ తల్లి తల్లడిల్లుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే యువకుల హృదయాల్లో రగులుతున్న మంటలు చల్లారుతాయన్నారు. తెలంగాణ అమరులు ప్రజల దుఃఖాన్ని తమ దుఃఖంగా అనుభవించారని, ప్రతి మరణ వాంగ్మూలం తెలంగాణ గోసకు ప్రతిబింబమని ఆయన తెలిపారు. దురదృష్టవశాత్తు తెలంగాణ యువకులు ఆత్మహత్యలను నిరసన మార్గంగా ఎంచుకుంటున్నారని, ప్రపంచంలో ఏ ప్రజాస్వామిక ఉద్యమం లో కూడా ఇంతటి పరిస్థితి ఏర్పడలేదన్నారు. గురువారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘నమస్తే తెలంగాణ వెల్పేర్ అండ్ రిలీఫ్ సొసైటీ ’ సారథ్యంలో తెలంగాణ అమరవీరు ల కుటుంబాలకు సహాయనిధి పంపిణీ కార్యక్షికమం జరిగింది. కార్యక్షికమంలో కోదండరాం ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.

అమరుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ‘నమస్తే తెలంగాణ’ దినపవూతిక చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమన్నారు. పత్రిక సీఎండీ సీఎల్ రాజం కృషి స్ఫూర్తిదాయకమని ఆయన అభినందించారు. తెలంగాణ ప్రజల కష్టాలను వినడానికి, పంచుకోవడానికి, కలిసి నడవడానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షను అక్షరాలుగా మలిచి ప్రపం చం ముందు చాటి చెప్పడానికి ‘నమస్తే తెలంగాణ’ ఒక అక్షర వేదికగా రూపుదిద్దుకున్నదని కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల అస్థిత్వ ఉద్యమ చిరునామాగా ఈ పత్రిక ఎదిగిందన్నారు. తెలంగాణ అమరుల కుటుంబాలవారు పూటకు కూడా గడవని నిరుపేదలేనని, వారికి అండదండలందించడం తెలంగాణ సమాజం బాధ్యత అని పిలుపునిచ్చారు. ‘నమస్తే తెలంగాణ వెల్ఫేర్ అండ్ రిలీఫ్ సొసైటీ’ వేదికను దాతలు ఉపయోగించుకోవాలని, విరాళాలు పంపించాలని, నిరుపేద కుటుంబాలకు అండగా నిలువాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో అందరం భాగస్వాములం కావడం, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడం ద్వారానే అమరుల ఆత్మలు శాంతిస్తాయన్నారు.

ఇది ప్రారంభం మాత్రమే
– నమస్తే తెలంగాణ సీఎండీ సీఎల్ రాజం
తెలంగాణ అమరుల కుటుంబాల దుఃఖాన్ని మాన్పలేనప్పటికీ ఇతోధికంగా సాయం అందించాలనే ప్రయత్నంతో ‘నమస్తే తెలంగాణ వెల్ఫేర్ అండ్ రిలీఫ్ సొసైటీ’ని ఏర్పరిచామని, తమ ప్రయత్నానికి తెలగాణ సమాజం అపూర్వంగా స్పందిస్తున్నదని ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ సీఎల్ రాజం అన్నారు. తెలంగాణ కోసం ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చితీరుతుందని, ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. తెలంగాణకు ఏ అన్యాయం జరిగినా ప్రపంచం ముందు ఆవిష్కరించేందుకు ‘నమస్తే తెలంగాణ’ దినపవూతిక సిద్ధంగా ఉన్నదని, తెలంగాణ ప్రజల కష్టాలను, కన్నీళ్లను, యధార్థగాథలను చాటి చెప్పేందుకు ఈ వేదికను వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు చేతనైనంత సాయం అందించడం బాధ్యతగా స్వీకరించామని, ఈ సాయం చాలా చిన్న సాయమేనని ఆయన వినవూమంగా ప్రకటించారు. అమరుల కుటుంబాలకు చేతనైనంత సాయం అందిస్తామని, తెలంగాణ అభిమానులు ఇచ్చే విరాళాలతో దీనిని ఇంకా కొనసాగిస్తామని, ప్రతి వితరణను స్వీకరిస్తున్నామని, ప్రతి పైసాను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇది ప్రారంభం మాత్రమేనని, అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నిస్తామని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు చేయూతనిస్తామని ఆయన ప్రకటించారు.

అమరుల ఆశయం మహోన్నతమైనది
– నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ
వస్తున్నదనుకున్న తెలంగాణ వెనుకకు పోయినప్పుడల్లా తెలంగాణ యువకులు తట్టుకోలేకపోతున్నారని, వారు ఆవేదనపడి.. భంగపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ అల్లం నారాయణ అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ యువకుల మరణాలు భంగపడ్డ తెలంగాణ కన్నీళ్ల ఘోషలేనని పేర్కొన్నారు. పార్లమెంటు సాక్షిగా యాదగిరిడ్డి ఆత్మహత్య చేసుకున్నా గుడ్డి, చెవిటి పాలకులకు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రతిధ్వనులు వినిపించలేదన్నారు.

తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ఏ కుటుంబం కూడా సంపన్నమైనది కాదని, అయితే వారి ఆశయం చాలా సంపన్నమైదని, మహోన్నతమైనదని ఆయన అభివర్ణించారు. రాయపాటి, లగడపాటి, టీజీ వెంక చంద్రబాబు, కిరణ్‌కుమార్‌డ్డి వంటి నాయకుల మాటలు తెలంగాణ యువకుల్లో అసహనాన్ని పెంపొందిస్తున్నాయన్నారు. తెలంగాణ యువకుల బలిదానాలకు తెలంగాణ పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తున్న రాజకీయ పార్టీలన్నీ కారణమేనని పేర్కొన్నారు. ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకు పోరు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మొద్దుబారిన రాజకీయ నేతలు స్పందిచనప్పటికీ,ఆధిపత్య దురహంకారంతో సీమాంధ్ర పెత్తందార్ల మీడియా మాట్లాడనప్పటికీ.. ‘నమస్తే తెలంగాణ’ దినపవూతిక ఇక్కడి ప్రజల పక్షాన నిలిచి కలబడుతున్నదన్నారు. అమరుల త్యాగాల వివరాలు, చిరునామాలతో ఒక పుస్తకాన్ని తీసుకవస్తామని, ఢిల్లీ వేదికపై ఆవిష్కరిస్తామని ప్రకటించారు. తెలంగాణ అమరుల కుటుంబాల కోసం స్పందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ అమరుల కుటుంబాలకు అండగా ఉందాం
– నమస్తే తెలంగాణ డైరెక్టర్ సీ విజయరాజం
పువ్వులుగా వికసించి పరిమళించాల్సిన యువత తెలంగాణ కోసం మొగ్గలోనే రాలిపోవడం తమను కలచివేస్తున్నదని, కదిలించిందని నమస్తే తెలంగాణ డైరక్టర్ విజయరాజం అన్నారు. కొడుకులు కోల్పోయిన తల్లుల దుఃఖం తెలంగాణను బాధాతప్తం చేస్తున్నదని ఆవేదన వెలిబు చ్చారు. ఒక సమిష్టి ఆశయంతో మరణించిన వేయిమంది కుటుంబాల దుఃఖాన్ని ఓదార్చే ధైర్యం ఎవరికీ సరిపోదని అన్నారు. అందరి ఆవేదనను ఓదార్చడం, తీర్చడం సాధ్యం కానప్పటికీ, ఉడతా భక్తితో సాయం అందించడం కొద్దిలో కొద్దిగా సంతృప్తిని ఇస్తున్నదని ఆమె తెలిపారు. బాధిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అందరం సాయం అందజేద్దామని విజ్ఞప్తిచేశారు. తెలంగాణ ప్రజల కష్టాల పక్షాన ‘నమస్తే తెలంగాణ’ దినపవూతిక నిలిచి ఉంటుందన్నారు. మనందరి కోసం ప్రాణత్యాగం చేసిన అమరులను ప్రతిక్షణం తలచుకోవడం మనందరి కర్తవ్యమని పిలుపునిచ్చారు.

ఈ దుఃఖం తీర్చలేనిది
– అంద్శై
ఇంతమంది మరణించినా పాలకులకు చీమకుట్టినట్లు కూడా లేదని, ఈ దుఃఖం తీర్చలేనిదని కవి, గాయకుడు అంద్శై అన్నారు. ఇదే దుఃఖం కాంగ్రెస్ పాలకులవైపు తిరిగితే, ఆ ఆవేశాన్ని నిలువరించడం జేజమ్మల తరం కాదని ఆయన హెచ్చరించారు. కొద్దో గొప్పో సాయంతో పేదరికం తీరనప్పటికీ, సాయం అందించేందుకు ‘నమస్తే తెలంగాణ’ ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు.

సర్కారు స్పందించడం లేదు
– శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణ ఉద్యమం లో అమరులైన కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒకరోజు వేతనాన్ని ఇచ్చేందుకు సిద్ధం గా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం సానుకూలం గా స్పందించడం లేదని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ సెక్రటరీ జనరల్ వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఉద్యోగులందరూ ఒకరోజు లేక రెండు రోజుల వేతనాన్ని వితరణగా ఇస్తే ఆ నిధి 30 కోట్ల నుంచి 35 కోట్లకు చేరుకుంటుందని ఆయన చెప్పారు. అందరం కలిసి ముఖ్యమంవూతిని కలిసి ఈ ప్రయత్నం చేసి తీరాలని అన్నారు. మన రాజకీయ నాయకుల వైఫల్యాల వల్లనే యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు.

ఆ మీడియాకు తెలంగాణ పట్టదా?
– జూలూరు గౌరీశంకర్
ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం వేయిమంది ప్రాణత్యాగాలు చేసి అమరులైనప్పటికీ ఏ ఒక్క సీమాంధ్ర పత్రిక కూడా ఎడిటోరియల్ రాయలేదని, ఈ పత్రికలన్నీ తెలంగాణ వైపు ఉన్నట్లా లేనట్లా తేల్చుకోవాలని తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ నిలదీశారు. కోస్తావూపాంతంలో ఉప్పెనలు, ఉపవూదవాలు వచ్చినప్పుడు బోలెడు కన్నీళ్లను ఖర్చు చేసే పత్రికలు నాలుగుకోట్ల తెలంగాణ సమాజం దుఃఖంతో కుంగిపోతున్నప్పుడు ఎందుకు ఎడిటోరియల్స్ రాయడం లేదని ఆయన ప్రశ్నించారు. అమరుల కుటుంబాలను ఆదుకోవాలన్న ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం సంకల్పం గొప్పదని, ప్రశంసనీయమని గౌరీశంకర్ అభినందించారు.

అన్ని రకాల సాయం అందించాలి
– ఘంటా చక్రపాణి
తెలంగాణ కోసం ఆత్మత్యాగాలు చేసిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం మాత్రమే కాకుండా అన్నీ రకాలుగా సాయం అందించాలని నమస్తే తెలంగాణ వెల్ఫేర్ రిలీఫ్ సొసైటీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సూచించారు. నమస్తే తెలంగాణ యాజమాన్యం, సంపాదకవర్గం వితరణ సమీకరణను పారదర్శకంగా పంపిణీ చేస్తున్న విధానాన్ని ఆయన కొనియాడారు. అమరుల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని, వారిని దత్తత తీసుకునే ప్రయత్నాలు చేయాలన్నారు.

ఉచితంగా వైద్యం
– డాక్టర్ నర్సయ్య
అమరుల కుటుంబాలకోసం ప్రత్యేకంగా హెల్త్‌కార్డులు ఇస్తామని, వారి కుటుంబాలకు ఉచితంగా వైద్యసదుపాయాలు కల్పిస్తామని డాట్స్ చైర్మన్ డా.నర్సయ్య హామీ ఇచ్చారు. ఇందుకు నమస్తే తెలంగాణ వెల్పేర్ సొసైటీ విధానాన్ని ఆధారం చేసుకుంటామన్నారు.
సీనియర్ సిటిజన్స్ ఫోరం నాయకులు శ్రీధరస్వామి ప్రసంగిస్తూ తెలంగాణ నాయకులు దౌర్భాగ్యం వల్లనే తెలంగాణ ఆలస్యమవుతున్నదని నిప్పులు చెరిగారు. తెలంగాణ మంత్రులు తెలంగాణ కోసం మాట్లాడటం లేదని, తమ రాజకీయ మనుగడ కోసమే తెలంగాణ ఉద్యమాన్ని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో జరిగే ప్రతి అన్యాయాన్ని నమస్తే తెలంగాణ ప్రచురిస్తున్నదని అభినందించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.