తెలంగాణ జైత్రయాత్ర

తెలంగాణ సాయధపోరాటం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు ఉద్యమంలో ప్రతి అడుగు పడిలేచిన కెరటమే. అడ్డంకులను తొలగించుకుని, ఆవరోధాల్ని అధిగమిస్తూ, కుట్రలను ఛేదిస్తూ, ఐకమత్యమే మహాబలంగా ముందుకుసాగిన తెలంగాణ తండ్లాట ఎట్టలకేలకు విజయతీరాన్ని చేరింది. అధికార దురహంకారంతో విర్రవీగిన కాకతీయు రాజలపై దండెత్తిన సమ్మక్క-సారక్క స్ఫూర్తితో నియంతత్వంతో నిర్బంధంగా పాలించిన నిజాం రాజుపై యుద్ధం చేసిన సాయుధ పోరాట వీరులు చూపిన మార్గంలో ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని మలిచిన తీరు ప్రపంచ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఘట్టం.

KCR_Old-Photo.jpgగడ్డిపోచల్లా ఉన్న తెలంగాణ ప్రజలు ఐకమత్యంతో సీమాంధ్ర మదపుటేనుగులను కట్టడి చేసి గమ్యాన్ని ముద్దాడిన తీరు ఆమోఘం..అద్వీతీయం. సబ్బండ వర్ణాలు సమరసింహాలై పోరాడటంతో తెలంగాణ తల్లి సంకెళ్లు తెంచుకుని వలసపాలన నుంచి విముక్తి పొందింది. అరవైఏళ్ల పోరాటంలో 1969 తొలిదశ ఉద్యమంలో 369మంది, మలిదశ ఉద్యమంలో 1200పై చిలుకు బలిదానాలే తల్లి తెలంగాణకు మిగిలిన చేదు అనుభవాలు. బంగారు తెలంగాణ పునర్నిర్మాణమే అమరుల ఆశయాలకు నిజమైన నివాళి.

సామాన్యుడిలో జ్వలించిన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష
ముల్కీ నిబంధనల అమలు కోసంలో 1952 సెప్టెంబర్‌లో పోలీసుల తూటాలకు బలైన నాటి నుంచే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు బీజాలు పడ్డాయి. దశాబ్దాల ఆన్యాయాలపై, అక్రమాలపై, దౌర్జన్యాలపై, , పాలకుల దుర్నీతిపై, వివక్షపై విరామమెరుగని ప్రజాస్వామిక ఉద్యమాలతో తెలంగాణ తిరగబడింది. పెద్దమనుషుల ఒప్పందాలు, ఆరుసూత్రాల పథకాలు, ముల్కీ నిబంధనలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, 371-డీ, స్థానికులకే ఉద్యోగాలు కేటాయించాలనే వచ్చిన గిర్‌గ్లానీ సిఫారసులను వలసపాలకులు దురహంకారంతో బేఖాతర్ చేయడంతో 1969లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తెరపైకి వచ్చింది.

KCR.jpg అప్పటి సీఎం కాసుబ్రహ్మానందరెడ్డి 369 మంది విద్యార్థుల ప్రాణాలను పొట్టనబెట్టుకోవడంతో తెలంగాణ సమాజం గుణపాఠం నేర్చుకుంది. గమ్యం చేరకుండానే ఉద్యమం చల్లబడింది. మళ్లీ ఒప్పందాలు బుట్టదాఖలవడం, వివక్ష కొసాగడంతో 2001 నుంచి మలిదశ ఉద్యమం కొత్త ఎత్తుగడలతో, రాజనీతితో ఉద్యమించింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రతిపల్లెలోని సామాన్యుని చెంతకు తీసుకెళ్లింది. వలస పాలకుల వివక్షను కళ్లకుగట్టింది. విభజనకు వ్యతిరేకమైన బలమైన రాజకీయ పార్టీలతో టీఆర్‌ఎస్ జతకట్టి అనుకూలమని చెప్పించింది. తెలంగాణకు మద్దతు పలకక తప్పని రాజకీయ అనివార్యతను సష్టించింది.

యుద్ధభూమిలా మలిదశ ఉద్యమం
ఏప్రిల్ 27, 2001లో జలదశ్యంలో తెలంగాణ రాష్ట్రసాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ ఫ్రీజోన్‌పై సుప్రీంకోర్టు తీర్పుకు నిరసనగా టీఎన్జీవో ఆధ్వర్యంలో అక్టోబర్ 21 2009లో సిద్దిపేటలో నిర్వహించిన ఉద్యోగ గర్జన సభలో తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీక్షకు పూనుకుంటానని కేసీఆర్ ప్రకటించారు. నవంబర్ 28, 2009 మొదలైన కేసీఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ భగ్గుమంది. సబ్బండవర్ణాల నిరసనలతో అట్టుడికింది. ఎల్‌బీనగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి కిరోసిన్ పోసుకొని తొలిబలిదానం చేసుకున్నాడు. నిజామాబాద్‌లో కానిస్టేబుల్ కిష్టయ్య జై తెలంగాణ నినాదాలు చేస్తూ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Vidyarthi.jpgపార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే బేషరతుగా మద్దతునిస్తామని డిసెంబర్ 7, 2009న అప్పటి సీఎం రోశయ్య అధ్యక్షతన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. డిసెంబర్ 9, 2009న కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించారు. మరునాడే డిసెంబర్ 10న సీమాంధ్ర ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా రాజీనామాలు చేయడంతో తెలంగాణ ప్రకటన వెనక్కిపోయింది. డిసెంబర్ 23న సంప్రదింపుల కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించడంతో మలిదశ ఉద్యమం ఊపందుకుంది. డిసెంబర్ 24న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ప్రజాసంఘాలు, ఉద్యోగుల సంఘాల సారథ్యంలో ప్రొఫెసర్ కోదండరాం చైర్మన్‌గా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీ జేఏసీ) ఏర్పడింది. జనవరి 3, 2010న ఓయూ ఆర్ట్స్‌కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థి గర్జన పాలకులను గడగడలాడించింది.

congress.jpgజనవరి 5, 2010 రాష్ట్రంలో గుర్తింపు పొందిన 8 రాజకీయ పార్టీల ప్రతినిధులతో కేంద్రం సమావేశం నిర్వహించింది. ఫిబ్రవరి 13న శ్రీకష్ణకమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు శ్రీకష్ణకమిటీని నిరసిస్తూ ఫిబ్రవరి 15న ఓయూ రణక్షేత్రమైంది. క్యాంపస్‌లో కాల్పులకు నిరసనగా 15 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు వచ్చాయి. ఫిబ్రవరి 21న అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వగా ఓయూ ఎన్‌సీసీ గేటు ఎదుట యాదయ్య అనే విద్యార్థి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మార్చి 12న జేఏసీ నుంచి టీడీపిని బహిష్కరించారు. మే 25న వరంగల్ జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు నిరసనగా జిల్లా బంద్ జరిగింది. మే 28న జగన్ రావొద్దంటూ మానుకోట యుద్ధభూమిగా మారింది. సమైక్యవాది జగన్ భువనగిరి నుంచే వెనుదిరగాల్సి వచ్చింది.

సత్తా చాటిన సకలజనుల సమ్మె
జూలై 30న ఉపఎన్నికల ఫలితాల్లో 11 స్థానాల్లో టీఆర్‌స్, ఒకచోట బీజేపీ విజయఢంకా మోగించింది. డిసెంబర్ 16న వరంగల్‌లో టీఆర్‌ఎస్ మహగర్జన సభ జరిగింది. డిసెంబర్ 31న కేంద్ర హోంమంత్రికి శ్రీకష్ణ కమిటీ నివేదికను అందచేసింది. 2011 జనవరి 6న శ్రీకష్ణ కమిటీ నివేదిక సారాంశం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టత ఇవ్వకుండా ఆరు ప్రతిపాదనలు సూచించడంతో జనవరి 18న జేఏసీ ఆధ్వర్యంలో రహదారుల దిగ్భంధనం జరిగింది. ఫిబ్రవరి 17 నుంచి తెలంగాణవ్యాప్తంగా ఉద్యోగ సంఘాల జేఏసీ సారథ్యంలో సహాయనిరాకరణ ఉద్యమం ప్రారంభమైంది. ఫిబ్రవరి 23న తెలంగాణ నినాదాలతో పార్లమెంట్ దద్దరిల్లింది. మార్చి 4న సహయనిరాకరణ ఉద్యమం విరమించారు. మార్చి 10న తెలంగాణ మరోసారి ఉద్యమ కెరటమైంది.

BJP2.jpg మిలియన్‌మార్చ్‌లో భాగంగా తెలంగాణ వైతాళికులకు ప్రాతినిథ్యం లేని ట్యాంక్‌బండ్ ఉన్న విగ్రహాలు కూలిపోయాయి. మే 19న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సారథ్యంలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. జూన్ 19న వంటవార్పు నిర్వహించారు. జూన్ 21న తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ మరణించారు. జూలై 15న సకలజనుల సమ్మెకు ఉద్యోగసంఘాలు నోటీస్ ఇచ్చాయి. జూలై 20న పార్లమెంట్‌కు కూతవేటు దూరంలో తెలంగాణ కోసం యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకొని తెలంగాణ ఘోషను చాటిచెప్పాడు. ఆగస్టు 12న 14ఎఫ్ రద్దు చేస్తూ ప్రకటన వచ్చింది. తెలంగాణవ్యాప్తంగా సంబురాలు జరిగాయి. సెప్టెంబర్ 12న కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ సారథ్యంలో జనగర్జన సభ జరిగింది.

లొల్లి మధ్య ఢిల్లీ చేరిన బిల్లు
ప్రపంచం మొత్తం తెలంగాణవైపు చూసిన చారిత్మ్రక సందర్భమైన సకలజనుల సమ్మె సెప్టెంబర్ 13నప్రారంభమైంది. 19న సడక్‌బంద్ పేరుతో జాతీయరహదారుల దిగ్భంధం చేశారు. న్యూడెమోక్రసీ సీపీఐ ఎంఎల్ ఆధ్వర్యంలో ఖమ్మంలో పోరుగర్జన జరిగింది. సెప్టెంబర్ 24, 25న తెలంగాణ ప్రజలంతా పట్టాలపైకి వచ్చి 48 గంటలపాటు రైళ్లను దిగ్భంధించారు. 24న సకలజనుల సమ్మెను తాత్కాలికంగా విరమించారు. 2012 జనవరి 19న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ పోరుయాత్ర ప్రారంభమై ఫిబ్రవరి 9న ముగిసింది. తెలంగాణపై స్పష్టత ఇవ్వని వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ జూలై 23న సిరిసిల్ల రావడంతో చెప్పులు, చీపుర్లతో స్వాగతం పలికారు. సెప్టెంబర్ 21న తెలంగాణ గాంధీ కొండా లక్ష్మణ్ బాపూజీ మరణించారు. సెప్టెంబర్ 30, 2012 న నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన సాగరహారం జనసంద్రమైంది. డిసెంబర్ 12న హైదరాబాద్‌లో ధూంధాం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు.

డిసెంబర్ 28న హోంమంత్రి షిండే సారథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి నెలరోజుల్లలోనే పరిష్కారం కనుక్కొంటామని సాగదీశారు. ఆందోళనలు ఊపందుకుని 27న జేఏసీ సమరదీక్ష, మార్చి 21న సడక్ బంద్ నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా జూలై 30న సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. సెప్టెంబర్ 7, 2013న ఎల్‌బీ స్టేడియంలో ఏపీఎన్జీవో సారథ్యంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ నిర్వహించారు. నిరసనగా తెలంగాణవ్యాప్తంగా బంద్ జరిగింది. సెప్టెంబర్ 29న సకలజనభేరితో నిజాం కాలేజీ గ్రౌండ్ దద్దరిల్లింది. అక్టోబర్ 8న కేబినెట నోట్‌పై మంత్రుల బందం ఏర్పాటైంది. అక్టోబర్ 11న జీవోఎం తొలిభేటీ. నవంబర్ 12న జీవోఎంతో వివిధ పార్టీల భేటీలు. డిసెంబర్ 5న రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ తెలంగాణ బంద్. డిసెంబర్ 6న రాష్ట్రపతికి చేరుకున్న విభజన బిల్లు.

డిసెంబర్ 12న హైదరాబాద్ చేరుకున్న విభజన బిల్లు. డిసెంబర్ 16న అసెబ్లీలో తెలంగాణ బిల్లు. నాటకీయ పరిణామాల మధ్య బిల్లుపై చర్చ ప్రారంభం. డిసెంబర్ 24 తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య దుర్మరణం. జనవరి 7, 2014 ఇందిరా పార్క్ వద్ద సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష. జనవరి 30న అసెంబ్లీలో ముగిసిన చర్చ..ఢిల్లీకి చేరిన బిల్లు. ఫిబ్రవరి 18న లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదం. ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆమోదం. ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో దేశంలో 29వ రాష్ట్రం అవతరించిన తెలంగాణ.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.