తెలంగాణ జయశంకర్ జోహార్

మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి! మా తెలంగాణ మాగ్గావాలి..!! యాభై ఏళ్లుగా ఇదే ఆకాంక్ష.. ఇదే శ్వాస.. ఇదే లక్ష్యం.. ఇదే జీవితం.. ఇందులోనే మరణం! ఉద్యమాన్ని శ్వాసించిన మహోపాధ్యాయుడు.. తుది శ్వాస విడిచారు. చీకట్లు కమ్మిన తెలంగాణలో.. ప్రత్యేక ఉద్యమాన్ని ప్రజ్వలింప చేసిన జ్వాల.. ఆరిపోయింది! అసమానతల సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణకు న్యాయం కోసం కొట్లాడిన గొంతు మూగబోయింది. ఐదు దశాబ్దాలుగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మార్గనిర్దేశనం చేసిన ధ్రువతార రాలిపోయింది. వామపక్ష భావజాల ఉద్యమాలు, మానవ హక్కుల పోరాటాల్లో మమేకమవుతూనే తెలంగాణ వాదం వినిపించడానికి గళం విప్పిన యోధుడు ఇక లేడు! తెలంగాణ ఉద్యమం కోసం గొంతునిచ్చిన ప్రొఫెసర్ సాబ్‌ను గొంతు క్యాన్సర్ మింగేసింది! ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను యాభై ఏళ్లుగా బతికించి.. ఉచ్ఛ దశకు చేర్చి.. లక్ష్యతీరాల దరికి చేర్చిన తెలంగాణ సేనాని.. ఉద్యమం ఒడిలో సుదీర్ఘ విశ్రాంతిలోకి వెళ్లిపోయారు. తాను కలలు గన్న ప్రత్యేక రాష్ట్రాన్ని కళ్లారా చూసుకోక ముందే.. కన్నుమూశారు! తొలి దశ పోరాటంనుంచి.. మలి విడత పోరాటానికి ఊపిరులందించిన ఉద్యమ వంతెన.. కూలిపోయింది! యావత్ తెలంగాణను దుఃఖ సాగరంలో ముంచేసి.. స్ఫూర్తి తారగా మెరిసిపోయారు! తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అమరజీవి అయ్యారు!!

ఆచార్య జయశంకర్ ఇక లేరు
: తెలంగాణ మహాత్ముడు.. తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ కొత్త పల్లి జయశంకర్ అస్తమించారు. రెండేళ్లుగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రొఫెసర్.. మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ప్రత్యేక తెలంగాణసాధన ఉద్యమానికి వైవాహిక జీవితం అడ్డుపడుతుందన్న అభివూపాయంతో ఆయన సంసార బంధనాలకు దూరంగా ఉన్నారు.

అను నిత్యం తెలంగాణ సాధన కోసం పరి తపిస్తూ, ఉద్యమ భావ జాలాన్ని నిత్య ప్రజ్వలనం చేస్తూ, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ప్రొఫెసర్‌సాబ్.. మనల్ని వీడిపోయారు. ప్రొఫెసర్ జయశంకర్ మృతికి మూడు రోజులు సంతాపదినాలుగా పాటించాలని తెలంగాణ ప్రజా సంఘాలు, అన్ని జేఏసీలకు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ సూచించారు. మంగళవారం ఆయన హన్మకొండలో జయశంకర్ పార్థివ శరీరాన్ని సందర్శించి నివాళులర్పించి మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో నల్లజెండాలు ఎగురవేయాలని, కొవ్వొత్తులను వెలిగించి ప్రదర్శనలు నిర్వహించాలని ఆయన కోరారు. ఎన్ని రకాలుగా సంతాపం ప్రకటించాలో అన్ని రకాలుగా సంతాపం ప్రకటించాలని ఆయన సూచించారు. ఆచార్య జయశంకర్.. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో లక్ష్మీకాంతరావు, మహాలక్ష్మి దంపతులకు 1934 ఆగస్ట్ 6న జన్మించారు. జయశంకర్‌కు ముగ్గురు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఆయన వయస్సు 77 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు ఇటీవలే హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో శస్త్ర చికిత్స చేశారు. వైద్యులు ఆయన పరిస్థితిని చూసి బాధపడుతోంటే ‘ఏం ఫర్వాలేదు.

మీరు చేయాల్సింది మీరు చేశారు. ఈ సమయంలో నేను ఇక్కడ ఇక ఉండలేను. నేను వరంగల్‌కే పోతాను. నన్ను పంపండి’ అంటూ ఆయన పుట్టిన గడ్డమీద మమకారంతో వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చారు. ఇంట్లోనే వైద్యులు ఆయనకు అన్నిరకాల వైద్యసేవలు అందించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆయన పల్స్‌రేట్ పడిపోవడంతో ఆక్సిజన్ అందించారు. చివరికి మంగళవారం ఉదయం 11.15 నిమిషాలకు జయశంకర్ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ఆయన పోయారన్న విషయాన్ని తెలంగాణవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణవార్త విన్న ఓరుగల్లు ఏకశిలా నగరం శోకసమువూదంలో మునిగిపోయింది. యావత్తు తెలంగాణ వాదులు ఆయనను కడసారి చూసుకునేందుకు వరంగల్‌కు చేరుకుంటున్నారు. ఆయన ఆజన్మాంతం తెలంగాణ బ్రహ్మ సంకల్పంతో పోరాడిన బ్రహ్మచారి. ఆయన అంతిమ సంస్కారాలు హన్మకొండలోని శివముక్తిధాంలో బుధవారం సాయంత్రం జరుగుతాయి.

అధ్యాపకుడిగా..
అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరిపోశారు. ఎమ్జన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. సీకేఎం కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా అప్పట్లో పేరుండేంది. విప్లవకవి వరవరరావు లాంటి వాళ్లు ఆ కాలేజీలో అధ్యాపకులుగా వ్యవహరించారు. ఎమ్జన్సీ గడ్డురోజుల్లో ఆయన కళాశాలను నడిపి ఎంతో మంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని ఆయన నిర్బంధం నుంచి కాపాడారు. ఆయన అధ్యాపకుడిగా హన్మకొండలోని మల్టీపర్సస్ స్కూల్లో మొదట తెలుగు బోధించారు. ఒక అధ్యాపకున్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సర్వసాధారణమే కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థుల్ని గుర్తుపెట్టుకొని పేరుపెట్టి పిలవడం ఒక్క జయశంకర్ సార్‌కే సాధ్యం అంటూ ఆయనకు తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని, ప్రముఖ సాహీతివేత్త రామశాస్త్రి కన్నీళ్లపర్యంతమయ్యారు. జయశంకర్ విద్యార్థుల్లో అనేక మంది దేశవిదేశాల్లో ప్రస్తుతం ప్రముఖ స్థానంలో ఉన్నారు. వీరిలో కేయూ మాజీ ప్రొఫెసర్ ఎన్. లింగమూర్తి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్ కే. సీతారామావు తదితరులు అనేక మందికి ఆదర్శ గురువు జయశంకర్.

విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీదాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తిచేయడంలో ఆయన పాత్ర మరవలేనిది. విద్యార్థి దశ నుంచే తెలం‘గానం’ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోకి ఉరికి ఆనా టి నుంచి సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశా లాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సా ర్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన అపర మేధావి కొత్తపల్లి జయశంకర్. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణకోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి సునిశితంగా అధ్యయ నం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతీరోజూ రచనలు చేసిన అక్షరయావూతికుడు ఆయన.

తెలంగాణలోని ప్రతీపల్లె ఆయన మాటతో పోరాట గుత్ప అందుకున్నది. ఆయన తిరగని ప్రాంతం లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద , విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ రణన్నినాదాన్ని వినింపించిన పోరాట శీలి.

అక్కడికి చేరుంటే… అమరవీరుణ్ణి అయ్యేవాణ్ణి పొఫెసర్ జయశంకర్
తరతరాలుగా తెలంగాణకు సీమాంధ్ర పాలకులు, మీడియా చేస్తున్న అన్యాయాలు, అక్రమాల గురించి గంటల తరబడి వివరించే సత్తా, సాధికారత ప్రొఫెసర్ జయశంకర్ సొంతం. నీళ్లు, ఉపాధి, విద్య, సంస్కృతి…ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా అందులో తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఆయన బాధాతప్త హృదయంతో చెబుతారు. మీడియా వక్రీకరణలు, ట్యాంక్‌బండ్ సంఘటన, జాయింట్ క్యాపిటల్, తెలంగాణ సాహిత్యం, సామాజిక న్యాయాలపై ప్రారంభసంచికలో ముచ్చటించిన ప్రొఫెసర్ సాబ్ జీవితంలో ‘సిటీకాలేజ్’ సంఘటనకూ ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక మన భాషను, యాసను ఎగతాళి చేసిన సీమాంవూధులను ఎండగడుతూనే… భవిష్యత్ తెలంగాణను గొప్పగా ఊహిస్తున్నారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే…

1952లో విశాలాంవూధకు వ్యతిరేకంగా పోరాటం మొదలయ్యింది. నేనప్పుడు వరంగల్‌లొ ఇంటర్ చదువుతున్నా. 1948-52 ప్రాంతంలో ఉద్యోగాల కోసం వలస వచ్చారు. తెలంగాణలో ఇంగ్లీషు రాదు… కమ్యూనిస్టు భావాలు చాలా ఉంటాయని కేంద్రం ఆంధ్ర ఉద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇక్కడికొచ్చిన వాళ్లు మనల్ని బాగా ఎక్కిరించేవాళ్లు. అయ్యదేవర కాళేశ్వరరావు అనే ఆయనను పిలిపించి వరంగల్‌లో ఉపన్యాసం పెట్టించారు. ఆయన మనల్ని బాగా వెక్కిరిస్తే.. మేం ప్రతిఘటించినం. కలెక్టర్లు, పోలీసులు కూడా వాళ్లే కాబట్టి లాఠీచార్జీ జరిపించారు. అప్పుడు నేను కూడా లాఠీదెబ్బలు తిన్నా. అప్పటికే తెలంగాణ ఎన్టీవోస్, టీచర్లు ఆంధ్రోళ్ల వల్ల అవమానాలకు గురవుతూ.. హైదరాబాద్‌లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్ నుంచి నేను కూడా బయలుదేరినా.. మా బస్సు భువనగిరిలో ఫెయిలయ్యింది. ఈలోపు అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిగి 7గురు విద్యార్థులు చనిపోయారు. ఒకవేళ ఆ సమయానికి నేను కూడా అక్కడికి చేరుంటే.. అమరవీరుల జాబితాలో చేరే వాణ్ణి. ఆ అదృష్టం నాకు దక్కలేదు. బతికి ఏం చేశానయ్యా అంటే.. ఈ ఘోరాలన్నీ చూడాల్సి వచ్చింది.
భాషను.. యాసను ఎగతాళి చేశారు…

తెలంగాణ భాషను సీమాంవూధులు చాలా ఎగతాళి చేశారు. 1970లో జంధ్యాల పాపయ్య శాస్త్రి అనే పెద్ద కవి తెలంగాణ ఏర్పడితే దక్షిణ పాకిస్తాన్ అవుతుంది అని రాశాడు. అంతేకాదు… తెలుగు భాషను భ్రష్టుపట్టిస్తున్నారు తురకల భాష మీది.. తౌరక్యాంధ్రం అన్నారు. భాషకు మతం ఉండదు.. మతానికి భాష ఉంటుంది. మనది తురకల భాష ఎలా అయ్యింది? నేను ఉర్దూలోనే చదువుకున్నా. సీమాంవూధులు రాసిన కవిత్వంలో బేజార్, పంకా, జెండా పదాలన్నీ ఉర్దూవే కదా… ఇక శ్రీశ్రీ కూడా ఎన్నో ఉర్దూ పదాలను ఉపయోగించి భాషను సుసంపన్న ం చేశారు. అయితే విషాదం ఏంటంటే… సీమాంవూధులకు వాళ్లు వాడినది ఉర్దూ పదం అనేది వాళ్లకే తెలియదు. అది తెలియదనేది కూడా వాళ్లకు తెలియదు. అందుకే ఎవడి భాష వానికే ప్రామాణికం.

భవిష్యత్ తెలంగాణ
భవిష్యత్తు తెలంగాణలో అభివృద్ధి చాలా శీఘ్రంగా జరుగుతుంది. నీళ్లలో మన వాటా తేలిన తర్వాత జలవనరుల విషయంలో స్వేచ్ఛ ఉంటుంది. స్వయంపాలనలో శాసిస్తాం… ఇతరుల పాలనలో యాచిస్తున్నాం.పెద్ద ప్రాజెక్టుల సంగతి కాసేపు పక్కన పెడితే.. నిజాం కాలంనాటికే తెలంగాణ ప్రాంతంలో గొలుసు చెరువులు చాలా ఉండేవి. ఉద్దేశ పూర్వకంగానే వాటిని నాశనం చేశారు. తెలంగాణ వస్తే మొదటగా ఈ చెరువులను పునరుద్ధరించాలి. అన్నీ సాధ్యం కాకపోవచ్చు.. అయినా వీటిని బాగుచేస్తే.. గ్రామీణ వ్యవస్థ సస్యశ్యామలం అవుతుంది. ఇక నిజాం కాలంలో విద్య, వైద్యం రెండూ ఉచితమే.. అయితే వీటన్నింటిని వారు నాశనం చేశారు. అభివృద్ధి అంటారు కానీ వాళ్లు ఇక్కడ ఒక్క ఆసుపవూతినిగానీ, కాలేజీనిగానీ కట్టారా?ముఖ్యంగా వనరుల కొరత ఉండదు. ఇప్పుడు వాటిని ఇష్టానుసారంగా, అక్రమంగా తరలించుకుపోతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన పైసలు మనం వాడుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే… ఈ ప్రాంతంలో ప్రజాస్వామిక సంస్కృతిని ధ్వంసం చేశాయి ప్రభుత్వాలు. ఉద్యమాలను అణచివేసే పేరుతో బీభత్సం సృష్టించారు. అడుగడుగున పోలీస్ రాజ్యమే ఉంది. అందుకే ప్రజాస్వామిక సంస్కృతి తిరిగి స్థాపించబడాలి. అది జరిగితేనే మిగతా కార్యక్షికమాలు జరుగుతాయి. తెలంగాణలో ఇవన్నీ సాధ్యమే.. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో ఆ చైతన్యం ఉంది కనుక. సార్ చివరి మాటల సాక్షిగా…

నమస్తే తెలంగాణ పత్రిక ఆవిష్కరణకు సరిగ్గా వారం రోజుల ముందు…
తెలంగాణ సాధికారిక స్వరం ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ఇంటర్వ్యూ ప్రారంభసంచికలో వేయాలని ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ అల్లం నారాయణ సార్ ఆ బాధ్యతను నాపై పెట్టారు. జయశంకర్ సార్‌తో మాట్లాడటమంటే.. సుదీర్ఘ తెలంగాణ ఉద్యమాన్ని గురించి తెలుసుకోవడమే. ఆ ఉత్సాహంతోనే సార్‌కు ఫోన్ల మీద ఫోన్లు చేసి విసిగించాను. ‘ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు. అయినా ఇప్పుడు నా ఇంటర్‌వ్య్యూ ఎందుకయ్యా చూద్దాం లే..’ అంటూ సున్నితంగా తిరస్కరించినప్పటికీ… చివరికి ఒప్పుకున్నారు.

హబ్సీగూడ రోడ్ నెంబర్ 5లో ఉన్న ‘కాంక్రీట్ హార్మొని’ అపార్ట్‌మెంట్‌లోని ఐదవ అంతస్థులోని పెంట్‌హౌస్… అక్కడి నుంచి చూస్తే ఉద్యమాల పోరాటాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీ గొప్పగా కనిపిస్తోంది. అదేమాట సార్‌తో అంటే… ‘ఉస్మానియాను తలుచుకుంటే తెలంగాణ వాడినైనందుకు గర్వంతో ఛాతి ఉబ్బుతుంది. ఎన్నెన్ని పోరాటాలకు, ఆరాటాలకు అది వేదికైంది చెప్పు.. అందరికీ ఉస్మానియా యూనివర్శిటీ అంటే చెట్లు కనిపిస్తయి.. కానీ మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేక మంది విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నాకు కళ్లముందే కదుల్తు కనిపిస్తరు. దు:ఖమొస్తది.. అయితే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. వాళ్లకు మరణం లేదు… అదే ఉస్మానియాలో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్నాపకం. కానీ వారి భవిష్యత్ కలలతో ఆడుకున్నది ఎవరు? వారి ఆశలతో ఆడుకుని… వారి శవాలపై ప్రమాణం చేసిన రాజకీయనాయకులకు వాళ్ల ఉసురు తగలకుండా పోతుందా’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

తెలంగాణ ఉద్యమానికి సజీవ సాక్షి గా… ఉరకలేస్తున్న తెలంగాణ పోరాటానికి సిద్ధాంత కర్తగా.. సుమారు ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ కాజ్ కోసం మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా నిలుచున్న జయశంకర్ సార్‌ను పడక్కుర్చీలో అచేతనంగా చూడటంతో నా కళ్లలో నీళ్లు తిరిగాయి. బహుశా నా బాధను ఆయన గ్రహించి ఉంటారు. అందుకే ‘‘ తెలంగాణ ఉద్యమానికి నాలాంటి వారి అవసరం ఇప్పుడు లేదయ్యా.. ఎందుకంటే ఉద్యమాన్ని మీలాంటి యువకులు అర్థం చేసుకున్నారు. మలి దశలో ఉద్యమాన్ని ముందుకు నడిపించింది యువకులు, విద్యార్థులే కదా…. మునుపటి కన్నా ఎన్నో రెట్లు మిన్నగా ప్రజల్లోకి తెలంగాణ భావనలను చాలా గొప్పగా ఈతరం తీసుకెళ్లింది. ఇక తెలంగాణ గురించి బెంగ అవసరం లేదు. నేను ఉన్నా లేకున్నా తెలంగాణ వచ్చి తీరాల్సిందే. ఈసారి తెలంగాణకు ఎవరు అన్యాయం చేసినా వాళ్లను తెలంగాణ యువత బొందపెడుతుంది. కాకపోతే రాబోయే బంగారు తెలంగాణను చూడాలనుంది’’ అనగానే ‘అదేంటి సార్ అందులో మీకేమైనా డౌటుందా. తప్పకుండా చూస్తారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దానికి మీరు దిశా నిర్దేశనం చేయాలి కదా’ అన్నాన్నేను.

1956 నవంబర్ 1 : ఒక రాచపుండు

మృత్యువు క్యాన్సర్ రూపంలో అతడ్ని దహించింది. కానీ సమైక్యాంవూధలో బతుకు అతడ్ని అనుక్షణం రాచపుండై వేధించింది. జయశంకర్ ఓ సామాన్యమైన వ్యక్తి. సగటు తెలంగాణ బిడ్డ. కానీ మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగినాడంటే, మలి తెలంగాణ ఉద్యమానికి ముగ్గు పోసిన దీర్ఘదర్శి అయినాడంటే అది ఉట్టిగ జరగలేదు. అది ఎంతటి సంఘర్షణతో కూడుకున్నదో తన సన్నిహితులకు తెలుసు. ఇవ్వాళ నలుగురికీ తెలువాల్సిందీ ఒకటుంది. అది క్యాన్సర్ అని!

అవును. ఆయన క్యాన్సర్‌తో పోయిం డు. తెలంగాణంలో మనం రాచపుండు అంటమే అది ఆయన్ని పట్టి పీడించింది, ఇవ్వాళా నిన్నకాదు. ఆ సంగతి చెప్పడానికి ముందు ఒక ఘట్టాన్ని చెప్పుకోవాల్సిందే.
అది నిజాం స్టేట్. తన కు టీచర్‌గా అపాయింట్‌మెంట్ ఆర్డర్ చేతికందిన సందర్భం. అందరి లెక్కనే సంతోషంతో నలుగురికీ చెప్పుకున్నడు. మురిసిపోయిండు. తీరా ఉద్యోగంలో చేరేందుకు వెళ్లేటప్పటికి ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడింది. సరేలే అనుకుని అట్లనే అపాయింట్‌మెంట్ ఆర్డర్ చేత పట్టుకుని జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళితే, తన స్కేల్ మారిందని తెలిసి విస్తుపోయిండు. నిజమే మరి. ఆంధ్రవూపదేశ్ అవతరణతో మన జీతాల్ని తగ్గించిండ్రు. ‘ఏంటిది?’ అని అడిగితే, ‘మిస్టర్ జయశంకర్. ఇది మీ నిజాం గవర్నమెంట్ కాదు. ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం. మైండిట్..’ అన్నరట. దాంతో జయశంకర్ మరింత ఖంగుతిన్నడు.

ఇంకేమన్నరంటే, ‘ఇష్టముంటే చేయి లేకపోతే లేదని’ అమార్యదగా చెప్పింవూడట. దాంతో ఆయన అహందెబ్బతింది. ఆత్మగౌరవం భంగపడ్డది. నిజానికి ఇంకా తాను అన్యాయం అని కూడా అనలే. కానీ వాళ్ల తీరు అట్ల ఉండింది. ఒక పురుగును చూసినట్టు చూసి, అతడ్ని హేళన చేసిండ్రు. అప్పుడు తన కళ్లు విచ్చుకున్నయి. ఇదేంది. మనని బతిమాలి బామాలి ఉమ్మడిగా ఉందాందామని ఒప్పించిన వాళ్లేనా వీళ్లు. మన గడ్డమీద మననే పరాయివాళ్లుగా ట్రీట్ చేయడం ఏమిటీ అని జయశంకర్ విస్తుపోయిండు. వాళ్ల జీతాలతో సమానంగా మన జీతాలు తగ్గించినందుకు సంజాయిషీ ఇవ్వవలసింది పోయి తలభిరుసుతో ’ ఉద్యోగం చేస్తే చేయి… లేకపోతే లేదు’ అని అనడం యువకుడైన జయశంకర్‌ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టయింది. తెలంగాణ బిడ్డగా మొట్టమొదటి సారిగా జయశంకర్ సార్ తీవ్రంగా హర్ట్ అయ్యింది ఇక్కడే. ఇక, అదీ మొదలు, ఆయన ఎన్నో చూసిండు.

ఆంధ్రవూపదేశ్ అవతరణ వల్ల తెలంగాణ బిడ్డలు ఇంకెన్ని విధాలు మోసపోతరో ఆ రోజే తనకు అర్థమైంది. ప్రశ్నిస్తే మననెట్లా హేళన చేస్తరో, దెబ్బలు తీస్తరో ఆరోజే ఆయనకు తేటతెపూ్లైమయింది. ఒక్కమాటలో ‘ఆంవూధవూపదేశ్ అవతరణ’ తెలంగాణ పాలిట రాచపుండు అన్న సంగతి ఆయనకు ఆనాడే సుస్పష్టమైంది. ఇవ్వాళ ఆయన క్యాన్సర్‌తో మరణించిండంటే అది చిన్న విషయం. ఆంధ్రవూపదేశ్ రాష్ట్రంలో అడుగడుగునా అన్యాయాలు, అణచివేతలు, లాఠీలు, తూటాలు, చివరకు నిన్నమొన్నటి పిల్లలు తన ముందే పిట్టల్లా రాలిపడుతుంటే, ఇంతటి సంక్షోభాన్ని చూస్తూ చూస్తూ ఆయన ఇంతకాలం బతికిండంటే అది ఓ నరకయాతన.

నిన్నమొన్న వచ్చిన క్యాన్సర్ తన శరీరాన్ని దహించివుండవచ్చుగాక, కానీ నాటినుంచే తన మనసును సలసల మరిగించిన కోస్తాంవూధుల అనైతిక పరిపాలన అతడ్ని తీవ్రంగా కృంగదీసింది. ఆ పరితాపం, నిస్సహాయతనుంచే ఆయన ఒక అనివార్యమైన కలగన్నాడు. అదే ‘ప్రత్యేక తెలంగాణ’ . ఇందుకోసమే ఆయన ‘సిద్ధాంతకర్త’గా’తన మేధస్సును పదును పెట్టుకోవాల్సి వచ్చింది. సమకాలీన రాజకీయాలను ఔపోసాన పట్టేలా, ‘భౌగోళిక తెలంగాణ’కు మద్ధతుగా నిలబడేలా చేసింది. తెలంగాణ ఏర్పాటు వైపు అన్ని రాజకీయపార్టీలూ ఐక్యంగా కదిలేందుకు అహర్నిశలూ శ్రమించేలాచేసింది. స్వయంగా ఉద్యమకారుడూ కావాల్సి వచ్చింది. కాళోజి ‘నా గొడవ’ను ‘తెలంగాణ గొడవ’గా మలిచేలా చేసింది. ‘తెలంగాణ రాష్టం- ఒక డిమాండ్’ అన్న పుస్తకమే తన బతుకు పుస్తకంగా మారేలా చేసింది. నిజానికి సార్ చాలా మామూలుగా మనిషి. ఎటువంటి వ్యధాభరిత ప్రయాణం లేకుండా హాయిగా, నిమ్మలంగా బతకాల్సిన ఓ మామూలు మనిషి. కానీ, ఇయ్యాళ తనకోసం యావత్ తెలంగాణ కన్నీరుకార్చే మనిషయ్యిండంటే -అందుకు కారణం ఆంధ్రవూపదేశ్ లేదా 1 నవంబర్ 1956. అదే తెలంగాణను పట్టిపీడిస్తున్న రాచపుండు. లాస్టుల ఒకటే మాట. ఆయన మనను వీడిపోయినందుకు మనం బాధపడితే తన ఆత్మ శాంతించదు. ఈ పీడ వదిలితేనే ఆయనకు మనఃశ్యాంతి.

This entry was posted in TELANGANA MONAGALLU.

Comments are closed.