తెలంగాణ ఛత్రపతి

Papannaసామాన్యుడిగా ప్రస్థానం ప్రారంభించి చక్రవర్తి స్థానానికి ఎగబాకిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మల్లే అత్యంత నిమ్నకులంలో పుట్టి కొడితే గోల్కొండకోటను కొట్టాలి అనే నినాదాన్ని పుణికి పుచ్చుకొని ఆ లక్ష్యం దిశగా పయనించిన సర్దార్ సర్వాయి పాపన్నను ఛత్రపతి శివాజీగా పోల్చడం సబబే అవుతుంది. తెలంగాణ వీరోచిత పోరాటాల్లో చరివూతకెక్కని ఎన్నో పోరాటాల వల్ల పాపన్న గోల్కొం డ ఖిల్లాను జయించే పరిణామం వక్రీకరించబడింది. మొదటి నుంచి పాపన్న వీరోచిత్వాన్ని చరివూతకారులు నేటి తరానికి పరిచయం చేసినట్లయితే దళిత బహుజన చైతన్యానికి స్ఫూర్తినిచ్చే పాపన్ననే జాతిపితగా కీర్తించేవారేమో..!
వరంగల్ జిల్లాలోని జనగాం మండలం ఖిలాషాపూర్‌లో సర్వాయిపాపన్న 1650 ఆగస్టు 1న నిరుపేద కల్లు గీత కుటుంబంలో జన్మించాడు. తండ్రి చిన్నప్పు డే కాలం చేయగా, తల్లి సర్వమ్మే సర్వమై పాపన్నను పెంచి పెద్ద చేసింది. చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు అధికంగా గల పాపన్నకు స్నేహితులంటే ప్రాణం. అందులో ప్రధానంగా చాకలి సర్వన్న, మంగలి మాస న్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరమాండ్లు, దూదేకుల ఫీర్, కొత్వాల్ మీర్‌సాహేబ్ లాంటి వాళ్ళు ప్రియ అనుచరులు గా ఉండేవారు. 17వ శతాబ్దంలో అంటే 350ఏళ్ల క్రితం అప్పటి మొగల్ చక్రవర్తులు ప్రజలపై ఇష్టమొచ్చినట్లు పన్నులు విధించేవారు. వారికి సామంతులైన సుబేదార్లు, జాగీర్‌దారులు, దొరలు, భూస్వాములు పన్నులు వసూలు చేసే క్రమంలో ప్రజలపై తమ కర్కశత్వాన్ని ప్రదర్శించేవారు.

అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడేవారుకాదు. ఎదురుతిరిగే వారిని దారికి తెచ్చుకునేందుకు ఏళ్ల తరబడి బందీలుగా చేసేవారు. ఈ దురాగతాలను గమనించిన పాపన్నకు నిరుపేదల కోసం ఏదైనా చేయాలనే పట్టుదల బయలుదేరింది. స్నేహితులను సమీకరించుకొని తల్లి తన కోసం దాచుకున్న రొక్కాన్ని తీసుకొని బయలుదేరాడు. నిరుపేదల కష్టాల విముక్తి కలగాలంటే గోల్కొండ కోటపై బహుజనుల జెండా ఎగరవేయడమే పరిష్కారమని భావించాడు. ఈ దశలో ఆయుధ సంపత్తి, సైన్యం కూడగట్టుకోవడానికి శ్రీకారం చుట్టాడు. దీనికి ధనసేకరణ కోసం పేదలను పీల్చిపిప్పి చేసి ఆస్తులను కూడబెట్టుకున్న భూస్వాముల, దొరల, జమీందార్ల గడీలను కొల్లగొ నిశ్చయించాడు. వీరి దళానికి పీడిత వర్గంలోంచి అనేక మంది పోగయ్యారు.

వరంగల్ పరిసర ప్రాంతాల్లోని జమీందార్లంతా ఒక్కటై పాపన్నను మట్టుపె ప్రణాళికలు రచించారు. ఇది గమనించిన పాపన్న కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల ప్రాంతంలో ఉన్న చల్‌గల్ గడీకి మకాం మార్చి అక్కడ నౌకరుగా చేరాడు. పొద్దంతా గడీలో పని, రాత్రుళ్లు సమీప జమీందార్ల నుంచి ధనం కొల్లగొట్టి రహస్య ప్రాంతాల్లో దాయడం చేసేవాడు. కొన్నాళ్ల తర్వాత చల్‌గల్ గడీలో పాపన్న ఉంటూ దోపిడీలు చేస్తున్నట్లు వరంగల్ జమీందార్లు గ్రహించి చల్‌గల్ దొరకు సమాచారమిచ్చారు. దీంతో అతన్ని బంధించి గడీలోని జైల్‌లో వేశారు. అప్పటికే గడీలో బందీగా ఉన్న ఖైదీలను ఏకతాటిపై తెచ్చిన పాపన్న ఓ రాత్రి బంధిఖానాకు గండీ కొట్టి అందర్ని తప్పించాడు. ఈ క్రమంలో సర్వాయిపేటకు చేరుకొని అక్కడ మొట్టమొదటి కోట కోటగిరి గుట్టలపై నిర్మించాడు. రాజకీయ వారసత్వం లేని ఓ సాధారణ వ్యక్తి అసాధారణ రీతిలో శత్రు దుర్భేధ్యమైన తొట్టతొలి కోట గా సర్వాయిపేట కోట కీర్తి గడించింది. ఇక అక్కణ్నుంచి తన ప్రస్థానానికి పదును పెట్టిన పాపన్న గోల్కొండ కోటను జయించే క్రమంలో 21 బుర్జులను నిర్మించాడు.

దాదాపు 30 ఏళ్ల పాటు నల్గొండ పరగణాల్లోని భువనగిరి, వరంగల్ ప్రాంతంలోని తాటికొండ, కొలనుపాక, చేర్యాల, కరీంనగర్, వేములకొండ, హుజూరాబాద్, హుస్నాబాద్‌లలో తన ఆధిపత్యాన్ని పాపన్న కొనసాగించాడు. 12వేల మంది సైన్యా న్ని నిర్మించుకొని సర్వాయిపేటకు ఆనుకుని ఉన్న కోటగిరి(నేడు పాపన్నగుట్ట)లో తన సైనికులకు శిక్షణనిచ్చాడు. అలా వచ్చిన సొమ్ముతో 1675లో సర్వాయిపేటలో మొట్టమెదటి కోటను కట్టాడు. తర్వాత 169లో తాటికొండ కోట, 1705 లో ఖిలాషాపురంలో కోటను ఇలా తెలంగాణలో సుమారు 21 కోటలను కట్టించాడు. సర్వాయిపేటలోని పాపన్న కోటనుండి తన సైన్యంతో బయలుదేరి 1709లో గోల్కొండను జయించి తొలి తెలంగాణ బహుజన రాజు అయ్యాడు.

సామాన్యకుటుంబంలో జన్మించిన సర్వాయి పాపన్న మొదటి నుంచి తాను సేకరించిన ధనాన్ని పేదలకు పంచేవాడు. సర్వాయిపేట గ్రామంలో ప్రజల కోసం తన మిత్రుడి పేరు మీద సర్వన్న చెరువును నిర్మించాడు. హుస్నాబాద్‌లో ఎల్లమ్మ ఆలయాన్ని, పాపన్నగుట్టల్లో బయ్యన్న ఆలయాన్ని, సర్వాయిపేటలో శివాలయాన్ని, పలు గ్రామాలలో హనుమాన్ ఆలయాలను నిర్మించినట్లుగా పరిసర ప్రాంత ప్రజలు చెపుతారు.. తన రాజ్యంలో ఎవరివృత్తి వారు స్వేచ్ఛగా చేసుకునేందుకు పాపన్న అవకాశం కల్పించాడు. పరిపాలనా వ్యవహారాలలో నిమగ్నమై ఉన్న సందర్భంలో మొఘలులు కొందరు స్థానిక రాజుల సహాయంతో జరిపిన దాడిలో వీరోచితంగా పోరాడిన పాపన్న గోల్కొండ కోటలో ఆత్మార్పణం చేసుకున్నట్లుగా ప్రచారంలో ఉంది. ఇంతటి ఘనచరిత్ర కలిగిన సర్వాయిపాపన్నకు చరిత్ర పుటల్లో చోటు దక్కలేదు. మన పాలకులు ఆయన వీరోచిత్వానికి విలువనివ్వకున్నా లండన్‌లోని మ్యూజియంలో ప్రపంచ ప్రముఖ విప్లవయోధుల సరసన సర్దార్ పాపన్న విగ్రహానికి చోటుదక్కింది.

-కొన్నె దేవేందర్‌

This entry was posted in TELANGANA MONAGALLU, Top Stories.

One Response to తెలంగాణ ఛత్రపతి

  1. T.rameshbabu says:

    ఓ మంచి ప్రయత్నం. ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. రియల్లీ నైస్.