తెలంగాణ కోసం సాయుధ పోరు..

tgఆయుధాలు
మేమిస్తాం
ప్రజా విముక్తి గెరిల్లా సైన్యంలో చేరండి
యువతకు మావోయిస్టుల పిలుపు
– సంప్రదింపుల పేరుతో కాంగ్రెస్ చేస్తున్నది పచ్చిమోసం
– బూర్జువా పార్టీల నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్రం రాదు
– నేతల వైఖరితోనే తెలంగాణ యువత ఆత్మహత్యలు
– విభేదాలను పక్కనబెట్టి అన్ని జేఏసీలు ఐక్యం కావాలి
– ధర్నాలు, వంటావార్పుల నుంచి బయటపడాలి
– మిలిటెంట్ పోరాటాల ద్వారానే కేంద్రం దిగివస్తుంది
– మావోయిస్టు నేత జగన్
‘ప్రత్యేక రాష్ట్ర సాధనకై సాయుధ పోరాటానికి సిద్ధంకండి. ఆ పంథాలో పయనించాలనుకున్న వారికి ఆయుధాలు సహా అన్ని రకాల మద్దతు అందిస్తాం. మీ కోసం ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం(పీఎల్‌జీఏ) తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి’ అని తెలంగాణ ప్రజలకు, యువతీ యువకులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పిలుపునిచ్చింది. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధికి మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణ సాధనకు ఆత్మహత్యలు మార్గం కాదని, తెగించి పోరాడాలని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు గొప్ప పోరాట వారసత్వం ఉందన్న జగన్.. నైజాంకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టి పోరాడిన చరిత్ర వారిదని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆలస్యానికి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానాలే కారణమన్నది స్పష్టమని జగన్ చెప్పారు. మరిన్ని సంప్రదింపులు అవసరమన్న పేరుతో ఆ పార్టీ తెలంగాణ ప్రజలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. మిగతా పార్టీలు కూడా రాష్ట్ర సాధనకు అవసరమైన రీతిలో పోరాటాలు చేపట్టడం లేదన్నారు. ఆయా పార్టీల నేతలు జాతి ద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాడుతున్న వివిధ జేఏసీల మధ్య ఐక్యత కొరవడడం ఉద్యమానికి మరో బలహీనతగా ఆయన పేర్కొన్నారు. బూర్జువా పార్టీలతో ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాదన్నది తమ పార్టీ అభివూపాయమని, వచ్చినా అది భౌగోళిక తెలంగాణగానే ఉంటుంది తప్ప ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావని తెలిపారు. జాతి పోరాటాన్ని వర్గ పోరాటంలో భాగంగానే తమ పార్టీ చూస్తుందని తెలిపారు. ఈజిప్టులాంటి దేశాల్లో నియంతల పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి బూర్జువా, పెటీ బూర్జువా వర్గాలు చివరి వరకూ నేతృత్వం వహించాయని, తెలంగాణ విషయంలో అలా జరగడం లేదని విశ్లేషించారు. ఉద్యమ సంస్థలు, ఉద్యమ పార్టీల లోపాలను ఎత్తిచూపడం విప్లవ పార్టీగా తమ బాధ్యతని జగన్ చెప్పారు. వివిధ పార్టీల, వర్గాల ప్రయోజనాల కోసం పని చేస్తున్న కొన్ని పత్రికలు, చానళ్లు తమ ప్రకటనలను వక్రీకరిస్తున్నాయని ఆక్షేపించారు. ఈ మధ్య తాము విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ అని పేర్కొనగా, ఒక పత్రిక(నమస్తే తెలంగాణ కాదు) టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై తమ విమర్శను ప్రధానంగా తీసుకున్నదన్నారు.

ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పులవంటి వాటికే పరిమితం కాకుండా సీమాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాలను, కార్యకలాపాలను స్తంభింపజేసేలా మిలిటెంట్ పోరాటాలను చేపట్టాలని జగన్ పిలుపునిచ్చారు. వివిధ జేఏసీల్లోని ప్రజాతంవూతశక్తులు ఇందుకు చొరవ చూపాలని సూచించారు. తెలంగాణలో తమ పార్టీ బలహీనపడ్డ మాట వాస్తవమని, అయితే ప్రజల గుండెల్లోంచి చెరిగిపోలేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాదేమోనన్న బెంగతో ఉన్న యువతీయువకులు ఆత్మహత్య ఆలోచన మానుకుని తమ మార్గంలోకి రావాలన్నారు. తమలో చేరాలనుకునే యువకులకు తాము అందుబాటులో ఉండేవిధంగా తగిన చర్యలు చేపడతామన్నారు. ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరిట దండకారణ్యంలో కొనసాగుతున్న రాక్షస దమనకాండను తీవ్రంగా ఖండించారు. ఆదివాసులు స్వయంపాలన దిశగా ముందుకు సాగుతుంటే, తరాలుగా వారి అభివృద్ధిని మరిచిన ప్రభుత్వ బలగాలు కనీస ప్రజాస్వామిక విలువలకు తిలోదకాలిచ్చి ఇళ్లను, ఆశ్రమ పాఠశాలలను తగులబెడుతున్నాయని ఆరోపించారు. ఈ దమనకాండను మేధావులు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.