తెలంగాణ కోసం విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ : తెలంగాణ కోసం మరో విద్యా కుసుమం నేలరాలింది. కాంగ్రెస్ అధిష్టానం, సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలు ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. చాకో వ్యాఖ్యలకు నిరసనగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని లైబ్రరీ వద్ద చెట్టుకు ఉరేసుకుని భరత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి జేబులోంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సూసైడ్ నోట్‌లోని సారాంశం.. ‘కాంగ్రెస్, టీడీపీ నేతల మోసం వల్లనే తెలంగాణ రావడం లేదు. కాంగ్రెస్, టీడీపీలు టీఆర్‌ఎస్‌ను విమర్శించడం మానుకోవాలి. తెలంగాణ కోసం పాటు పడుతున్న టీఆర్‌ఎస్ నేతలకు ఇతర పార్టీల నేతలెవరూ సహకరించడం లేదు. టీఆర్‌ఎస్ వంద సీట్లు గెలిస్తేనే తెలంగాణ వస్తది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను కలిసి తెలంగాణ సాధన కోసం ఆమె అడుగుజాడలో నడవాలనుకున్నాను కానీ నడవలేకపోతున్నాను’ అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. మృతుడి స్వస్థలం నల్లగొండ జిల్లా హుజుర్‌నగర్.

మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా విద్యార్థులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మృతదేహం వద్ద తెలంగాణ నినాదాలు మార్మోగుతున్నాయి. ప్రస్తుతం ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.