తెలంగాణ కోసం రాజకీయంగా పోరాడుతాం:టీ ఎంపీలు

టీఆర్‌ఎస్‌లో చేరి ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని కాంగ్రెస్‌ను వీడిన కె.కేశవరావు స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేశాం ఇక నుంచి రాజకీయంగా పోరాడుతామని చెప్పారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో అందరిని ఏకం చేసిన్రు అని తెలిపారు. తెలంగాణ ఇవ్వని కాంగ్రెస్‌లో ఉండి ప్రజల్ని మభ్య పెట్టడం ఇష్టం లేదని పేర్కొన్నారు. వెయ్యి మంది ఆత్మబలిదానాలు చేసుకున్న కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అంశాన్ని సీమాంధ్ర పెట్టుబడిదారులు, కేంద్ర ప్రభుత్వం చులకనగా చూస్తున్నారని తెలిపారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైందన్నారు. రాజకీయ స్వార్థంతో పార్టీ మారటం లేదని తేల్చిచెప్పారు. ఎలక్షన్ అంటేనే తెలంగాణ అని అన్నారు. తెలంగాణ రావాలంటే 100 అసెంబ్లీ స్థానాలు, 15 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవాల్సిందేనని పేర్కొన్నారు.

నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు : వివేక్
కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం తెలంగాణ కోసం అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నామని ఎంపీ వివేక్ తెలిపారు. పలుమార్లు తెలంగాణను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నానని, ఇక తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో అధిష్టానంపై ఎన్ని ఒత్తిళ్లు చేసినా లెక్కచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సీమాంధ్ర ద్రోహి సీఎం కిరణ్ కూడా తమను ఇబ్బంది పెట్టారని చెప్పారు. తెలంగాణ తమ ఎజెండాలో లేదని పీసీ చాకో అనడం బాధ కలిగించిందన్నారు. ఆరు నెలల నుంచి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నామని, అయినా తమ ప్రయత్నాలు ఫలించడం లేదని తెలిపారు. సీఎం కిరణ్ తమపై విమర్శలు చేయిస్తున్నారని, ఇకనైనా టీ కాంగ్రెస్ నేతలు తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. జైపాల్‌రెడ్డితో మాట్లాడినట్లు సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం చేసిందని, ఆ వార్తలను ఖండిస్తున్నానని వివేక్ చెప్పారు. తెలంగాణ సాధనే తమ ఎజెండా, ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చే పరిస్థితి లేదు : మంద
కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చే పరిస్థితి లేదనే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నామని నాగర్‌కర్నూల్ ఎంపీ మంద జగన్నాథం పేర్కొన్నారు. పదవులను ఆశించి పార్టీని వీడలేదని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలిచేందుకే పార్టీని వీడుతున్నామని తెలిపారు. పదవి వ్యామోహం ఎవరికున్నదో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని తాము అడుగుతున్నాం తప్ప కోట్ల విలువైన కాంట్రాక్టులు అడుగుతలేమని తేల్చిచెప్పారు.

సీమాంధ్ర అగ్రవర్గానికి చెందిన కావూరి సాంబశివరావు రాజీనామా చేస్తనంటే ప్రధాని, సోనియా, రాహుల్ పిలిపించుకుని మాట్లాడిన్రు అని గుర్తు చేశారు. కావూరి మాదిరిగానే తమను కూడా ప్రజలు ఎన్నుకున్నారని, మరీ తమను ఎందుకు పిలవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. ఏ ప్రాంతానికి అన్యాయం చేయనని ప్రమాణం చేసిన సీఎం బయ్యారం ఖనిజాన్ని వైజాగ్ తీసుకెళ్తానని సవాల్ విసరడం తగునా అని అడిగారు. సంకీర్ణ ప్రభుత్వాల్లో సంఖ్యా బలమే కీలకమన్నారు. సంఖ్యాబలంతోనే తెలంగాణ సాధ్యమైతదని మంద పేర్కొన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని మరిచిపోయి ప్రజలను మోసం చేస్తున్నదని తెలిపారు. తమ భవిష్యత్‌ను ప్రజలకే వదిలేస్తున్నామని చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.