తెలంగాణ కాలజ్ఞాని

(ఘంటా చక్రపాణి):

ఒక మనిషిని నిద్రపోనీయకుండా చేసేదే కల అన్నది నిజమేనేమో అనిపిస్తోంది. దాదాపు నాలుగేళ్ల పాటు తెలంగాణ సమాజం నిద్రపోకుండా తెలంగాణ కోసం కలలు కన్నది. సుదీర్ఘ రాజకీయ చర్చలు, వాదోపవాదాలు, ఊగిసలాటలు అనంతర ం ఎట్టకేలకు తెలంగాణ కల సాకారం కాబోతున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి వస్తోన్న ప్రకటనల్లోని పట్టుదలను చూసినప్పుడు తెలంగాణ ఏర్పాటు అనివార్యమని తెలుస్తోన్నా ఇంకా ఏవో అనుమానాలు, అర్థంకాని భయాలు మాత్రం తెలంగాణ ప్రజానీకాన్ని వీడినట్లు లేవు. ఇప్పటి ఈ సందిగ్ధ స్థితిలో తెలంగాణ, ఈ కలకు ఒక రూపాన్నిచ్చిన సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ (1934-2011) ను స్మరించుకుంటోంది.

కలలు, ఆశలు, ఆకాంక్షలు అందరికీ ఉంటాయి. తమ గురించి, తమ జీవితం గురించి ప్రతి ఒక్కరూ నిరంతరం ఏదో ఒక కల కంటూనే ఉంటారు. దాన్ని నిజం చేసుకోవాలని తపిస్తుంటారు. ఆచార్య జయశంకర్ కూడా అలాంటిదే ఒక కలగన్నారు. కానీ తన గురించి కాకుండా తన ప్రాంతం గురించి తపించారు. తన జీవితకాలం మొత్తం ఆ కలను సాకారం చేసేదిశగా ప్రయత్నించారు. తనలో మొదలయిన ఆ తపనను తనకు పరిచయమైన ప్రతి ఒక్కరి మదిలో నాటారు. జయశంకర్ మదిలో ఒక భావనగా మొదలైన ఆ కల యావత్ తెలంగాణ జాతిలో ఒక భావ చైతన్యాన్ని కలిగించి ఈ ప్రాంతపు ప్రజల మహా స్వప్నమై విస్తరించింది. గత ఆరు దశాబ్దాలుగా ప్రజల మనసులను తొలుస్తూ కదిలిస్తూ, నడిపిస్తూ వస్తోన్న ఆ కల గడిచిన నాలుగేళ్ళలో ఎవరినీ నిద్రపోకుండా నిలబెట్టింది. ఈ స్థితిలో జయశంకర్ లేకపోవడం ఒక్క తెలంగాణ సమాజానికే కాదు, యావత్ తెలుగు జాతికీ తీరని లోటుగా కనిపిస్తోంది.

ప్రొఫెసర్ జయశంకర్ బతికి ఉంటే పరిస్థితులు ఇంత సంక్లిష్టంగా మారి ఉండేవి కావేమో! ఎందుకంటే ఆయనలో కేవలం తెలంగాణ వాది మాత్రమే లేడు. ఒక జాతి ఆర్థికంగా ఎదగడానికి, స్వావలంబనతో మనగలగడానికి కావాల్సిన శాస్త్రీయ ప్రతిపాదనలు ఉన్నాయి. గాలిలో ప్రతిధ్వనించే ప్రాంతీయ నినాదాన్ని ఒక బలమైన ప్రాంతీయ అభివృద్ధి ఆకాంక్షగా, ప్రాంతీయ అస్తిత్వవాదంగా సిద్ధాంతీకరించిన మేధావిగా ఆయన తన ప్రతిపాదనలో రెండు వైపులా నుంచి ఆలో చించే వారు. అలా ఆలోచించడం వల్లే ఇప్పుడు తెలంగాణ వాదం ఒక సిద్ధాంతంగా అందరూ ఆమోదించే దశకు చేరింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైన ఈ దశలో ప్రభుత్వం చేస్తోన్న ప్రతిపాదనల్లో జయశంకర్ ప్రతిపాదించిన ప్రాంతీయ సిద్ధాంతంలోని అనేక అంశాలు కనిపిస్తున్నాయి. అపోహలు, అనుమానాలు, ఆధిపత్య ధోరణులు, అపనమ్మకాలు, షరతులు, ఉల్లంఘనలు .. ఇవి కొనసాగుతున్నంత కాలం ఏ జాతి కూడా ఐక్యంగా మన జాలదన్నది జయశంకర్ అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని ఆయన పదే పదే చెప్పేవారు . దీని ప్రాతిపదికనే ఆయన తన తెలంగాణవాదానికి పదును పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయిన నాటి నుంచి తెలుగు ప్రజల్లో జాతి భావన కంటే ఈ పోకడలే ఎక్కువగా ప్రభావితం చేశాయి. అది అనేక సందర్భాల్లో ఉద్యమాలు, ఆందోళనల రూపంలో చరిత్రలో ఆవిష్కృతమ య్యింది. దీనికి పరిష్కారం ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసిఉండవచ్చు నన్నది ఆయన ప్రతిపాదనల్లో మొదటిది.

కొన్ని షరతులు, ఒప్పందాలతో కలిసిన ఇద్దరిలో నిరంతరం ఒకరి మీద ఒకరికి అపనమ్మకాలు ఉన్నప్పుడు ఎవరికీ వారుగా ఉండడమే మంచిది కాబట్టి విభజన ఒక్కటే పరిష్కారం అని ఆయన భావించారు. అలా విడిపోవడం వలన జరిగే నష్టం కూడా లేదు. తెలంగాణ, ఆంధ్రప్రాంతాల మధ్య అన్ని రకాల సంబంధాలు, అనుబంధ బాంధవ్యాలు ఉన్నాయి. రెండు ప్రాంతాల్లో వేమన పద్యాలు, సుమతీ శతకాలు, శ్రీశ్రీ మహాప్రస్థానాలు, బ్రహ్మంగారి కాల జ్ఞానాలు, గుర్రం జాషువా గబ్బిలాలు, నన్నయ తిక్కన సోమనల పురాణ పారాయణాలు కలిసి ఉన్నాయి. ఇప్పుడు విడిపోయినా అవి కలిసి ఉంటాయి. విభజన వల్ల తెలుగు భాషకో, సంస్కృతికో జరిగే నష్టం ఏమీ లేదు. ఈ ప్రాతిపదికను పునాదిగా చేసుకునే జయశంకర్ తెలంగాణ వాదాన్ని ఒక గుణాత్మక , క్రియాశీల సిద్ధాంతభూమికగా మలిచారు. ఇది 1968-69లో, 1971-72లో వచ్చిన వాదాలకు భిన్నమైనది. ఆ రెండు వాదాలు ఒక ప్రాంతం నుంచి మరొకరు వెళ్ళిపోవాలనో, వెళ్లి పోతామనో వచ్చినవి. కానీ గడిచిన ఇరవైయ్యేళ్ళుగా జయశంకర్ ఆలోచనల ప్రభావంతో వచ్చిన ఉద్యమాలేవీ తెలంగాణ నుంచి ఆంధ్రా-రాయలసీమ ప్రజలు వెళ్ళిపోవాలని ఏనాడూ అనలేదు. కేవలం అధికారం, ఆధిపత్యం మాత్రమే వద్దన్నది తెలంగాణ ఉద్యమ సారాంశం. బాగో-బాగో అన్నవారిని కూడా వారించి కేవలం మీరు మేల్కొండి మీ వాదనను వినిపించి వారిని ఒప్పించండి అని మాత్రమే ఆచార్య జయశంకర్ చెప్పేవారు. దానినే ఆయన భావ చైతన్యం అన్నారు. నిద్రలో కూడా చైతన్యంతో మెలిగే మనసుకే కలలొస్తాయి మరి.

తెలంగాణ ఏర్పాటయిన తరువాత కూడా ఆంధ్రా ప్రజలు ఎవరైనా సరే ఒక్కడే ఉండవచ్చని జయశంకర్ ప్రతిపాదించారు. అయితే ప్రజలను ఏమార్చే దోపిడీ వర్గాల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలన్నారు. ‘పొట్ట పోసుకోవడానికి వచ్చే వారిని తెలంగాణ ప్రజలు ఆదరించాల్సిందే. పొట్ట కొట్టే వాళ్ల మీదే మన వ్యతిరేకత అంతా’ అన్న కాళోజీ సూత్రానికి తెలంగాణ కట్టుబడి ఉండాలన్నారు జయశంకర్. ఆ స్పృహ ఆయన కలిగించడం వల్లనే తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడి వ్యవసాయ వాణిజ్యాలు చేసుకుంటున్న వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ సమాజంలో కలిసి బతుకుతున్నారు. జై ఆంధ్ర ఉద్యమం పేరుతో రాయలసీమ రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు వెళ్లి పోతామని అన్నారు తప్ప ఇక్కడ గ్రామాల్లో స్థిరపడిపోయిన వారిని తీసుకువెళ్తామని అనలేదు.

తెలంగాణ వాళ్ళు కూడా వారిని వెళ్ళిపొమ్మని అనలేదు. అప్పుడైనా ఇప్పుడైనా గొడవంతా హైదరాబాద్‌గురించి, హైదరాబాద్‌లోఉన్న ఉన్నతోద్యోగులు, రాజకీయనాయకులది తప్ప ప్రజలది కాదు. ఎప్పుడైనా సరే మనది అనుకున్నంత వరకు గొడవే ఉండదు. గొడవంతా అధికారం మాది, పరిపాలన మాది అంటేనే. ఖచ్చితంగా ఆ రెండూ తెలంగాణ భూమి పుత్రుల చేతుల్లోనే ఉండాలన్నది జయశంకర్ ఆలోచనలోని బలమైన ప్రాంతీయ ఆకాంక్ష. అందుకే ఆయన ఉద్యోగాల గురించి, విద్యావకాశాల గురించి మాట్లాడారు. వాటినే ఉద్యమానికి మూల స్తంభాలుగా భావించారు. ఒక్క తెలుగు జాతేకాదు ఏ జాతి అయినా అభివృద్ధిచెందేది ఈ రెండు మౌలిక మానవ వనరుల మూలంగానే అన్నది సత్యం. ఆ రెండూ ఇక్కడి ప్రజలకు అందలేదన్నదీ నిజం. వాటిని తిరిగి పొందడం ఒక్క తెలంగాణ రాష్ట్రం వల్లనే సాధ్యమన్న వాస్తవాన్ని జయశంకర్ గుర్తించారు. తెలంగాణ సమాజాన్ని గుర్తించే విధంగా చేశారు. అందువల్లనే ఆయన ముల్కీ నిబంధనలను, జీ.వో.610 ను పదే పదే ప్రస్తావిస్తూ తన వాదానికి పునాదిగా మలిచారు.

ఇక నగరాన్ని మేమే అభివృద్ధి చేశామనే వాదనను కూడా ఆయన తోసిపుచ్చేవారు . నిజానికి ఒక్క ఆంధ్రా, రాయలసీమ మాత్రమే కాదు. దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల వాళ్లు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టారు. ఆంధ్ర వాళ్ళకంటే ముందుగా వచ్చిన వాళ్ళలో మహరాష్ట్రులు గుజరాతీలు ఉన్నారు. తమిళులు ఉన్నారు. బెంగాలీలు ఉన్నారు. వీళ్ళెవరూ తెలంగాణ వద్దనో, హైదరాబాద్ మాదనో అనడం లేదే! ఒక్క ఆంధ్ర వాళ్ళకున్న అభ్యంతరం ఏమిటి? అలాగని హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రా వాళ్ళు అంతా అలా మాట్లాడడం లేదు. కొందరు అవకాశవాదులు ఆ వాదన తెస్తున్నారు. అసలు వాళ్ళు వచ్చింది వ్యాపారం చేసుకుని బాగుపడడానికా ? మన మీద పెత్తనం చేయడానికా? వ్యాపార ం చేసుకుని బాగుపడతామంటే ఎవరికీ అభ్యంతరం లేదు. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు . ఆ స్పష్టత ఉద్యమానికి ఉంది. మా పై పెత్తన ం చేయడం పట్లనే మా అభ్యంతరం అని నిలదీసి ప్రశ్నించే వారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం అని చెప్పడం పచ్చి అబద్ధం అన్నది ఆయన బలమైన వాదనగా ఉండేది. అలాంటి అర్థ ం లేని వాదనలతో హైదరాబాద్‌ను తెలంగాణ నుంచి వేరు చేయాలని చూస్తే అది సాధ్యం కాదు. వాంఛనీయం అంతకన్నా కాదు. అలాంటి దుస్సాహసం చేస్తే ఇక్కడ అంతర్యుద్ధం రాక తప్పదని కూడా ఆయన అంటుండేవారు.

విచిత్రంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి రాజధాని అంటోంది. దీనికి జయశంకర్ చెప్పిందేమిటంటే తాత్కాలికంగా ఉమ్మడి రాజధానిగా ఇక్కడ ఉంది, అక్కడ రాజధాని నిర్మించవచ్చు. కానీ సుదీర్ఘకాలం అంటే అది కుదరదు. కేంద్ర పాలిత ప్రాంతం అంటే అసలే వీలవదు. గుజరాత్ విభజన సందర్భంగా అంబేద్కర్ చేసిన వాదనలనే జయశంకర్ తన వాదనలకు పునాదిగా చేసుకున్నారు. ఒక వేళ కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే నగరానికి నీళ్లు ఎక్కడి నుంచి రావాలి? కరెంటు ఎక్కడి నుంచి ఇస్తారు? ఉమ్మడి రాజధానికి జల, విద్యుత్ వనరులు యెట్లా వాడుతారు? హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతమో, ఉమ్మడి రాజధానో అయితే నీళ్ళు కృష్ణానది నుంచి రావాలి. కృష్న నీళ్ళు రావాలంటే నల్ల గొండ, మహబూబ్ నగర్ దాటి రావాలి. గోదావరి అయితే తెలంగాణ అంతా దాటిరావాలి. హైదరాబాద్ తెలంగాణది కానప్పుడు నీళ్ళెందుకివ్వాలి? అని జయశంకర్ ప్రశ్నించే వారు. ఒక వేళ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తే ముందుగా ఢిల్లీ, కలకత్తా, మద్రాస్, బొంబాయిలను చేసి ఇక్కడికి రమ్మనిమని అడగాలనీ, అవన్నీ ఉమ్మడి సొత్తుతో అభివృద్ధి చెందినవేనని చెప్పారు. రాజధాని రాష్ట్ర ప్రజల కోసం ఉండాలి తప్ప పెట్టుబడి కోసం కాదని జయశంకర్ బలంగా నమ్మే వారు.

భారత పార్లమెంటులో తెలంగాణకు సంపూర్ణ మద్దతు ఉన్నందున ప్రభుత్వం ఖచ్చితంగా ఉంటే తెలంగాణ సాధ్యమే. ఇప్పటికే జాతీయస్థాయిలో అపారమైన ‘విస్తృత అంగీకారం’ ఏర్పడినందువల్లనే డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. లెఫ్ట్ నుంచి రైట్ వరకు అందరూ రాతపూర్వక అంగీకారం తెలిపారు. దానికి జయశంకర్ గారే ప్రయత్నం చేశారు. లేఖలు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చారు. లేఖలు ఇచ్చిన వాళ్ళు మాటకు నిలబడితే లోక్‌సభలోని 545 మంది సభ్యుల్లో 500 మంది తెలంగాణకు అనుకూలమే. కనుక పార్లమెంటు నిర్ణయించాలి. ఇక్కడేదో ఆంధ్ర ప్రాంతపు నాయకుల అసమ్మతితో, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమ్మతితో సంబంధం లేదు. అది జరిగే పని కూడా కాదు.

ఇప్పుడు కేంద్రం చేయాల్సిందల్లా పార్లమెంటులో బిల్లు పెట్టడం. దానికి రాష్ట్ర శాసన సభ సమ్మతి అక్కరలేదు. అభిప్రాయం మాత్రమే కావాలి. ఆ అభిప్రాయం అనుకూలంగా ఉన్నా, ప్రతి కూలంగా ఉన్నా అది పార్లమెంటుకు బైండింగ్ కాదు. గతంలో గుజరాత్, మహారాష్ట్ర ఏర్పడినప్పుడు ఇటువంటి పరిస్థితే ఏర్పడితే కేంద్రం ఓవర్ రూల్ చేసింది. సుప్రీం కోర్టు దాన్ని సమర్థించింది. కనుక అల్టిమేట్ గా పార్లమెంటు నిర్ణయించాలని జయశంకర్ అప్పటి ప్రభుత్వానికి చెప్పారు. ప్రభుత్వం మీద ఆయనకు అపారమైన నమ్మకం కూడా ఉండేది. జయశంకర్ బతికున్న కాలంలోనే తెలంగాణ అనివార్యమని, డిసెంబర్ 9 ప్రకటన మీద నిలబడకుండా ఒత్తిడులకు కేంద్రం తలొగ్గదని గట్టిగా విశ్వసించారు.

ఒక వేళ అలా జరిగితే తెలంగాణలో అంతకంటే భీకరమైన పరిస్థితి తలెత్తుతుందని, చాలా అనర్థాలు జరుగుతాయని హెచ్చరించారు. జాతీయస్థాయిలో అన్ని పార్టీలు అర్థం చేసుకుని ప్రత్యేక రాష్ట్రం అవసరం, వాంఛనీయం, అనివార్యం అని నిర్ద్వంద్వంగా చెప్పిన తరువాత అడ్డంకి లేనేలేదని, ఒక వేళ ప్రభుత్వం వెనుకకు పోయినా స్వంతరాష్ట్రం సాధించాలన్న కలతో, తపనతో తెలంగాణ యువతరం అధికారపు ద్వారాలను బద్దలు కొట్టి అయినా ఆ కలను సాకారం చేసుకుంటదని అనేవారు. ఇప్పుడు ఆ అవసరం పడక పోవచ్చు. ఒక వేళ అవసరం పడ్డా అందుకు తెలంగాణ సిద్ధంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. సరిగ్గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ ఆలోచినస్తున్నది. ఇప్పుడు ఏర్పడ్డ నిపుణుల కమిటీ కూడా ఈ ప్రాతిపదికనే పనిచేస్తుంది. అలా అంటే ఇప్పుడు లేని జయశంకరే ఇంకా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా అని కూడా ఎవరైనా వెర్రి ప్రశ్నలు వేయవచ్చు. ప్రభుత్వాలను, సమాజాన్ని చివరకు మనుషులను కూడా పెట్టుబడే నడిపించదు. కొన్నిసార్లు కొన్ని ప్రామాణిక సూత్రాలు విలువలు అనుభవాలు కూడా నడిపిస్తాయి. వాటినే సిద్ధాంతాలు అని, అవి ఎలా నడుస్తాయో ప్రామాణికంగా చెప్పిన వారిని సిద్ధాంతకర్తలని అంటారు. వారినే కొందరు కాలజ్ఞానులని కూడా అంటారు. ఆ మాటలు జయశంకర్ కి ముమ్మాటికీ సరిపోతాయి. అదే ఇప్పుడు రుజువు కాబోతుంది. జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్తగా మాత్రమే కాదు, రాష్ట్రాల పునర్నిర్మాణ సూత్రాల్చఆవిష్కర్తగా కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతారు.
– ఘంటా చక్రపాణి
డాక్టర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం
( నేడు జయశంకర్ జయంతి)

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.