తెలంగాణ ఏర్పాటు ఇక ఆగదు : కేకే

హైదరాబాద్: తెలంగాణ నోట్ ఇక ఆగదని టీఆర్‌ఎస్ జాతీయ సెక్రటరీ జనరల్ కే కేశవరావు అన్నారు. తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదించిన సందర్భంగా ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజనతో తెలుగు జాతి రెండుగా విడిపోతుందనేది సరికాదని అన్నారు. విభజనతో రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన పేర్కొన్నారు. నోట్‌ను ఆమోదించినందుకు కేంద్ర కేబినెట్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. గత 50 ఏళ్లలో తాను మొదటిసారిగా సంతోషపడుతున్నానని కేశవరావు అన్నారు.

ఎన్నో మాటలను సహించినం: కేకే
ఇన్నాళ్లు తాము ఎన్ని మాటలను భరించినమని, ఎన్నో మాటలను సహించినమని కేకే అన్నారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించిందని, ఇదే పద్ధతిలో తెలంగాణ ప్రక్రియను ముందుకు తీసుకుపోవాలని కోరారు. లేకపోతే తాము ఒప్పుకోబోమని స్పష్టం చేశారు.

కేసీఆర్‌కు కృతజ్ఞతలు: కేకే
తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తెలంగాణ సాధనలో కేసీఆర్‌ది కీలకపాత్ర అని పొగిడారు. తనతోపాటు ఉద్యమాన్ని ముందుండి నడిపినందుకు కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన ఎంపీలు మందా జగన్నాథం, వివేక్‌లకు కూడా ధన్యావాదాలు అని పేర్కొన్నారు. వీళ్లు టీఆర్‌ఎస్‌లోకి వచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేశారని అన్నారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానాన్ని కేబినెట్ యథావిథిగా ఆమోదించడం చాలా సంతోషం అన్నారు. సీడబ్ల్యూసీ తెలంగాణ తీర్మానం శిలాశానంకాదని అన్న వాళ్లు దానికన్నా గొప్పదేదైనా ఉంటే దాన్ని అన్వయించుకోవాలని హితవు పలికారు. తెలంగాణ నోట్ రావడానికి సహకరించిన యూపీఏ మిత్ర పక్షాలు, ఎన్డీఏ పక్షాలు, బీఎస్పీ అధినేత్రి మాయావతికి కృతజ్ఞతలు తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.