తెలంగాణ ఏర్పడే వరకు ఉద్యమం చేస్తం: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ ఉద్యమం, టీఆర్‌ఎస్ పార్టీలు వేరువేరు కాదని ఆయన అన్నారు. దేశంలో అన్ని రాజకీయ నిర్ణయాలేనని, ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు చాలా తక్కువని కేసీఆర్ ఆవేదనతో అన్నారు. అయితే, ఈసారి కేంద్రంలో ఏ ఫ్రంట్ వచ్చినా టీఆర్‌ఎస్‌దే కీలకపాత్ర అని ఆయన జోష్యం చెప్పారు. తెలంగాణ అంశానికి దేశవ్యాప్తంగా మంచి ప్రాచుర్యం ఉందని ఆయన తెలిపారు.
అధికారంలోకి వస్తే దళితుడే సీఎం: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుడిని మొదటి ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

హింసలేకుండానే తెలంగాణ ఉద్యమం: కేసీఆర్
తెలంగాణ ఉద్యమంలో హింసకు తావులేదని కేసీఆర్ తెలిపారు. ఎలాంటి హింస లేకుండానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ కోసం ఇప్పటి వరకు అన్ని ప్రయత్నాలు చేశామని, తెలంగాణ సాధన కోసం ఉద్యమంతోపాటు రాజకీయ ప్రయత్నం కూడా కొనసాగుతుందని వెల్లడించారు.

నదీ జలాలు సమస్యేకాదు: కేసీఆర్
సీమాంధ్రులు దుష్ప్రచారం చేస్తోన్నట్టు సీమాంధ్ర-తెలంగాణల మధ్య నదీ జలాల పంపిణీ సమస్యే కాబోదని కేసీఆర్ తెలిపారు. కేంద్ర జలవనరుల సంఘం జల విధానం ప్రకారమే నదీ జలాల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు తెలంగాణకు రావాల్సిన నీటి కేటాయింపులు రావడంలేదని ఆయన ఆరోపించారు. ప్రజాప్రతినిధుల వల్లే దేశ ప్రజల మధ్య విద్వేషాలు పెచ్చరిల్లిపోతున్నాయని అన్నారు.

2014 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తం: కేసీఆర్
రాబోయే 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కేసీఆర్ తెలిపారు. ఇప్పటి వరకు ఏ పార్టీతో పొత్తుపెట్టుకున్నా ఎన్నికల అనంతరం తెలంగాణకు, తెలంగాణ ఉద్యమానికి అన్యాయం చేశాయని ఆయన ఆరోపించారు. అందుకే ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని పార్టీ నిర్ణయించిందని వివరించారు. అయితే, బయ్యారం ఉక్కును తట్టెడు కూడా విశాఖ ఉక్కుకు తరలించనీయ బోమని ఆయన హెచ్చరించారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినాదంతో ఉద్యమిస్తామని తెలిపారు.

తెలంగాణను సుసంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తెలంగాణను దేశంలోనే సుసంపన్న రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని కేసీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు అందేలా అభివృద్ధి కార్యక్రమాలు రూపొందిస్తామని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.