తెలంగాణ ఉద్యోగులపై సీమాంధ్ర అధికారుల కుట్రలు

-బదిలీలు, పదోన్నతుల పేరిట తెలంగాణ అధికారులపై కన్నెర్ర చూస్తూ వివక్ష కొనసాగిస్తున్నరు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్న తరుణంలోనూ సీమాంధ్ర పాలకులు, అధికారుల కుట్రలకు తెరపడటం లేదు. తెలంగాణ ప్రాంత అధికారులపై తీవ్ర వివక్షను కొనసాగిస్తూ.. ఉన్నత పదవుల్లోకి తమ ప్రాంతీయులను తీసుకొచ్చేందుకు వారు ఎడతెరిపిలేని కుట్రలు, కుతంవూతాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే రవాణాశాఖలోని హైదరాబాద్ నగర జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పోస్టును తన్నుకపోవడానికి సీమాంధ్ర పెద్ద గద్దలు కొన్ని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జేటీసీగా ఉన్న పాండురంగారావు తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికారి. ఆయనను ఇటీవల ప్రాధాన్యంలేని పోస్టుకు బదిలీచేశారు. గుంటూరుకు చెందిన డిప్యూటీ కమిషనర్ రఘునాథ్‌కు పదోన్నతి కల్పించి.. ఆయన స్థానంలో నియమించారు. అయితే ఈ వ్యవహారం వెనుక పెద్ద తతంగమే నడిచినట్టు తెలుస్తోంది. రఘునాథ్‌కు పదోన్నతి లభించగానే.. అతన్ని హైదరాబాద్ జేటీసీగా నియమించడానికి కొంతకాలంగా కుట్రలు సాగినట్టు సమాచారం. ఇందుకోసం రూ. 40లక్షల వరకు చేతులు మారినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

గుంటూరు అధికారిని హైదరాబాద్ నడిగడ్డపైకి అక్రమంగా తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక మంత్రి కీలక పాత్ర పోషించడం గమనార్హం. సదరు మంత్రి ద్వారానే పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారానట్టు తెలుస్తోంది. సకల జనుల సమ్మె సమయంలో యూని ఫాం డ్యూటీకి చెందిన మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్స్ కూడా సమ్మెలో పాల్గొన్నారు. రవాణాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచే తీవ్ర ఉద్యమాన్ని కొనసాగించారు. అయితే సీమాంధ్ర అధికారిని హైదరాబాద్ కార్యాలయానికి తరలించి.. తెలంగాణ ఉద్యోగులపై కఠినంగా వ్యవహరించాలనే కుట్రలు జరుగుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండేళ్లుగా హైదరాబాద్ జేటీసీగా పనిచేస్తున్న పాండురంగారావుపై ఏలాంటి ఆరోపణలు లేవు. అయినా ఆయనను బదిలీ చేయడంలో అంతర్యమేమిటని తెలంగాణ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రవాణాశాఖ జేటీసీగా పాండురంగారావు బదిలీని రద్దుచేయాలని టీజీవోల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియ సాగుతున్న ప్రస్తుత తరుణంలో బదిలీలు, పదోన్నతులు వెంటనే నిలిపివేయాలన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.